Home లైఫ్ స్టైల్ భవిష్యత్తులో బొట్టు దొరికితే ఒట్టు

భవిష్యత్తులో బొట్టు దొరికితే ఒట్టు

దేశంలో దాదాపు అరవై కోట్ల మంది ప్రజలకు రోజువారీ అవసరాలకు నీరు లభ్యం కావడం లేదు అని నీతీ ఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్సఫార్మింగ్ ఇండియా) అనే ప్రభుత్వ సంస్థ రూపొందించిన కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అనే నివేదిక వెల్లడి చేసింది. గత సంవత్సరం జూన్ లో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ప్రతి జీవి మనుగడకు అత్యంత కనీస అవసరమైన నీరు దేశంలో దాదాపు సగం జనాభాకు లభ్యం కాకపోవడమే కాక ఏటా దాదాపు రెండు లక్షల మంది ప్రజలు రక్షిత మంచినీరు లేక కలుషితమైన నీటిని తాగి రోగాల బారిన పడి చనిపోతున్నారు. దేశంలో లభ్యమవుతున్న జలంలో దాదాపు నలభై శాతంగా ఉన్నభూగర్భ జలం గతంలో కన్నా చాలా వేగంగా అడుగంటిపోతుంది. దాదాపు డైబ్బై శాతం జలం కలుషితమైన జలం అనీ కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి 21 నగరాలలో 2020 నాటికే భూగర్భ జలాలు దాదాపు పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. దీని వలన దాదాపు పది కోట్ల మంది ప్రజలకు నీటి లభ్యత దుర్లభం అయ్యే అవకాశం ఉంది. 2030 నాటికి దేశంలో నీటికి ఉన్న డిమాండ్ లో సగం మాత్రమే లభించే పరిస్థితి తలెత్తనుందని, నీటి కొరత వల్ల 2050 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కి ఆరు శాతం నష్టం వాటిల్లనుందని కూడా ఈ నివేదిక వెల్లడి చేసింది.

Water

నీరు ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తుంది అనేది మనందరికీ తెలిసిన సత్యం. కానీ మన దేశంలో మాత్రం నీరు పల్లెల నుండి పట్టణాలకు, వ్యవసాయ భూముల నుండి పరిశ్రమలకు, పేదల కాలనీలనుండి ధనికుల భవంతులకు ప్రవహించడం మొదలు పెట్టి చాలా కాలమే అయింది. ఎక్కడ అధికారం, ధనం, బలం ఉంటుందో అక్కడే నీరు ఉంటుంది.

దేశంలో దాదాపు అరవై కోట్ల మంది ప్రజలకు రోజువారీ అవసరాలకు నీరు లభ్యం కావడం లేదు అని నీతీ ఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్సఫార్మింగ్ ఇండియా) అనే ప్రభుత్వ సంస్థ రూపొందించిన కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అనే నివేదిక వెల్లడి చేసింది. గత సంవత్సరం జూన్ లో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ప్రతి జీవి మనుగడకు అత్యంత కనీస అవసరమైన నీరు దేశంలో దాదాపు సగం జనాభాకు లభ్యం కాకపోవడమే కాక ఏటా దాదాపు రెండు లక్షల మంది ప్రజలు రక్షిత మంచినీరు లేక కలుషితమైన నీటిని తాగి రోగాల బారిన పడి చనిపోతున్నారు. దేశంలో లభ్యమవుతున్న జలంలో దాదాపు నలభై శాతంగా ఉన్నభూగర్భ జలం గతంలో కన్నా చాలా వేగంగా అడుగంటిపోతుంది. దాదాపు డైబ్బై శాతం జలం కలుషితమైన జలం అనీ కూడా ఈ నివేదిక వెల్లడించింది.

ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి 21 నగరాలలో 2020 నాటికే భూగర్భ జలాలు దాదాపు పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. దీని వలన దాదాపు పది కోట్ల మంది ప్రజలకు నీటి లభ్యత దుర్లభం అయ్యే అవకాశం ఉంది. 2030 నాటికి దేశంలో నీటికి ఉన్న డిమాండ్ లో సగం మాత్రమే లభించే పరిస్థితి తలెత్తనుందని, నీటి కొరత వల్ల 2050 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కి ఆరు శాతం నష్టం వాటిల్లనుందని కూడా ఈ నివేదిక వెల్లడి చేసింది. నిజానికి భారతదేశంలో నీటి ఎద్దడి సమస్య ఈనాటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా దేశం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచ జనాభాలో పదిహేను శాతం జనాభా భారతదేశంలో ఉండగా భూ విస్తీర్ణం మాత్రం కేవలం మూడు శాతం మాత్రమే ఉంది.విస్తృతమైన పట్టణీకరణ, పారిశ్రామిక, ఆర్ధిక పురోగతి కూడా నీటి వనరులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నీటి వనరుల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం 2050 నాటికి దేశంలో నీటి అవసరం ఏడాదికి 1180 బిలియన్ క్యూబిక్ మీటర్ లు కాగా నీటి లభ్యత కేవలం 695 బిలియన్ క్యూబిక్ మీటర్ లు ఉండనుంది. ఏదైనా ప్రాంతంలో తలసరి నీటిలభ్యత 1700 క్యూబిక్ మీటర్ ల కంటే తక్కువ ఉంటే నీటి ఎద్దడి ఉన్నట్లుగాను, తలసరి నీటిలభ్యత 1000 క్యూబిక్ మీటర్ ల కంటే తక్కువ అయితే తీవ్ర నీటి సంక్షోభం ఉన్నట్లు గాను హైడ్రాలజిస్ట్ లు అంచనా వేస్తారు. భారతదేశంలో తలసరి నీటి లభ్యత ప్రస్తుతం దాదాపు 1500 క్యూబిక్ మీటర్ లు ఉన్నది కాబట్టి మనమింకా నీటి విషయంలో సంక్షోభ స్థాయికి చేరుకోలేదు కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సంక్షోభాన్ని నివారించేందుకు అవకాశం ఖచ్చితంగా ఉంది.

Water

దేశంలో నానాటికీ నీటి ఎద్దడి పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో సగటున ఏడాదికి 1170 మిల్లీ మీటర్ ల వర్షపాతం నమోదు అవుతుండగా అందులో కేవలం ఆరు శాతం మాత్రమే నిల్వ చేసుకునేందుకు తగిన వసతులు ఉన్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసే ఇంకుడు గుంతలు, కుంటలు, చెరువుల నిర్మాణం, నిర్వహణపై మనకున్న నిర్లక్ష వైఖరి పెద్దమొత్తంలో వర్షపు నీరు వృధాగా పోవడానికి కారణమవుతుంది. 2001 ప్రాంతంలో అప్పటి తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం తప్పని సరి చేస్తూ తీసుకున్న నిర్ణయం కేవలం ఐదేళ్లలో భూగర్భ జల మట్టం పెరగడం లో, నీటి లభ్యత మెరుగవడంలో ఎంతో కీలక పాత్ర పోషించింది. బెంగుళూరు, పూణే వంటి నగరాలలో కూడా హౌసింగ్ సొసైటీ ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసే ప్రయత్నాలు కొంత వరకు జరిగాయి. అడపాదడపా అక్కడక్కడా జరిగిన ఈ కొన్ని ప్రయత్నాలు తప్ప దేశవ్యాప్తంగా వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఒక పటిష్టమైన ప్రణాళిక కానీ, విధానాలు కానీ, మౌలిక సదుపాయాలూ కానీ లేవు. దీనితో ఎంతో విలువైన నీటి వనరులను మనం వృధా చేసుకుంటున్నాం.

