Home ఎడిటోరియల్ యుద్ధం కోసం అబద్ధాలు

యుద్ధం కోసం అబద్ధాలు

వాహెద్ అబ్దుల్

బ్లెయిర్ తప్పుల చిట్టా విప్పిన చిల్కోట్ రిపోర్టు

IRAQ-with-tony-blairఇరాక్ యుద్ధం ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నకు ఇప్పుడు ఎవరివద్ద సరయిన సమాధానం లేదు. సద్దామ్ హుస్సేన్ వద్ద జనసంహారక ఆయుధాలున్నాయని, ప్రపంచశాంతికి అతని వల్ల చాలా ప్రమాదం ముంచుకు వచ్చేస్తోందని అమెరికా, బ్రిటన్లు చేసిన ప్రచారం అబద్దాల పుట్ట అన్నది ఎప్పుడో తేలిపోయింది. అబద్దాలు ప్రచారం చేసి, యుద్ధానికి దిగి ఇరాక్ ను సర్వనాశనం చేసిన ఈ రెండు దేశాలు ఇప్పుడు అసలు ఇరాక్ యుద్ధం ఎందుకు చేశాయో చెప్పలేని స్థితిలో ఉన్నాయి.
ఇరాక్ యుద్ధం 2003లో జరిగింది. యుద్ధానికి ఎనిమిది నెలలు ముందే బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ అమెరికా అధ్యక్షుడికి ”ఏదేమైనా నేను మీతో ఉన్నాను“ (I am with you, whatever) అంటూ బ్లాంక్ చెక్ రాసిచ్చినట్లు మాటిచ్చాడన్నది కూడా ఇప్పుడు బట్టబయ లైంది. అరకొర ఇంటిలిజెన్సు సమాచారం, అవకతవక న్యాయసలహాలతో ఇరాక్ పై యుద్ధానికి టోనీ బ్లెయిర్ సిద్ధమయ్యాడు. ఈ వాస్తవాలన్నీ ఇప్పుడు చిల్కోట్ రిపోర్టు బయటపెట్టింది.
ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ పాల్గొనడంపై వేసిన అధికారిక కమిటీ, ఏడు సంవత్సరాల పాటు విచారించింది. చివరకీ “ఇరాక్ ఎంక్వయిరీ కమిటీ” తన నివేదికను సమర్పిం చింది. ఈ కమిటీకి జాన్ చిల్కోట్ సారథ్యం వహించారు. కమిటీ నివేదికలో అప్పటి ప్రధాని టోనీబ్లెయిర్ ను తూర్పార బట్టింది. అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ కు బ్లాంక్ చేక్ ఇచ్చినట్లు ఏదేమైనా నేను మీతో ఉంటాను అని టోనీ బ్లెయిర్ మాటిచ్చాడన్నది చాలా మందికి మింగుడుపడని విషయమైంది.
ఇరాక్ యుద్ధానికి ముందు బ్రిటన్ ప్రభుత్వం సమస్య పరిష్కారానికి దౌత్యపరమైన మార్గాలను పరిగణ నలోకి తీసుకోనే లేదని చిల్కోట్ రిపోర్టు విమర్శించింది. అమెరికాతో కలిసి ఇరాక్ పై యుద్ధానికి వెళితే తమకు ఉగ్రవాద ప్రమాదం పెరుగుతుందని జాయింట్ ఇంటిలి జెన్స్ కమిటీ చేసిన హెచ్చరికను కూడా ఆయన పెడచెవిన పెట్టాడు. ఇరాక్ నిరాయుధీకరణ మాత్రమే లక్ష్యంగా బ్రిటన్ యుద్ధం చేసింది కాని అమెరికా మాత్రం అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి యుద్ధం చేసింది. అయితే అమెరికా వద్ద పలుకుబడి పెంచుకోవడానికి అమెరికాకు పూర్తి మద్దతివ్వడమే మంచిదని బ్లెయిర్ భావించాడు. 2002 జులైలోనే బ్లెయిర్ ఒక రహస్యలేఖలో నేను మీతో ఉన్నానని మాటిచ్చాడు. ఈ విషయాలన్నీ చిల్కోట్ రిపోర్టులో ప్రస్తావనకు వచ్చాయి.
బ్రిటన్ ఎలాంటి ఏర్పాట్లు లేకుండానే యుద్ధంలోకి దూకింది. యుద్ధంలో 4497 మంది అమెరికా సైని కులు, 179 బ్రిటన్ సైనికులు మరణించారు. ఖర్చుల గురించి కూడా ఎలాంటి అంచనాలు లేకుండా యుద్ధా నికి దిగారు. ఇరాక్ యుద్ధం వల్ల బ్రిటన్ పై అప్పట్లో 9.2 బిలియన్ యూరోల భారం పడింది.
