Search
Saturday 22 September 2018
  • :
  • :

రిమ్స్ లో నీటి కటకట

rims-image

రోగులకు తప్పని ఇబ్బందులు

 పట్టించుకోని అధికారులు

మన తెలంగాణ/ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులు తాగునీటి ఇబ్బందులతో అల్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు బావులు పని చేయక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారి కుటుంబీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతి వార్డుకు తాగునీరు అందించి నీటి కష్టాలు తీర్చాల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో పరిస్థితి దయనీయంగా మారిందని అంటున్నారు. పరిస్థితి దారుణంగా ఉండడంతో ఇళ్ల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందని రోగులు, వారి కుటుంబీకులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. రిమ్స్ ఆవరణలో 17 బోర్లు ఉన్నప్పటికీ కేవలం ఒకే బోరు పని చేస్తోంది. మిగితా రెండు బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పని చేయడం లేదు. దీంతో మున్సిపల్ ద్వారా సరఫరా చేసే మంచి నీళ్ల పైనే మెడికల్ కాలేజ్ విద్యార్థులు, రిమ్స్ రోగులు ఆధారపడాల్సి వస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో పట్టణ ప్రజలతో పాటు రిమ్స్‌కు నీటిని సరఫరా చేయడం మున్సిపల్ అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పటికే మావల చెరువు, లాండసాంగి వాగుల్లో నీరు అడుగంటిపోవడం, నీటి వినియోగం పెరిగి పోవడంతో ఈ ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు.  ఆసుపత్రిలో ఐదు లక్షల లీటర్ల సామర్థ్ధం గల వాటర్ ట్యాంక్‌ను నిర్మించినప్పటికీ బోర్లలో నీళ్లు రాక ఈ పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు.  ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు మెరుగుగా ఉన్నప్పటికీ తాగునీటి కటకట తప్పడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆసుపత్రికి వస్తే విధిగా మంచి నీళ్ళను వెంట తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ఆసుపత్రికి మున్సిపల్ నుంచి సరఫరా అయ్యే నీళ్లు రెండు, మూడు రోజులకోసారి రావడంతో కొన్ని సందర్భాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు. అలాగే రోగుల బంధువులు స్నానాలు చేసేందుకు, బట్టలు ఉతకడానికి నీరు దొరకని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే రిమ్స్ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న తాగు నీటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావ్ గత యేడాది రిమ్స్‌కు రూ.5 లక్షల విలువ చేసే శుద్ద జల ప్లాంటుకు నిధులు అందజేశారు. ఈ నిధులతో ఆసుపత్రి ఆవరణలోనే శుద్ద జల ప్లాంటును ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రారంభించిన కొద్ది రోజులకే సమస్యలు తలెత్తడంతో మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారింది. దీంతో వాటర్ ప్లాంట్ గదికి అధికారులు తాళం వేసి ఉంచారు. ఆసుపత్రి బయట ఉన్న సత్యసాయి ట్రస్టు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చలి వేంద్రాల నుంచి మంచి నీటిని తెచ్చుకొని తాగాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

comments