ఏడు అతి పెద్ద నదులు, అనేక ఉపనదులు ఉన్న నదీ వ్యవస్థ మనకు ఉన్న మరొక అతి ప్రధాన నీటి వనరు. ఏడాదికి దాదాపు 1870 బిలియన్ క్యూబిక్ మీటర్ ల నీటిని కలిగిఉండి నూటముఫై కోట్ల ప్రజల జీవితాలకి, జీవనోపాధులకి ప్రధాన ఆధారంగా ఉంది మన దేశ నదీ వ్యవస్థ. భూగర్భ జల వనరులు చాలా ప్రాంతాలలో దాదాపుగా ఇంకిపోయి, వర్షపాతం సరిగా లేకపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంకా అనేక ప్రాంతాలకు త్రాగునీరు, వ్యవసాయానికి, ఇతర జీవనోపాధులకు అవసరమైన నీరు అందుతున్నాయంటే అందుకు కారణం మన నదీ వ్యవస్థే. అయితే ఈ నదీ వ్యవస్థకి కూడా మనం చేసిన హాని తక్కువ కాదు. 2016 డిసెంబర్ లో నీటి సంరక్షణపై పని చేసే కార్యకర్తలు నిర్వహించిన ఒక సదస్సులో దేశంలోని 290 నదులపై సర్వే నిర్వహించి వెల్లడించిన సమాచారం ప్రకారం వీటిలో దాదాపు 205 నదులు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. వాటిలో నీటి ప్రవాహం గణనీయంగా పడిపోయింది. ఉపనదులు ఇంకిపోయాయి. నదుల పరివాహక ప్రాంతాలలో ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయి. పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల ఫలితంగా విపరీతమైన కాలుష్యం ఆ నదీ జలాలను ఎందుకూ పనికిరాకుండా మార్చివేసింది.

Water

ఉదాహరణకు మన భారతీయులం అత్యంత పవిత్రంగా భావించే గంగా నదిని తీసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ-బనారస్ హిందూ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం గంగా నదీజలం లో డిజాల్వ్ ఆక్సిజన్ (o2) ఒక లీటర్ కు ఐదు మిల్లీగ్రాములు మాత్రమే ఉంది. లీటర్ లు 8 మిల్లీగ్రాములు అంతకన్నా ఎక్కువ డిజాలవ్డ్ ఆక్సిజన్ ఉన్న నీరు మాత్రమే త్రాగడానికి ఆరోగ్యకరమైనదిగా శాస్త్రవేత్తలు సూచిస్తారు. అడ్డు అదుపు లేకుండా, కనీసం ట్రీట్మెంట్ కూడా చేయకుండా నదీ జలాలలోకి వదులుతున్న పారిశ్రామిక వ్యర్ధాలు, మురుగు నీరు, మృత కళేబరాలు, ఇతర వ్యర్ధాలు ఈ నదీ జలాలను త్రాగడానికి పనికి రాకుండా మార్చేసేయన్నది అందరికి తెలిసిన సత్యం. నదీ జలాల కాలుష్యం మాత్రమే ఇక్కడ సమస్య కాదు. నదీ పరీవాహక విస్తీర్ణాలు తగ్గిపోవడం కూడా ఒక ఆందోళన కలిగించే అంశం. 1990 ప్రాంతంలో వారణాసి వద్ద గంగా నదీ వైశాల్యం 360 మీటర్ లు కాగా 2015 నాటికి ఇది 270 మీటర్లకు చేరుకుంది. 11 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ, 50 కోట్ల మంది ప్రజల అవసరాలకు నీటిని అందిస్తూ, అత్యంత పవిత్రంగా భావించే నది పట్లనే మన తీరు ఇలా ఉంటే ఇక మిగిలిన నదుల పరిస్థితి చెప్పేదేముంది. ఇటీవల ప్రభుత్వం నమామి గంగ పేరుతో ప్రారంభించిన గంగా నదీ ప్రక్షాళన కార్యక్రమం నిజంగానే ఒక మంచి ప్రయత్నం.

అయితే గంగ జలాల కాలుష్యంపై ఇంకా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక వ్యర్ధాలను నదీజలాలలో కలపకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలన్నీ కూడా పెద్ద పెద్ద భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ లను నిర్మించి నదీజలాలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడం ద్వారా వ్యవసాయ అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. నానాటికీ పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ఉత్పత్తిని సాధించాలంటే వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నదీజలాల అనుసంధానం ద్వారా, భారీ ఆనకట్టల నిర్మాణం ద్వారా నదీ జలాలను సమర్ధవంతంగా వినియోగించుకోగలమన్న ఆలోచన కొంతవరకు సరైనదేమో కానీ ఈ క్రమంలో ప్రభుత్వాలు విస్మరించిన ఒక ముఖ్య విషయం ఏమంటే నదీ జలాలు కూడా అపరిమితమేమీ కాదు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, అతి విస్తారమైన నదులు కూడా అడుగంటి పోయే ప్రమాదం ఉంది.

mission bhagiratha

ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన మరొక అంశం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న చెరువులు, కుంటలు, బావుల వంటి చారిత్రక నీటి నిల్వ వ్యవస్థలు. అనేక బావులు, చెరువులు పూడుకుపోయి, ఆక్రమణలకు గురైపోయి స్థానిక నీటి నిల్వ వ్యవస్థలు పూర్తిగా దెబ్బ తిన్నాయనేది వాస్తవం. కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ గా పిలవబడే ఈ చిన్న నీటి నిల్వ చేసే నిర్మాణాల యొక్క నిర్వహణ ఒకప్పుడు స్థానిక ప్రజా సంఘాల చేతిలో ఉండడంతో వారికి వాటి యొక్క ఉపయోగం, ప్రాముఖ్యత తెలిసిన వారు కాబట్టి ఆ నిర్మాణాల నిర్వహణ సమర్ధవంతంగా ఉండేది. ఎప్పుడైతే ఈ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ యొక్క నిర్వహణ బాధ్యత ప్రజల చేతి నుండి ప్రభుత్వం యొక్క చేతికి మారిందో అప్పటినుండి ఇవి తీవ్ర నిర్లక్ష్యానికి గురై దాదాపు కనుమరుగైపోయే పరిస్థితి దాపురించింది. మొత్తానికి దేశంలో ఉన్న అన్ని ప్రధాన జలవనరులపైనా తీవ్ర ఒత్తిడి ఉందన్నది వాస్తవం.

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పటికే త్రాగు నీరు కొనుక్కుంటున్న మనం భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికి నీటిని కొనుక్కోవాల్సిన అవసరం తలెత్తడం, నీటికోసం ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య వైరాలు తలెత్తడం (ఇప్పటికే ఇలాంటివి కొన్ని చూస్తూనే ఉన్నాం) జరిగి సమస్త ప్రజానీకం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇతర జీవనోపాధులకు పరిమితులు లేకుండా నీటిని వినియోగించడం, పారిశ్రామిక, ఇతర వ్యర్ధాల ద్వారా నీటి వనరులను కలుషితం చేయడం తో పాటు నీటి సంరక్షణ పట్ల, వినియోగం పట్ల మనకు ఉన్న నిర్లక్ష్య ధోరణి యొక్క ఫలితాలు త్వరలో మనమే అనుభవిస్తామనడంలో ఏ సందేహము లేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు నీటికోసం కిలోమీటర్ ల కొద్ది దూరం ప్రయాణించి బిందెల కొద్దీ నీటిని మోసుకుంటూ శ్రమ పడడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక అంచనా ప్రకారం ఒక గ్రామీణ భారత మహిళ సగటున ఏడాదికి 14000 కిలోమీటర్ ల దూరం నడుస్తుందని, ఇది దాదాపు 15 కోట్ల పని దినాలకు సమానమని, దీని విలువ దాదాపు వెయ్యి కోట్లు అని తెలుస్తుంది. కేవలం కొన్ని గ్రామాలకు నీరు అందుబాటులో లేకపోవడం వలన ఇన్ని విలువైన పనిదినాలు, వేతనాలు నష్టపోవడమే కాక స్త్రీలకు ఇది ఎంత చాకిరి. ఇంటిల్లిపాదికి అవసరమైన నీటిని సేకరించేందుకు ఒక సగటు గ్రామీణ, పట్టణ నిరుపేద మహిళ పడే శ్రమకి విలువ కట్టగలమా?

