Home వార్తలు పూరీ డైరెక్షన్‌లో ముందుగా నటించాలనుంది : శర్వానంద్

పూరీ డైరెక్షన్‌లో ముందుగా నటించాలనుంది : శర్వానంద్

Sharwanandగమ్యం, ప్రస్థానం, అందరి బంధువయ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో శర్వానంద్. రన్ రాజా రన్, మల్లి మల్లి ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టి దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. సంక్రాంతికి రిలీజైన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ 50 రోజులు పూర్తి చేసుకొని ప్రధాన సెంటర్లలో విజయవంతంగా ఆడుతోంది. వరుస విజయాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శర్వానంద్ ఆదివారం తన బర్త్‌డేను జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా శర్వాతో ఇంటర్వూ విశేషాలు…
సంక్రాంతి హిట్ కొట్టాను…
‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో సంక్రాంతి హిట్ కొట్టాను. సినిమాకు మంచి కలెక్షన్లు రావడంతో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
ఎక్కువగా సినిమాలు చేస్తా…
ఇకనుంచి ఏడాదికి ఎక్కువగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. స్టోరీ, స్క్రీన్‌ప్లేను ఫైనల్ చేస్తూ తక్కువ గ్యాప్‌లో సినిమాలు చేస్తాను. ప్రస్తుతం చేయబోయే సినిమాల స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
ఈ ఏడాది మూడు సినిమాలు…
ఈ సంవత్సరంలో మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. కేశినేని నాని తమ్ముడు చిన్నితో ఓ సినిమా చేస్తాను. అలాగే ముగ్గురు డైరెక్టర్స్ కథలు రాస్తున్నారు. ఎవరి సినిమా ముందుగా మొదలుపెడతానో చెప్పలేను. బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చేవరకు ఏ సినిమా కూడా మొదలుపెట్టను.
ఐదేళ్ల క్రిందటి సినిమా…
తమిళ్‌లో ఐదేళ్ల క్రిందట చేసిన సినిమా ‘రాజాధి రాజా’. మొదట ఈ సినిమాకు ‘ఏమిటో ఈ మాయ’ అనే టైటిల్ అనుకున్నాం. ఇప్పుడు ‘రాజాధిరాజా’ అనే టైటిల్ పెట్టినట్లున్నారు. ఆ సినిమాలో నా క్యారెక్టర్ పేరు జెకె. ఇప్పుడు రాజా అని మార్చారు.
థ్రిల్లర్ మూవీ కూడా చేస్తా…
కథ నచ్చితే థ్రిల్లర్ సినిమాల్లో చేస్తాను. కానీ అలాంటి సినిమాలకు రిపీటెడ్ ఆడియన్స్ ఉండరు. తక్కువ బడ్జెట్‌లో జాగ్రత్తగా ఇటువంటి సినిమా చేసుకోవాలి. కానీ నాకు ఎక్కువగా లవ్ స్టోరీలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలు వస్తున్నాయి.
తెలుగు సినిమాలపైనే నా దృష్టి…
తమిళం నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అక్కడ ఎక్కువ సినిమాలు చేయాలనుకోవట్లేదు. మొదట తెలుగులో హీరోగా మంచి పాపులారిటీని తెచ్చుకున్న తర్వాతే తమిళంలో చేస్తాను. నా దృష్టంతా ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే.
దర్శకనిర్మాతలు ముందుకు వస్తున్నారు…
శర్వానంద్ ఈ సినిమా కూడా చేయగలడని పలువురు దర్శకులు చాలా నమ్మకంగా ఉన్నారు. నిర్మాతలు కూడా నాతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ విషయంలో దేవుడికి థాంక్స్ చెప్పాలి.
రిస్క్‌లో పెట్టలేను…
లిమిటెడ్ బడ్జెట్‌లోనే సినిమా చేయాలనుకుంటాను. ఒక సినిమా హిట్ అయింది కదా అని ఎక్కువగా ఖర్చుపెట్టలేము. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్‌ను రిస్క్‌లో పెట్టలేను. ప్రస్తుతం ప్రతి సినిమాకు ప్రొడ్యూసర్స్ నా రెమ్యునరేషన్ పెంచి ఇస్తున్నారు.
ఆ దర్శకులతో చేయాలనుంది…
స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, మణిరత్నం, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులతో పనిచేయాలనుంది. పూరీ డైరెక్షన్‌లో ముందుగా నటించాలనుంది. ఆయన సినిమాల్లో హీరోలకు స్పెషల్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి.
నిత్య మంచి నటి…
నేను ఇప్పటివరకు నటించిన హీరోయిన్లందరిలో నిత్యామీనన్ అంటే నాకు ఇష్టం. తను చాలా బాగా నటిస్తుంది. తన డైలాగ్ డెలివరీ కూడా బావుంటుంది.
ఆ రేంజ్ హిట్స్ రావడం లేదు…
మూడు సంవత్సరాలుగా నా కెరీర్ చాలా బావుంది. వరుసగా హిట్స్ వస్తున్నాయి. కానీ గమ్యం, ప్రస్థానం రేంజ్‌లో ఇంకా హిట్ రాలేదనే అనుకుంటున్నాను.