Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కృష్ణ నీళ్లు గల్లంతు?

Water released from Srisailam disappeared

శ్రీశైలం నుంచి కిందికి వదిలినట్టు చెప్పింది 230 టిఎంసిలు, చేరింది 180 మాత్రమే
మిగిలిన 50 టిఎంసిల నీళ్లు ఎక్కడికి వెళ్లాయి, పోతిరెడ్డిపాడుకా? 

మన తెలంగాణ/ హైదరాబాద్ : శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీళ్లు మాయమయ్యాయి. రెండో, మూడో కాదు, ఏకంగా 50 టిఎంసిల నీళ్లు మాయమయ్యాయి. జూరాలలో నిల్వచేసే సామర్థానికి ఐదు రెట్లు, ఎల్లంపల్లి సామర్థానికి 2 రెట్లు, పులిచింతల నీటి నిల్వ సామర్థం కంటే ఎక్కువ. కర్ణాటకలో కురిసిన వర్షం కారణంగా శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నీటితో నిండి, గేట్లు ఎత్తాల్సిన స్థితి అదృష్ట వశాత్తూ వచ్చింది. ఎగువ నుంచి భారీ ఎత్తున ప్రవాహాలు వస్తే శ్రీశైలం నుంచి గేట్లు తెరిచి నాగార్జునసాగర్‌కు నీటిని  అనివార్యంగా విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాల పుణ్యమా అని దండిగా నీళ్లు వచ్చినా, లెక్కల్లో గోల్‌మాల్ మాత్రం అంతుపట్టడం లేదు. దాదాపు నెల రోజులుగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్‌కు నీరు విడుదలవుతోంది. ఇందులో కుడి గట్టు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల నుంచి కొంత, గేట్లు తెరిచి కొంత నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే శ్రీశైలంలో దిగువకు వదిలిన నీరు నేరుగా నాగార్జునసాగర్‌కే చేరుతుంది. మధ్యలో నీటి వినియోగానికి మరో మార్గమే లేదు.

గత నెల రోజులకు పైగా శ్రీశైలం నుంచి 230 టిఎంసిల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే 180 టిఎంసిలు మాత్రమే నాగార్జునసాగర్‌ను చేరింది. మధ్యలో ఒకటి, రెండు టిఎంసిలు ఆవిరి నష్టంతో తగ్గడం సాధారణమే కాని, ఏకంగా 50 టిఎంసిల నీరు మాయం కావడం తెలంగాణ ఇరిగేషన్ శాఖలో కలకలం రేపింది. గత ఏడాది కూడా ఇదేవిధంగా 45 టిఎంసిలకు పైగా నీరు సాగర్‌కు చేరకుండా మధ్యలోనే మాయమైంది. శ్రీశైలం నుంచి ఈ నీటిని విడిచారా.. లేదా..? విడిస్తే ఎటు పోయింది..? కాగితాలపై సాగర్‌కు విడిచి, వాస్తవంగా పోతిరెడ్డిపాడుకు మళ్లిందా..? అనే అనుమానాలతో ఇంజనీర్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు మినహా, గ్రావిటీతో నీటిని వినియోగించే అవకాశం, మళ్లించే అవకాశం మరేక్కడా లేదు. దీని మర్మమంతా పోతిరెడ్డిపాడులోనే ఉన్నదన్న అనుమానాలను ఇంజనీర్లు వ్యక్తపరుస్తున్నారు. గతేడాది కూడా ఇదేవిధంగా అక్రమంగా నీటిని మళ్లించినా, బోర్డుకు ఫిర్యాదు చేస్తే కమిటీలు వేసి, తాత్సారం చేసిందే తప్ప సమస్యను తేల్చలేదు. దీనిపై మరో తెలంగాణ ప్రభుత్వం మరో మారు బోర్డుకు ఫిర్యాదు చేసి, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Comments

comments