Home జాతీయ వార్తలు ఐఇడి కన్నా ఓటర్ ఐడి పవర్‌ఫుల్

ఐఇడి కన్నా ఓటర్ ఐడి పవర్‌ఫుల్

అహ్మదాబాద్‌లో ఓటేసిన ప్రధాని
తొలిసారి ఓటర్లదే ఈ శతాబ్దం

Modi

 

అహ్మదాబాద్: ఉగ్రవాదుల ఐఇడి (అభివృద్ధి పరచిన పేలుడు సాధనం) కన్నా ఓటర్ ఐడెంటిటీ కార్డ్ (ఐడి) చాలా శక్తివంతమైందని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం వ్యాఖ్యానించారు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఒకే విడతలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీ రానిప్ ప్రాంతంలో నిషాన్ హైస్కూల్‌లో ఓటేశారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారిలో తనకు స్వాగతం చెప్పడానికి బారులు తీరి నిలబడిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆయనకు స్వాగతం పలికి పోలింగ్ కేంద్రం వరకూ వెంట వెళ్లారు.

ఓటేసిన అనంతరం మోడీ కాస్త దూరం నడుచుకుంటూ వెళ్లి మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ‘భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఉగ్రవాదులకు ఐఇడి ఆయుధమైతే, ఓటర్ ఐడి (గుర్తింపు కార్డు) ప్రజాస్వామ్యం బలమేమిటో తెలిపే ఆయుధం. ‘ఓటర్ ఐడి కార్డు ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకోవాలి’ అని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ‘ఈరోజు (మంగళవారం) దేశంలో మూడో విడత పోలింగ్ జరుగుతోంది. నా సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఓటు వేసి, నా కర్తవ్యాన్ని నిర్వహించగలిగినందుకు గర్వపడుతున్నాను. ఓటర్ ఐడి ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకొని, ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయడానికి రావాలి. ప్రజాస్వామ్యమనే గొప్ప పండగలో నేనుకూడా చురుగ్గా పాల్గొనే అదృష్టం లభించినందుకు గర్వపడుతున్నాను. కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత కలిగే పవిత్ర భావన ఓటేసిన తర్వాత కలిగింది’ అని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు లోక్‌సభ ఎన్నికలకు మూడో విడత పోలింగ్ జరిగింది. మొదటిసారి ఓటు వేస్తున్న యువతరానిదే ఈ శతాబ్దం అని మోడీ వ్యాఖ్యానించారు.