Home తాజా వార్తలు రాహుల్, పాండ్యాలు చేసింది తప్పే: కోహ్లీ

రాహుల్, పాండ్యాలు చేసింది తప్పే: కోహ్లీ

Virat Kohliబాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న భారత యువ క్రికెటర్లు రాహుల్, హార్ధిక్ పాండ్యాలు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సిఒఎ సైతం వివరణ కోరింది. ఈ నెల 6వ తేదీన ప్రసారమైన ఈ షోలో పాండ్యా, రాహుల్ లు శృంగార విషయాలపై మహిళలను కించపరిచేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే హార్ధిక్, రాహుల్ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. బిసిసిఐ కూడా వీరిపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. వీరిద్దరిపై రెండు మ్యాచుల నిషేదం ఉండనుందని తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఈ వ్యవహారంపై తాజాగా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. టీమిండియా ఇలాంటి వాటిని మద్దతు పలకదన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బాధ్యతగల క్రికెటర్లైన తాము అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించమని చెప్పుకొచ్చాడు. కాగా, అది పూర్తిగా వారి వ్యక్తిగతమన్న కోహ్లీ ఇలాంటి కామెంట్స్ చేయడం సరియైంది కాదని రాహుల్, పాండ్యాలు అర్థం చేసుకుంటారనుకుంటున్నానని విరాట్ అభిప్రాయపడ్డాడు. హార్ధిక్, రాహుల్ చేసిన కామెంట్స్ పై బిసిసిఐ సీరియస్ గా ఉందని, వారి తప్పుకు శిక్ష పడుతుందని కోహ్లీ పేర్కొన్నాడు. బిసిసిఐ నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు విరాట్  తెలిపాడు. వీరిపై బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Virat Kohli reacts to Hardik Pandya’s TV show controversy