Home వరంగల్ బల నిరూపణలో రాజకీయ పార్టీలు

బల నిరూపణలో రాజకీయ పార్టీలు

warangal-by-pollప్రధాన అభ్యర్ధుల నామినేషన్ – 4న గులాబీ బలపరీక్ష
మన తెలంగాణ/వరంగల్ : ప్రతిష్టాత్మకంగా మారిన వరంగల్ ఉప ఎన్నిక సమరానికి ప్రధాన రాజకీయ పార్టీలు బలాబలాల నిరూపణకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల రణరంగంలో ముందు నిలిచేందుకు టిఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, బిజెపి, టిడిపి కూటమి పోటీపడి ప్రణాళికలు రచిస్తు న్నారు. అధికార పక్షంపై విపక్షాలు విమర్శలదాడిని తీవ్రం చేయగా సంక్షేమానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం వేసిన పెద్ద పీటను ప్రజల్లోకి తీసు కెళ్ళేందుకు అధికార పక్షం శక్తియుక్తులను కేంద్రీకరిస్తోంది. నామినేషన్ల నుంచే పరస్పర విమర్శల దాడిని తీవ్రం చేసుకు న్నారు. ఉప ఎన్నిక బరిలో నిలుస్తున్న టిఆర్ ఎస్, కాంగ్రెస్, వామ పక్షాలు బలపరిచిన అభ్యర్ధులు సోమ వారం నామినేషన్లు దాఖలు చేశారు. నిన్నమొన్నటి వరకు అభ్యర్ధుల ఎంపీక కసరత్తులో నిమగ్నమైన టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ముందు జాగ్రత్తగా మొదటి దశ నామినేషన్లను పూర్తి చేసుకున్నాయి. ఆఖరి రోజు మరోసారి నామినేషన్లు దాఖలు చేసేందుకు టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సిద్ధమవుతున్నాయి. చివరి రోజు బలనిరూపణకు గులాబీలు సమాయ త్తమవుతున్నారు. ఆలశ్యంగా తమ అభ్యర్ధిని ఎంపిక చేసిన బిజెపి సైతం చివరి రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భారీగా కార్యకర్తలను సమీకరించాలని భావిస్తున్నారు.

నామినేషన్ల హంగామా : నామినేషన్ల సందర్భంగా రాజకీయ పక్షాలు హంగామా చేశాయి. ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్‌ను అభ్యర్ధిగా ముందుగానే ప్రకటించిన వామపక్షాలు నామినేషన్ సందర్భంగా హన్మకొండ ఏకశిలపార్కులో సభ నిర్వహించారు. కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, అభ్యర్ధి గాలి వినోద్,జిల్లా కార్యదర్శులు తక్కళ్ళ పల్లి, సారంపల్లిలతో పాటు వామపక్ష, సామాజిక, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. వామపక్ష నేతలు చాడా, తమ్మినేనిలు మాట్లాడుతూ హామీల అమలులో టిఆర్‌ఎస్ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య జిల్లా కాంగ్రెస్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు వచ్చారు. అభ్యర్ధి సిరిసిల్లతో పాటు మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల, మాజీ మంత్రి బస్వ రాజు సారయ్య, మాజీ చీఫ్‌విప్ గండ్ర, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యా సాగర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ది చెప్పేదొకటి, చేసేదొకటిగా మారిందన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, డాక్టర్ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, పార్టీ నగర అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపక్షాలకు అభ్యర్ధులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. సంక్షేమంలో తమ సర్కార్ ముందుందన్నారు.

4న గులాబీ బలపరీక్ష
నామినేషన్ల దాఖలు నుంచే బలబలాలను ప్రదర్శించి ఓటర్లపై గట్టి ప్రభావం చేసేందుకు టిఆర్‌ఎస్, బిజెపిలు సన్నాహాలు చేస్తున్నాయి. నామినేషన్లకు ఆఖరి రోజైన 4వ తేదీన భారీగా కార్యకర్తలను సమీకరించి పోటాపోటీగా ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టిఆర్‌ఎస్ 4వ తేదీన బాలసముద్రం గ్రౌండ్‌లో భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. 20వేల మందితో సభ జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు సభకు సంబంధించిన గ్రౌండ్‌ను సోమవారం ఆ పార్టీ ఎమ్మెల్యే వినయ్, జిల్లా, గ్రేటర్ అధ్యక్షులు తక్కళ్ళపల్లి, నన్నపునేని, అభ్యర్ధి పసునూరి, పార్టీ నాయకులు రాజయ్యయాదవ్, నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. ఈ సభకు ఉప ముఖ్యమంత్రి కడియం, రాష్ట్ర మంత్రులు, పార్టీ నాయకులు పాల్గొంటారని ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. ఇదిలా కాంగ్రెస్ సైతం చివరి రోజు మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నది. బిజెపి నామినేషన్ దాఖలు సందర్భంగా రాష్ట్ర నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. భారీగా కార్యకర్తలను సమీకరించాలని టిడిపి, బిజెపి యోచిస్తున్నది.