Home అంతర్జాతీయ వార్తలు పరుగు ప్రాణం మీదికి తెచ్చింది

పరుగు ప్రాణం మీదికి తెచ్చింది

sharath

అమెరికాలో వరంగల్ యువకుడి విషాదాంతం

మిస్సోరి: అమెరికాలో వరంగల్‌కు చెందిన విద్యార్థి కొప్పు శరత్ ప్రాణ భయంతో పరుగులు తీసి చివరికి ప్రాణాలే కోల్పొయ్యారు. అమెరికాలోని కాన్సస్‌లోని ఒక రెస్టారెంట్‌లో శుక్రవారం రాత్రి దుండగుడి కాల్పుల్లో బలి అయ్యాడు. ఒక రెస్టారెంట్‌లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ మిస్సోరికాన్సస్ యూనివర్శిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న శరత్ రెస్టారెంట్‌కు వచ్చాడు. అదే సమయంలో చారలున్న గోధుమ రంగు షర్టు వేసుకుని రెస్టారెంట్‌లోకి చొచ్చుకు వచ్చిన సాయుధుడు అందరినీ డబ్బులు అడుగుతూ బెదిరించాడు. కాల్పులకు దిగాడు. దీనితో ప్రాణభయంతో రెస్టారెంట్ వెనుక వైపు పరుగులు తీస్తున్న శరత్‌ను దుండగుడు వెనక నుంచి కాల్చాడని రెస్టారెంట్‌లో పనిచేసే వర్కర్ ఒకరు తెలిపారు. జరిగిన ఘటనకు ఈ వర్కర్ సాక్షంగా ఉన్నారు. దుండగుడి విచక్షణారహిత కాల్పులతో జేస్ ఫిష్ అండ్ చికెన్ రెస్టారెంట్ భీభత్సంగా మారింది. సాయుధుడు రెస్టారెంట్‌లోకి ప్రవేశిస్తూనే అక్కడున్న వారు కుర్చీలు, బల్లల కింద నక్కారు అయితే ఏదో విధంగా కాల్పుల నుంచి తప్పించుకోవాలనే తపనతో ఉన్న 26 ఏండ్ల శరత్‌ను సాయుధుడు వెనక నుంచి వెన్నులో కాల్చడంతో అక్కడికక్కడే కూలబడిపోయాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తరువాత చికిత్సకు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. రెస్టారెంట్‌లో నుంచి తమకు ఐదు సార్లు కాల్పుల చప్పుళ్లు విన్పించాయని సమీపంలో హైవే పక్కన ఉన్న హోటల్‌లోని సిబ్బంది తెలిపారు. తాము బయటకు వచ్చేసరికి సాయుధుడు పారిపోతూ ఉండటం కన్పించిందని వెల్లడించారు. పోలీసులు అనుమానిత దుండగుడికి సంబంధించిన ఫోటోలను వెలువరించారు. కాల్పులకు ముందు రెస్టారెంట్‌లో ఉన్న దుండగుడి ఫోటోలు, కాల్పులకు ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. దుండగుడి సమాచారం తెలియచేసిన వారికి పదివేల డాలర్ల బహుమతిని స్థానిక పోలీసులు ప్రకటించారు. కొప్పు శరత్ తెలంగాణలోని వరంగల్ నగరానికి చెందిన వాడు. సాఫ్ట్‌వేర్‌లో మాస్టర్స్ కోర్సు చేస్తున్నారని వెల్లడైంది. కాన్సస్‌లోనే ఒక రెస్టారెంట్‌లో ఉద్యోగం చేసుకుంటూ విద్యను అభ్యసిస్తున్నాడు. శరత్ తొలుత ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే ఎంఎస్‌లో సీటు రావడంతో నిబంధనల మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు, తీరిక సమయంలో రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. శరత్ సోదరి వివాహం త్వరలోనే జరగాల్సి ఉంది. ఈ పెళ్లికి వచ్చేందుకు శరత్ సిద్ధం అవుతున్నాడు. ఈ దశలోనే తూటాలకు బలి కావల్సి వచ్చింది. ఎంఎస్ చదువుతున్న కొడుకు క్యాంపస్‌లోనే ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నట్లు, అక్కడి రెస్టారెంట్‌లోనే పని చేస్తున్నట్లు తెలియదని , త్వరలోనే ఇంటికి వస్తాడనుకున్న కొడుకు శవంగా వస్తూ ఉండటం బాధగా ఉందని తండ్రి రామ్మోహన్ నిట్టూర్చారు.
శరత్ కుటుంబానికి సాయం : సుష్మా స్వరాజ్
కాన్సస్‌లో కాల్పులలో మృతి చెందిన శరత్ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సాయం అందిస్తుందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. యువ విద్యార్థి శరత్ కుటుంబానికి సుష్మా సంతాపం తెలిపారు. జరిగిన ఘటనకు సంతాపం వ్యక్తం చేస్తున్నామని, అమెరికా పోలీసు, అధికార యంత్రాంగంతో దీనిపై మాట్లాడుతామని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమె ఒక ప్రకటన వెలువరించారు. హైదరాబాద్‌లో ఉంటున్న శరత్ తండ్రి రామ్మోహన రెడ్డితో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు , ఆయనను ఓదార్చినట్లు వివరించారు. శరత్ కుటుంబ సభ్యులు కోరుకుంటే వారు అమెరికాకు వెళ్లేందుకు వీసా తదితర ఏర్పాట్లు చేస్తామని, లేదా సాధ్యమైనంత త్వరగా శరత్ భౌతిక కాయాన్ని స్వస్థలం తీసుకువచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అధికారుల బృందం కాన్సస్ సిటీకి బయలుదేరిందని, అక్కడి ఘటనపై ఆరాతీస్తుందని, పోలీసు అధికారులతో మాట్లాడుతుందని చికాగోలోని భారతీయ కాన్సులేట్ జనరల్ కార్యాలయం అధికారులు ఇప్పటికే తెలియచేశారు.
తరలింపునకు విరాళాలు.. భారీ స్పందన
గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించిన శరత్ కొప్పు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడం కోసం చేపట్టిన క్రౌడ్ ఫండింగ్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. కేవలం మూడు గంటల్లో 25 వేల డాలర్ల విరాళాలు అందాయి. అమెరికాలో శరత్‌తో పాటు ఉంటున్న అతని బంధువు రఘు ‘గో ఫండ్ మీ’ అనే అకౌంట్ ద్వారా నిధులను సేకరిస్తున్నారు.