Home కరీంనగర్ మిషన్ కాకతీయకు గ్రహణం

మిషన్ కాకతీయకు గ్రహణం

Mission-Kakatiyaనిధులు ఉన్నా పనులు మొదలు పెట్టని వైనం
కబ్జాకు గురైన మాలకుంట చెరువు శిఖం భూమి
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
హుజూరాబాద్ రూరల్/ మనతెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా అధిక సరిగ్గా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ఫలితం ఇవ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో మిషన్ కాకతీయకు గ్రహాణం పట్టింది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది కాట్రపల్లి మిషన్ కాకతీయ పనులు. ఒక వైపు నిధులు ఉండి పనులు మధ్యలోనే పనులు నిలిపి వేస్తుండటం మరోవైపు మాలకుంట చెరువు శిఖం భూమిని కబ్జా చేస్తున్న పట్టించుకున్నా దాఖలాలు లేవు. చెరువుల పునరుద్దణలో భాగంగా మైసమ్మకుంటకు రూ. 33 లక్షలు కేటాయించారు. పనులు ప్రారంభించి మూడు నెలలు గడువు పూర్తయినా రూ. 9 లక్షలు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నాడు. అ సంపూర్తిగా పనులు మధ్యలోనే నిలిపి వేయడంతో గత నెల భారీ వర్షాలు కురిసినప్పటికి ఒక్క చుక్కనీరు నిల్వ లేకుండా పోయింది. దీంతో కాంట్రాక్టర్ తీరుపై రైతులు అసహానం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా పనులు చేసి ఉంటే మైసమ్మకుంట నీటితో జలకళలాడేదని రైతులు తెలుపుతున్నారు. ఇదే గ్రామంలో మిషన్ కాకతీయ ద్వారా మాల కుంట పునరుద్దరణకు రూ. 14 లక్షల నిధులను కేటాయించారు. సర్వే నెంబర్ 3లో మాలకుంట విస్తీర్ణం 7 ఎకరాల 18 గుంటలు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉండగా అందులో నుంచి రెండు ఎకరాల అన్యాక్రాంతం కబ్జాకు గురికాగా గ్రామపంచాయతీ పాలకవర్గం చొరవ తీసుకొని 1.5 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. 20 గుంటల భూమిలో ఒక బావి, ఇల్లు నిర్మించి ఉంది. దాన్ని తొలగించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం కుంట చుట్టూ కంచె వేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.