Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

వార్డెన్ చితకబాదుతోంది

పశువులతో సమానంగా చూస్తోంది

ఎవరికీ చెప్పొద్దంటూ భయపెడుతోంది

ఎంఇఒకు ఆశ్రమ విద్యార్థుల వినతి

వార్డెన్‌ను సస్పెండ్ చేయాలి: సేవాలావ్ విద్యార్థి సేన

Wardenబూర్గంపహాడ్ : “ మా వార్డెన్ చితకబాదుతోంది.. పశువులను చూసినట్టు చూస్తోంది… అంతకంటే దారుణంగా కొడుతోంది… ఎవరికైనా చెబితే మరింతగా చిత్రహింసలు పెడతానని భయపెడుతోంది… ఎందుకు తిడుతుందో తెలియదు.. ఎందుకు కొడుతుందో తెలియదు.. అయ్యా మీరే మమ్మల్ని రక్షించాలి… మేమికా అక్కడ ఉండలేము…” ఇదీ ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల గోడు. “ఎంతో నమ్మకంతో హాస్టల్‌కు పంపిస్తున్నాం…
కన్నపిల్లల్లా చూసుకుంటున్నారని అనుకుంటున్నాం… హాస్టల్‌లో ఎలా ఉందమ్మా.. అంటే ఇంతవరకూ అక్కడి పరిస్థితిని మా పిల్లలు చెప్పలేదు… ఇంటికొస్తే ఒంటినిండా దెబ్బలే.. అసలేం జరిగిందని నిలదీస్తే.. అప్పుడు చెప్పారు అసలు విషయం.. ఆ వార్డెన్‌కు శిక్ష పడాల్సిందే బాబూ..” ఇదీ విద్యార్థినుల తల్లిదండ్రుల వేడుకోలు.

ఇంతకీ అసలేం జరిగిందంటే… బూర్గంపాడు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గుగులోత్ సంధ్య, గుగులోత్ కళ్యాణీలు చదువు కుంటున్నారు.
సోమవారం సాయంత్రం ఒకేసారి అక్కడి వార్డెన్‌కు పూనకమొచ్చింది. ఇద్దరినీ చితకబాదింది. దీంతో విద్యార్థులు ఇంటికెళ్లారు. బుధవారం తల్లిదండ్రులతో కలిసి ఎంఇఒ వెంకటేశ్వరరావుకు తమ గోడు విన్నవించారు. వార్డెన్ కొట్టడంతో అయిన గాయాలకు సంబంధించి స్కానింగ్ రిపోర్టులను చూపిస్తూ వారి బాధను వివరించారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు వేడుకున్నారు.

వార్డెన్‌కు సస్పెండ్ చేయాలి: తహసీల్దార్‌కు వినతి విద్యార్థులను చితకబాదుతూ, వారిని భయబ్రాంతుల కు గురిచేస్తున్న వార్డెన్ ఎలిజిబిత్ రాణిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సేవాలాల్ విద్యార్థి సేన ఆధ్వర్యంలో మండలకేంద్రంలో బుధవారం ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్ రాఘవ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సేవాలాల్ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు దారావత్ సురేష్‌నాయక్ మాట్లాడుతూ… వార్డెన్ తీరుతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉడకని అన్నం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు.

మెనూ పాటించిన దాఖలాలే లేవన్నారు. ఎవరికైనా చెబితే చిత్రహింసలు పెడతానని.. వార్డెన్ బెదిరించడంతో విద్యార్థినులు అక్కడ బానిసల్లా బతుకుతున్నారని చెప్పారు. వార్డెన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల్లో మనోధైర్యాన్ని కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గుగులోతు నరేష్ నాయక్, బానోత్ రాజేష్‌నాయక్, శ్రీకాంత్ నాయక్, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments