Home రాష్ట్ర వార్తలు తెలంగాణను ప్రజాస్వామ్యయుతం చేద్దాం

తెలంగాణను ప్రజాస్వామ్యయుతం చేద్దాం

వృత్తులు, సూక్ష్మ పర్రిశమలకు చేయూతనివ్వాలి
తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్

త్వరలో ఓయులో విద్యార్థి, నిరుద్యోగ భారీ బహిరంగ సభ

                  Srinivas-Reddy

మన తెలంగాణ/ఉస్మానియా యూనివర్సిటీ: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యయుతంగా మార్చుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని తెలంగాణ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాలలోని ప్రొ.ఎంఎల్‌ఎన్ రెడ్డి ఆడిటోరియంలో శుక్రవారం తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టివియువి) రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు నిజ్జెన రమేశ్ ముదిరాజ్ అధ్యక్షత జరిగింది. ప్రొ. కోదండరామ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఆర్థిక అభివృద్ధి ఫలితాలు, వనరులు ప్రజలందరికీ దక్కాలన్నారు. వ్యవసాయంతోపాటు వృత్తులు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు చేయూతనిచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరముందన్నారు. రాజకీయా లు స్వార్థంగా మారాయని, కాంట్రాక్టులే రాజకీయ అధికారానికి పరమావధిగా మారా య న్నారు. కానీ ప్రజల జీవితాలను బాగు చేసే రాజకీయాలు కావాలని,ఒక్కమాటలో చెప్పాలంటే పైసలో.. పాలనలో ప్రజలందరికీ వాటా దక్కాలన్నాన్నారు.

రాష్ట్రంలో అప్లికేషన్లు తప్ప .. అపాయింట్‌మెంటులు లేవన్నారు. ప్రస్తుతం అన్ని రకాల ఖాళీలతో కలిపి తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి  ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేసి… దాని ప్రకారమే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  కేవలం 15 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వంపై పోరాడుతున్న సంఘాలు కూడా  తమ సంఘాలను ప్రజాస్వామ్యయుతంగా నడుపుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో మీటింగ్‌లు పెట్టకుండా పోలీసులు ప్రిన్సిపాళ్లపై వత్తిడి తెస్తున్నారని తెలిపారు.  రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ నాటి నైజాం నవాబు వలే రాచరిక పాలన సాగుతుందని ‘మన తెలంగాణ’ పత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ అభివృద్ధి జరగాలని కానీ ఇచ్చిన వాగ్దాలను, మ్యానిఫెస్టోను అమలు పరచుకుండా మసిపూసిమారెడుకాయ చేస్తున్నారన్నారు. రూ.300 కోట్లతో కొత్త సెక్రటరీయేట్ నిర్మాణానికి అంత ఆతృత ఎందుకని ప్రశ్నించారు.  మొదట ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలని కోరారు. రాజుల సొమ్ము -రాళ్ళపాలు అనే సామెతను గుర్తు చేస్తూ  రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు.  వ్యవసాయం- పాలిహౌస్‌లు, పంటల బీమా పథకం మొదలైన వాటికి డబ్బులు ఎందుకు  విడుదల చేయడం లేదని, కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు పోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, పౌరహక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. తెలంగాణ జెఎసి కో చైర్మన్ డా. ఇటిక్యాల పురుషోత్తం మాట్లాడుతూ అమరుల స్ఫూర్తితో ముందుకుసాగుతూ హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు. విద్యార్థి,- నిరుద్యోగుల  హక్కుల సాధనకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే  ఉస్మానియా యూనివర్సిటీలో  విద్యార్థి- నిరుద్యోగులతో ‘విద్యార్థి- నిరుద్యోగ కురుక్షేత్ర’ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు నిజ్జెన రమేశ్ ముదిరాజ్  తెలిపారు.  ఈ కార్యక్రమంలో టివియూవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ సలీంపాషా, కోఆర్డినేటర్ బాబూ మహాజన్ పాల్గొన్నారు.