Home కామారెడ్డి మిషన్ కాకతీయ పనుల్లో మనమే నంబర్

మిషన్ కాకతీయ పనుల్లో మనమే నంబర్

mission

మనతెలంగాణ /లింగంపేట :దశాబ్దాల కాలంగా శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారిన చెరువులకు పునరుధ్దరణ పనులు చేపట్టి చెరువులను పూర్తిగా వినియోగంలోకి తేవడం కోసం ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయ పనుల్లో ఎల్లారెడ్డి నియోజక వర్గం (మనమే) నంబర్‌వన్ స్థానంలో ఉన్నామని స్థానిక ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన లింగంపేటలోని నల్లమడుగు, శెట్పల్లి, బోనాల్, భవానీపేట, రాంపూర్, కొండాపూర్ గ్రామాలలో మిషన్ కాకతీయ 4వ విడత పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనులతో చెరువులు నీటితో నిండి రెండు పంటలు పండుతున్నాయని, రైతు సోదరులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్‌లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారని గుర్తు చేశారు. నాలుగు విడతల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాలలో చెరువులకు మరమ్మతు పనులు చేయించామని మరికొన్ని చెరువులకు ప్రస్తుతం మరమ్మతు పనులు సాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి గత ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదని దాంతో రైతులు పంటలు పండక అష్టకష్టాలు పడ్డారని అన్నారు. తెలంగాణ సర్కార్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిందన్నారు. చెరువుల పునరుద్దరణ పనుల వల్ల చెరువులలో సాగునీటి నిల్వ సామర్ధం పెరిగి ఖరీఫ్, రబీ పంటలు పండుతున్నాయని అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేయాలనే లక్షంతో ముఖ్యమంత్రి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ను సరఫరా చేస్తున్నామని, 24 గంటల కరెంట్‌తో నేడు రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎకరానికి నాలుగువేల సహాయం అందించిన ఘనత ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రపంచదేశాలలో గుర్తింపు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి ప్రశంసించడం గర్వకారణమన్నారు. పార్టీల కతీతంగా నేతలు తెలంగాణ ప్రభుత్వ పనితీరును అభినందిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడక పిచ్చికూతలు కూస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుకాణం బంద్ అయ్యే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు చూపించి మీకెందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించాలని ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు.
కాళేశ్వరం నీటితో లక్ష 20 వేల ఎకరాలకు సాగునీరు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఒకలక్ష 20 వేల ఎకరాల సాగు భూములకు కాళేశ్వరం నీటిని అందిస్తామని, దాంతో ఎల్లారెడ్డి నియోజక వర్గం సస్యశ్యామలం కానుందని ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి పేర్కోన్నారు. మిషన్ కాకతీయ పనులతో చెరువులు పటిష్టంగా మారుతున్నాయని కాళేశ్వరం నీటిని చెరువులలోకి మళ్లించి రైతులకు మూడు పంటలు పండేలా కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని గాందారి ,లింగం పేట మండలంలో ప్రాజెక్టులను నిర్మించి అన్ని గ్రామాల చెరువులకు కాళేశ్వరం నీటిని తరలిస్తామని తెలిపారు. మిషన్ కాకతీయ పనులు జరిగే సమయంలో ఆయా గ్రామాల రైతులు దగ్గరుండి పనులను పర్యవేక్షించాలని ,పనులు నాణ్యతగా లేకుంటే తన దృష్టికి తేవాలని ఆయన సూచించారు. భవానిపేట గ్రామ శివారులోని మిషన్‌కాకతీయ పనులు పూర్తయిన సింగాయిచెరువు ను, చెరువుకింద సాగవుతున్న వరి పొలాలను చూసిన ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం జేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని పచ్చని పంటలతో సస్య శ్యామలంగా మార్చడమే తన లక్షమని , కేసీఆర్ స్వప్నమైన బంగారు తెలంగాణ సాధన దగ్గరలోనే ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎదురుగట్ల సంపత్‌గౌడ్, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, నీటిపారుదల శాఖ ఎల్లారెడ్డి సబ్ డివిజన్ డిప్యూటీ ఇఇ వెంకటేశ్వర్లు , స్థానిక జడ్పిటిసి సభ్యురాలు నాగులూరి శ్రీలత, టీఆర్‌ఎస్ పార్టీ మండల అద్యక్షుడు వంజరి ఎల్లమయ్య, సర్పంచులు నర్వజయమ్మ, కమ్మరిపండరి,సురేందర్‌గౌడ్, అప్రోజ్, టీఆర్‌ఎస్ నాయకులు ఎంఏ.షానూర్, కౌడరవీందర్, శంకర్‌గౌడ్, సాయిరాం, డిష్‌అశోక్, తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ రఫియోద్దిన్, నాగులూరి సాయులు, గన్నూనాయక్, పారూఖ్, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
మండలంలోని బోనాల్ గ్రామానికి చెందిన పలువురు శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖాజా, బాలసాయులు, కుర్మ శ్రీను, కుచలకంటి పర్వయ్య తో పాటు మరికొందరు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.