టోనీబ్లెయిర్ ఇప్పుడు కూడా పశ్చాత్తాపపడడం లేదు. తాను యుద్ధానికి వెళ్ళి మంచిపనే చేశానని అంటు న్నాడు. నేడు టెర్రరిజానికి నాటి ఇరాక్ యుద్ధానికి సంబంధం లేదని అంటున్నాడు. వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన ఒకే ఒక్క లేబర్ పార్టీ నాయకుడు టోనీ బ్లెయిర్. బ్రిటన్లో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న ఈ నాయకుడికి ఇరాక్ యుద్దం మాయని మచ్చగా మారింది. చిల్కోట్ రిపోర్టు ఇరాక్ యుద్ధాన్ని స్పష్టమైన పదాల్లో అన్యాయం, చట్టవిరుద్దమని చెప్పలేదు కాని, రిపోర్టును చదివిన వారికి అలాంటి అభిప్రాయమే కలుగుతుంది. అలాంటి అన్యాయమైన యుద్ధంలో బ్రిటన్ను దింపిన వాడు టోనీ బ్లెయిర్. ఆయన దాదాపు పదిసంవత్సరాలు ప్రధానిగా ఉన్నాడు. కాని ఇరాక్ యుద్ధంతో తాను సంపాదించు కున్న పేరు ప్రఖ్యాతులన్నీ నాశనమయ్యాయి.
జాన్ చిల్కోట్ ఈ యుద్ధం గురించి మాట్లాడుతూ, యుద్ధానికి చట్టబద్దత ఉందనడానికి సంతృప్తికరమైన కారణాలు మాకు కనబడలేదు అన్నారు. ఇరాక్ యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబసభ్యులు టోనీ బ్లెయిర్ ఒక పెద్ద అబద్దాలకోరు అని బహిరంగం గానే నిందిస్తున్నారు. ఈ విమర్శలు, నిందల నుంచి తనను ఈ నివేదిక బయటపడేలా చేస్తుందని టోనీ బ్లెయిర్ ఆశించాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా నేను ఒక మంచి ఉద్దేశ్యంతో ఇరాక్ పై యుద్ధా నికి ఒప్పుకున్నాను. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ పని చేశానంటున్నాడు.
ఇరాక్ యుద్ధంలో మరణించిన బ్రటిషు సైనికుల బంధువులు చిల్కోట్ రిపోర్టును పరిశీలిస్తున్నారు. బ్లెయిర్ ను యుద్ధనేరస్తుడిగా కేసు వేసే అవకాశాలను అధ్య యనం చేస్తున్నామని కూడా కొందరన్నారు. మార్చి 2003లో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ కు బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ కు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల గురించి కూడా చిల్కోట్ రిపోర్టు ప్రస్తావించింది. వారిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు కుదిరాయన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ సందర్భంగానే టోనీ బ్లెయిర్ రాసిన ”నేను మీతో ఉన్నాను“ అన్న లేఖ వెలికి వచ్చింది. టోనీ బ్లెయిర్ అమెరికా వ్యూహాన్ని ప్రభావితం చేయాలనుకున్నాడు, కాని అలా చేయలేకపోయారని చిల్కోట్ తన నివేదికలో పేర్కొన్నారు. మార్చి 2003లో సద్దామ్ హుస్సేన్ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ కనబడలేదు. అయినా యుద్ధానికి వెళ్లారు, యుద్ధం తర్వాత ఇరాక్ లో తలెత్తే పరిస్థితుల గురించి ముందస్తు అంచనాలు కూడా టోనీ బ్లెయిర్ కు లేవు. 2009 నాటికి దాదాపు లక్షన్నర మంది ఇరాకీ పౌరులు మరణించారు. పదిలక్షల మంది నిరాశ్రయులయ్యారు.
శాంతియుత మార్గాలను అన్వేషించకుండానే బ్రిటన్ యుద్ధానికి నడుం కట్టిందని రిపోర్టు టోనీ బ్లెయిర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అంతేకాదు, ఆ విధంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అధికారాలను కూడా కాలదన్నిందని చిల్కోట్ విమర్శించారు.
