Home రాష్ట్ర వార్తలు పోలీసులకు వీక్లీఆఫ్‌లు…

పోలీసులకు వీక్లీఆఫ్‌లు…

Police

 

జులై నుంచి అమలు, ముందు ముందు హోంగార్డులకు కూడా, ఎడిజిపి జితేందర్ ప్రకటన
పోలీసులకు బర్త్‌డే గిఫ్ట్‌లు ఇచ్చే ఆలోచన

హైదరాబాద్ : శాంతి భద్రతల కోసం అహర్నిశలు శ్రమించే తెలంగాణ రాష్ట్ర పోలీసులకు వారాంతర సెలవును జూలై నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఎడిజిపి జితేందర్ తెలిపారు. తొలుత రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి వారాంతర సెలవులు ఇవ్వనున్నామని, తదుపరి హోంగార్డులకు వీక్లీ ఆఫ్ ఇచ్చే సమాలోచనలు సాగిస్తున్నామని తెలిపారు. విధి నిర్వహణలో 24 గంటలు తీవ్ర మానసిక ఒత్తిడిలో పనిచేసే పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవు ఇచ్చి ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎడిజిపి వివరించారు.

ఈక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాలలో పనిచేసే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని ఆయా జిల్లా ఎస్‌పిలకు ఆదేశాలివ్వనున్నట్లు తెలిపారు. ముఖ్యం గా రాష్ట్ర విభజన జరిగిన వెంటనే పోలీసులకు వారంతర సెలవును ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నామని, అయితే రాష్ట్రంలో సిబ్బంది కొరత కారణంగా పోలీసులకు వారాంతర సెలవును వాయిదా వేయడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో పోలీసు శాఖలో భారీగా రిక్రూట్‌మెంట్‌లు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల విజ్ఞప్తి మేరకు వీక్లీ ఆఫ్‌ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కాగా ఈ వీక్లీ ఆఫ్ విషయంలో రాష్ట్రంలోని జిల్లాల ఎస్‌పిలు, డిఎస్‌పి, సిఐలను జాబితా రూపొందించాలని ఆదేశాలిచ్చారు.

సదరు జాబితాలో స్టేషన్ల వారీగా ఎస్‌ఐ, ఎఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్స్, హోంగార్డుల సంఖ్య తెలుపుతూ నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది వివరాలను బట్టి ఆయా సిబ్బందికి వారాంతర సెలవును ప్రకటించాలని జిల్లా ఎస్‌పిలకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చామన్నారు. జిల్లాలోని పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిర్ణయం మేరకు అక్కడి సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోనున్నారు. పోలీస్ స్టేషన్ డ్యూటీ రోస్టర్ చార్ట్‌లో ఒక ప్రత్యేక కాలమ్‌ను ప్రకారం వారాంతపు సెలవు కేటాయించుకోవాల ని ఎస్‌హెచ్‌ఒలకు ఆదేశాలివ్వనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు సంబంధించిన వారాంతపు సెలవులపై ఇప్పటికే ఐజిలకు నివేదిక సమర్పించాలని కోరడం జరిగింది. ఇదిలావుండగా వారంతపు సెలవుల్లోనూ విధులు నిర్వహించిన వారికి అదనంగా సెలవులు ఇచ్చేందుకు సైతం కసరత్తు ప్రారంభించారు. వీక్లీ ఆఫ్ తీసుకోకుండా విధులకు హాజరైన సిబ్బందికి నెల జీతంలో అదనంగా రెండు, మూడు రోజుల వేతనాన్ని ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోలీసు స్టేషన్లలో అత్యవసర సమయాల్లో తమ వారాంతపు సెలవులో కూడా డ్యూటీకి వచ్చే సిబ్బందికి ఏదో ఒక రకంగా తోడ్పాటు నందించేందుకు పోలీసు బాసులు సమాలోచనలు సాగిస్తున్నారు.

త్వరలో బర్త్ ‘డే’ గిఫ్ట్‌కు శ్రీకారం : దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన తెలంగాణ రాష్ట్ర పోలీసులకు రాష్ట్ర పోలీసు బాసులు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చే విధంగా వినూత్న ఆలోచనలకు తెరతీస్తున్నట్లు సమాచారం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ పోలీసులకు కింది స్థాయి నుంచి పై స్థాయి పోలీసు ఉద్యోగులకు పుట్టినరోజు నాడు సైతం సెలవు ఇవ్వాలని పోలీసు బాసులు ఆలోచన చేస్తున్నట్లు తెలియవచ్చింది. పోలీసు శాఖలోని సిబ్బంది తమ పుట్టిన రోజు నాడు సెలవులు తీసుకునేందుకు ఆస్కారం లేకపోవడం వల్ల తమ కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తుందన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

పుట్టిన రోజు నాడు పోలీసులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం వల్ల వాళ్లు ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. కేవలం సెలవుతోనే సరిపెట్టకుండా వాళ్ల పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా గ్రీటింగ్ కార్డు, స్వీట్ బాక్స్ ