Search
Friday 21 September 2018
  • :
  • :

వెబ్‌సైట్‌ల ప్రమోషన్ @ సోషల్ మీడియా

అదరగొట్టే హెడ్డింగ్‌లతో ఆకర్షణ, క్లిక్‌లతో కాసులు
ఆన్‌లైన్ సర్వేల పేరిట పెంచుకుంటున్న రేటింగ్

FB,-Twitter

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్ : వెబ్‌సైట్ నిర్వాహకులకు సోషల్ మీడియా కాసుల పంటపండిస్తుంది. ఇప్పుడంతా సోషల్ మీడియామయమైంది. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్స్‌ప్ ఇలా ఏది అందుబాటులో ఉంటే అది వాడేస్తూ తెగ బిజీ అయిపోయారు యువత. ఇదే అదనుగా రేటింగ్‌ల కోసం వైబ్‌సైట్ నిర్వాహకులు సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటున్నారు. తమ ర్యాంకులను మెరుగుపరుచుకొని అడ్వర్‌టైజ్‌మెంట్‌ను కొల్లగొట్టేందుకు తీరొక్క ఉపాయాలు వేస్తున్నారు. అదిరిపోయే హెడ్డింగ్‌లతో ఇట్టే ఆకర్షిస్తూ తమ పేజీలకు క్లిక్‌లు కొట్టించుకుంటూ కాసులను దండుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇంకొంతమంది నిర్వాహకులు ఆన్‌లైన్ ఓటింగ్‌ల పేరుతో తమ వెబ్‌సైట్‌ను ఎప్పుడూ బిజీగా ఉండేలా చూస్తున్నారు. ఇప్పటి వరకు వెబ్‌సైట్‌ల నిర్వాహకులు తమ ప్రమోషన్‌ల కోసం నానా తంటాలు పడాల్సి ఉండేది. కానీ మారుతున్న కాలంలో మొత్తానికి సోషల్ మీడియా పుణ్యమా అని వెబ్‌సైట్ల రేటింగ్‌లు అమాంతంగా పెరిగిపోతున్నాయి.

తపనంతా క్లిక్‌ల కోసమే : వెబ్‌సైట్‌ల నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్న వారి సంఖ్యను (విజిటింగ్) పెంచుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఎంత మంది విజిట్ చేస్తే వెబ్‌సైట్‌కు అంత ప్రమోషన్ వస్తుంది. వెబ్‌సైట్‌లకు సందర్శకుల సంఖ్యను ఆధారంగా చేసుకొని రేటింగ్ పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు మెరుగైతాయి. సందర్శకుల సంఖ్యను పెంచుకునేందుకు నిర్వాహకులు ఆసక్తిని కలిగించే విధంగా శీర్షికలను పెడుతూ వాట్సాప్ గ్రూపులకు లింక్‌లు ఇస్తున్నారు. ఈ లింక్‌లను క్లిక్ చేస్తే వెబ్‌సైట్ లాగిన్ కావడమే కాకుండా సదరు నిర్వాహకులకు విజిటింగ్‌ల సంఖ్య పెరుగుతుంది.

ఆన్‌లైన్‌లో ఓటింగ్‌లతో ప్రమోషన్ : రాజకీయ నేతలపైనా, ప్రజాప్రతినిధులను ఆధారంగా చేసుకొని కొన్ని వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్ ఓటింగ్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో డిసెంబర్ 22 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఓ వెబ్‌సైట్ తెలంగాణ జిల్లాలోని ఎంఎల్‌ఎల పనితీరుపై ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వహించారు. వారికి వచ్చిన ఓట్లను విశ్లేషిస్తూ ఎంఎల్‌ఎలకు ఓట్ల శాతాన్ని పంపిణీ చేశారు. ఇలా చేయడం ద్వారా ఎంఎల్‌ఎలు సైతం తమను తాము ప్రమోట్ చేసుకోవడం కోసం ఆన్‌లైన్ ఓటింగ్‌ను ప్రోత్సహించారు. ఇందు కోసం తమ అనుచరులతో లింక్‌లను వివిధ గ్రూపులకు ఇస్తూ పోస్టు చేస్తూ క్యాంపెయినింగ్ నిర్వహించారు. తద్వారా ఎంఎల్‌ఎల ప్రమోషన్ మాటేమో గానీ సదరు వైబ్‌సైట్ పేజీకి సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది.

రద్దీ పెంచుకోవడం కోసమే :వెబ్‌సైట్‌ల నిర్వాహకులు తమ వైబ్‌సైట్ ప్రమోషన్‌ల కోసం సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నారు. ఇందుకు ఫేక్ న్యూస్‌ను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌లలో లింక్‌లను ఇవ్వడం ద్వారా పేజీని క్లిక్ చేసే వారి సంఖ్య పెరగడంతో రద్దీ పెరుగుతుంది. సందర్శకుల సంఖ్య పెరగడంతో వెబ్‌సైట్‌కు క్రేజ్ పెరిగి మార్కెట్‌లో ధరలు పలుకుతాయి. దీనిని ఆసరాగా చేసుకొని కేవలం రూ.10వేలకే తయారు చేసిన వెబ్‌సైట్‌లను సైతం లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రతి క్లిక్‌కు కూడా పైసా చొప్పున జమవుతుంటాయి. ఇందుకోసం ప్రతి వెబ్‌సైట్ నిర్వాహకులు ప్రమోషన్‌ల కోసం సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నాయి.-
– బషీర్, ఐటి నిపుణులు

Comments

comments