Mission Bhagiratha water

 

ఈ శ్రమనుండి వారిని విముక్తం చేయాలంటే, భవిష్యత్తు తరాల వారు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే తక్షణం సమర్ధవంతమైన చర్యలు చేపట్టడం అవసరం. అందుకు మనకు ఉన్న జలవనరులన్నిటి పట్ల సరైన అవగాహన పెంచుకోవడం ప్రధమంగా చేయాల్సిన పని. ఉన్న వనరులు ఏమిటి, అవి ఏ స్థాయిలో ఉన్నాయి, వాటి వినియోగం ఎలా ఉంది, అవి ఎంతకాలం మన అవసరాలను తీర్చే స్థాయిలో ఉన్నాయి అనే దానిపై సరైన అవగాహన పెంచుకుని దాని ఆధారంగా సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నీటిని నిల్వ చేసేందుకు విస్తృతంగా ఇంకుడు గుంతలు, వాటర్ షెడ్ ల నిర్మాణం చేప్పట్టడంతో పాటు భూగర్భ జల వినియోగంపై తగిన పరిమితులు, ఆంక్షలు విధించి వాటిని సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉంది. మనం పూర్తిగా విస్మరించిన చెరువులు కుంటల పునరుద్ధరణపై తక్షణం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణా ప్రభుత్వం ఈ దిశగా కొన్ని చర్యలు చేపట్టడం ఆశాజనకమైన విషయమయినప్పటికీ ఈ చెరువుల పునరుద్ధరణ మరింత వేగంగా, సమర్ధవంతంగా జరగాల్సి ఉంది. నదీ జలాల కాలుష్యంపై మరింత దృష్టిపెట్టి పారిశ్రామిక వ్యర్ధాలను నదులలోకి ట్రీట్మెంట్ చేయకుండా వదిలివేస్తున్న పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. అంతేకాక నదీ పరివాహక ప్రాంతాల మొత్తంపైన ద్రుష్టి పెట్టి సమగ్రమైన నదీ జలాల నిర్వహణ వ్యవస్థను రూపొందించాల్సి ఉంది.పైన చెప్పిన చర్యలన్నింటితో పాటు జల వనరుల సంరక్షణకై చేయవల్సిన అత్యంత ప్రముఖమైన పని ప్రజలను నీటి వనరుల పట్ల, వాటి కొరత పట్ల, వాటిని సంరక్షించాల్సిన అవసరం పట్ల, విధానాల పట్ల చైతన్య పరచడం. ఉచితంగా దొరికే నీరే కదా అని మనం చూపించే నిర్లక్ష్యం భవిష్యత్తులో మన మనుగడనే ప్రమాదంలో పడేయనుందనే అవగాహన మనం పెంచుకుంటే తప్ప మన జీవితాలకు, జీవనోపాధులకు అత్యంత కీలకమైన నీటిని కాపాడుకోలేం.

దేశంలో సగటున ఏడాదికి 1170 మిల్లీ మీటర్ ల వర్షపాతం నమోదు అవుతుండగా అందులో కేవలం ఆరు శాతం మాత్రమే నిల్వ చేసుకునేందుకు తగిన వసతులు ఉన్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసే ఇంకుడు గుంతలు, కుంటలు, చెరువుల నిర్మాణం, నిర్వహణపై మనకున్న నిర్లక్ష వైఖరి పెద్దమొత్తంలో వర్షపు నీరు వృధాగా పోవడానికి కారణమవుతుంది. 2001 ప్రాంతంలో అప్పటి తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం తప్పని సరి చేస్తూ తీసుకున్న నిర్ణయం కేవలం ఐదేళ్లలో భూగర్భ జల మట్టం పెరగడం లో, నీటి లభ్యత మెరుగవడంలో ఎంతో కీలక పాత్ర పోషించింది. బెంగుళూరు, పూణే వంటి నగరాలలో కూడా హౌసింగ్ సొసైటీ ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసే ప్రయత్నాలు కొంత వరకు జరిగాయి. అడపాదడపా అక్కడక్కడా జరిగిన ఈ కొన్ని ప్రయత్నాలు తప్ప దేశవ్యాప్తంగా వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఒక పటిష్టమైన ప్రణాళిక కానీ, విధానాలు కానీ, మౌలిక సదుపాయాలూ కానీ లేవు. దీనితో ఎంతో విలువైన నీటి వనరులను మనం వృధా చేసుకుంటున్నాం.

Water Problem Faced in Future in Telangana

భారతి కోడె

94401 03411