ఇరాక్ పై యుద్ధానికి దిగింది అక్కడ జనసంహారక ఆయుధాలున్నాయన్న నెపంతో. దానికి చూపించిన ఆధారాలు ఇంటిలిజెన్స్ సమాచారం. ఆ సమాచారం అంతా తప్పుల తడక అని తేలిపోయింది. నిజానికి ఇంటిలిజెన్స్ సమాచారాన్ని నిర్ధారించుకోవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. టోనీ బ్లెయిర్ అలాంటి పని చేయాలేదు. యుధ్ధం తర్వాత ఇరాక్ లో ఎలాంటి జనసంహారక ఆయుధాలు కనబడలేదు. టోనీ బ్లెయిర్ చెప్పినట్లు ప్రపంచానికి ముంచుకు వచ్చిన ప్రమాదమేమీ అక్కడ లేదు. ఆ వెంటనే టోనీ బ్లెయిర్ మాట మార్చి సద్దామ్ హుస్సేన్ అలాంటి జనసంహారక ఆయుధాలు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిసిందన్నాడు. అంటే ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉల్లంఘిస్తున్నాడని కూడా అన్నాడు. అసలు ఆ యుద్ధాని కి ఐక్యరాజ్యసమితికి సంబంధమే లేదు. అలాంటి ఉల్లంఘనలు జరిగితే ఐక్యరాజ్యసమితి చర్య తీసుకునేది. ఈ విషయాలను చిల్కోట్ ప్రస్తావిస్తూ, యుద్ధానికి ముందు టోనీ బ్లెయిర్ చెప్పింది వేరు, యుద్ధం తర్వాత చెప్పింది వేరని విమర్శించాడు.
ఇరాక్ యుద్ధం నేటికి కూడా ముగియలేదు. అక్కడ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామమాత్రపు ప్రభుత్వమొకటి పనిచేస్తోంది. అక్కడ చాలా భాగాన్ని నేడు ఐసిస్ అదుపు చేస్తోంది. బగ్దాద్ లో ఇటీవల జరిగిన కారుబాంబు పేలుడులో 250 మంది మరణించారు. ఇరాక్ యుద్ధం నుంచి గుణపాఠాలు గ్రహించడానికి ఈ విచారణ జరిగింది. కాలాన్ని మనం వెనక్కి తిప్పలేం. కాని మనం గుణపాఠాలను నేర్చుకోడానికి ఇవి పనికి వస్తాయని కన్సర్వేటివ్ పార్టీకి చెందిన ప్రస్తుత ప్రధాని కేమరూన్ అన్నారు.
చిల్కోట్ నివేదిక వచ్చిన తర్వాత టోనీ బ్లెయిర్ బాధ్యత తనదే అని ఒప్పుకున్నాడు. అయితే తాను మంచి ఉద్దేశ్యంతో యుద్ధానికి దిగానని అన్నాడు. విచిత్రమే మంటే, ఇప్పుడు చాలా గొప్పగా గుణపాఠాలు గ్రహిం చాలని చెబుతున్న డేవిడ్ కేమరూన్ కూడా 2003లో యుద్ధానికి అనుకూలంగానే ఓటు వేశాడు. స్టాప్ వార్ కోయలిషన్, సిఎన్డి వంటి సంస్థలు టోనీ బ్లయిర్ ను యుద్ధనేరస్తుడిగా విచారించాలని ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నాయి. టోనీ బ్లెయిర్ ఒక హంతకుడని ఆరోపిస్తున్నాయి. బహుశా ఇరాక్ యుద్ధంలో మరణిం చిన సైనికుల బంధువులు టోనీ బ్లెయిర్ పై ప్రైవేటు కేసు వేసే అవకాశాలున్నాయని కొందరి అభిప్రాయం. టోనీ బ్లెయిర్ ప్రధానిగా చేసిన సేవలన్నీ … కనిష్ట వేతనాల నిర్ణయం, గుడ్ ఫ్రయిడే ఒప్పందం, మూడు వరుస గెలుపులు ఇలా సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలన్నీ ఇరాక్ యుద్ధంతో నాశనమైపోయాయి. ఇప్పుడు టోనీ బ్లెయిర్ అంటే ఇరాక్ యుద్ధం మాత్రమే ఎవరికైనా గుర్తొస్తుంది. లేబర్ పార్టీకి చెందిన టోనీ బ్లెయిర్ పై వచ్చిన ఈ మచ్చ లేబర్ పార్టీని కూడా కుదిపేస్తోంది. సిరియాలో నేటి పరిస్థితి, ఇరాక్లో నేటి పరిస్థితి, ఐసిస్ ప్రమాదం వీటన్నింటికి కారణం ఇరాక్ యుద్ధమే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
-7093788843