మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం అర్ధరాత్రి 11.30 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసిన ఆనంతరం ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. దాదాపు 99.9శాతం బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు, లెక్కించిన ఓట్లలో పుతిన్ 76.67శాతం ఓట్లను సాధించినట్లు రష్యా ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. నాల్గోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికవడం గమనార్హం. 2000 సంవత్సరంలో ప్రారంభమైన పుతిన్ రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికల్లో గెలవడంతో 2024 వరకూ కొనసాగనుంది. 2012 వరకూ రష్యాలో అధ్యక్షుడి పదవీ కాలం నాలుగు ఏండ్లు మాత్రమే. కానీ 2012లో పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పదవీ కాలాన్ని నాలుగు నుంచి ఆరు సంవత్సరాలకు పెంచారు. రష్యాను అత్యధిక కాలం పాలించిన నియంత జోసఫ్ స్టాలిన్ తర్వాత ఎక్కువ కాలం అధ్యక్షుడిగా ఉన్న నాయకుడుగా పుతిన్ చరిత్రలో రికార్డు క్రియేట్ చేశారు. పుతిన్‌పై తీవ్ర వ్యతిరేక భావం ఉన్నప్పటికీ ఆయనకు మరో బలమైన ప్రత్యర్థి నేత లేకపోవడం, పుతిన్ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంతో ఏకపక్షంగా ఫలితం దక్కించుకున్నారు.