Search
Sunday 23 September 2018
  • :
  • :

సాహితీ కేంద్రంగా వరంగల్

kadiyamమన తెలంగాణ/నయీంనగర్: ఉమ్మడి వరంగల్ జిల్లాను సాహితీ కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. నయీంనగర్ వాగ్దేవి కళాశాల ప్రాంగణంలోని సెమినార్ హాల్‌లో ఓరుగల్లు కళావైభవ కమిటీ ఆధ్వర్యంలో ఓరుగల్లు కళావైభవం గ్రంథావిష్కరణ సభ సోమవారం జరిగింది. కేంద్ర సాహిత్య అవార్డు పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కడియం శ్రీహరి విచ్చేసి ఓరుగల్లు కళావైభవం గ్రంథావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాహితీ రంగంలో ఓరుగల్లు వాసులు ఎనలేని కృషి చేస్తున్నారని, సాహిత్య రంగాన్ని, తెలుగు భాషను ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తుందని, అందుకు అనుగుణంగా వరంగల్ పట్టణాన్ని ఒక సాహిత్య కేంద్రంగా ఏర్పాటు చేసి సాహితీ ప్రియులకు వరంగల్ ఒక దిక్సూచి అయ్యే విధంగా కృషి చేయా లని సాహితీ ప్రియులను, కవుల ను, కళాకారులను కోరారు. కవులను, రచయితలను ప్రోత్సహించి చరిత్రను వెలికి తీసి భావితరాలకు ఉపయోగపడే విధంగా వ్యాసాలు ప్రచురించాలని,  వాస్తవిక చరిత్రను ప్రజలకు తెలియజేసే విధంగా కృషి చేయాలని కోరారు. వరంగల్ జానపద కళలకు పెట్టింది పేరని తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారుల పాత్ర మరువలేనిదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాహిత్య కేంద్రానికి రాజమండ్రి కేంద్ర బిందువుగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరంగల్ సాహితీ కేంద్రంగా ఎదుగుతుందని అందుకు అనుగుణంగా సమిష్టి కృషితో వరంగల్ పట్టణంలో సాహితీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అందుకు ఎన్ని నిధులైనా రాష్ట్ర ప్రభుత్వంచే ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షులు పేర్వారం రాములు, గిరిజా మనోహర్‌రావులతో పాటు పలువురు సాహితీ ప్రియులు, కవులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments