Home ఖమ్మం జలాశయాలకు జలకళ

జలాశయాలకు జలకళ

అల్పపీడన ద్రోణితో జిల్లా వ్యాప్తంగా వర్షం
జలాశయాల్లోకి కొత్తనీరు

kmm22ఖమ్మం: అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో ఐదు గేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు నిండడంతో ఒక్కగేటు ఎత్తి వరద నీటిని కిందకు వదులుతున్నారు. వైరా ప్రాజెక్టులోకి కొత్త నీరు చేరింది. చెరువు నీటి మట్టం అడుగున్నర మేర పెరగడంతో 14.5 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇల్లందు ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో మున్నేరుకు జలకళ వచ్చింది. చిన్న చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. ఆదివారం బోనకల్, వైరా, దమ్మపేట, ముదిగొండ, కూసుమంచి, దుమ్ముగూడెం, బూర్గంపాడులో భారీ వర్షపాతం నమోదు కాగా మణుగూరులో అత్యధికంగా 225 మి.మీ వర్షం కురిసింది. దమ్మపేటలో 189 మి.మీ వర్షం కురవగా జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం కురవడం గమనార్హం.