Home మంచిర్యాల వామ్మో.. ప్రైవేట్ ఆసుపత్రులా!

వామ్మో.. ప్రైవేట్ ఆసుపత్రులా!

Wammy .. private hospital!

జోరుగా సాగుతున్న కమీషన్‌ల దందా
ఆసుపత్రులకు గుండెకాయ ఆర్‌ఎంపిలే
గ్రామాల నుంచి రోగులను పట్టణాలకు తరలింపు
ధనార్జనే ధ్యేయంగా రోగుల ప్రాణాలతో చెలగాటం
అనుమతులు లేకుండా ల్యాబ్‌ల నిర్వహణ
చోద్యం చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

మన తెలంగాణ/మంచిర్యాల : ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను నిలువు దోపిడి చేస్తున్నాయి. ధనార్జనే ద్యేయంగా వెలుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల నుంచి లక్షలాది రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఎక్స్‌రేలు, ఇతర పరీక్షలు అవసరం లేకున్నా కమీషన్‌లకు కక్కుర్తి పడి టెస్టులను రాస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు కేవలం ఆర్‌ఎంపి వైద్యుల పైననే ఆదారపడి నడుస్తున్నాయి. ఆర్‌ఎంపిలుకు ఎప్పటికి కప్పుడు పర్సెంటేజీలను ఇవ్వడమే కాకుండా వారికి విందులు, వినోదాలు ఏర్పాటు చేసి, మచ్చిక చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్సాలయాల పేరిట వాడకో ప్రైవేట్ ఆసుపత్రి వెలుస్తోంది. గతంలో ఆర్‌ఎంపి వైద్యులు ఎంతపెద్ద వ్యాధికైనా చికిత్స అందజేసే వారు అంతే కాకుండా ఆపరేషన్‌లు కూడా చేసేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. జ్వరం సోకినా ప్లేట్‌లెట్లు పడిపోయాయని బెదిరింపులకు గురిచేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వాహకులు ఆర్‌ఎంపి డాక్టర్లకు 25 నుంచి 30 శాతం పర్సెంటేజీలు అందజేస్తుండగా ఆర్‌ఎంపిలు కమీషన్‌ల కోసం కక్కుర్తి పడి గ్రామీణ ప్రాంతాల నుండి రోగులను పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 38కి పై గా ప్రైవేట్ ఆసుపత్రులు వెలిశాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో అవసరం లేకున్నా అడ్డమైన వైద్య పరీక్షలు, స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు రాస్తూ అడ్డగోలు బిల్లులు వసూలు చేస్తున్నారు. కొందరు డాక్టర్ పట్టా లేని వారు ప్రభుత్వం అనుమతి పొందకుండానే పెద్దపెద్ద అక్షరాలతో బోర్డులు, ప్లెక్సీలను ఏర్పాటు చేసి రోగులను ఆకట్టుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు ఎంతో నమ్మకంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే వారి జబ్బు నయం కాకముందే మరింత ప్రమాదం పొంచి ఉందని లక్షలాది రూపాయల బిల్లులు వసూలు చేసి, హైదరాబాద్‌లోని కార్పోరేట్ ఆసుపత్రులకు తలిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి మొదలుకొంటే హైదరాబాద్‌లోని కార్పోరేట్ ఆసుపత్రులు సైతం ఆర్‌ఎంపిలకు కమీషన్ చెల్లించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డిప్యూటీ రేంజ్ అధికారి మృతి చెందగా డాక్టర్‌లు నాటకం ఆడడంతో కుటుంబీలకు పెద్ద ఎత్తున ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. దీంతో స్పందించిన అధికారులు ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేయగా మళ్లీ మరుసటి రోజే తెరుచుకోవడం గమనార్హం. కాగా ప్రైవేట్ ఆసుపత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆసుపత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఆసుపత్రుల ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి న్యాయం చేయాలని మొర పెట్టుకున్నప్పటికి పోలీసులు వారిపై కేసులు నమోదు చేసింది నామమాత్రమే. ఈ వ్యవహారం బహిరంగంగానే సాగినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం కింద ఆసుపత్రులకు సంబంధించిన లైసెన్స్‌ల వివరాలు అడిగితే కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారంటే ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ఏ మేరకు వారికి మామూళ్లు అందజేస్తున్నారో చెప్పనవసరం లేదు. కాగా ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భీష్మాను వివరణ కోరగా అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులలో ఏ వ్యాధికి ఎంత ఫీజులు సూచించే బోర్డులను సైతం ఏర్పాటు చేస్తామన్నారు.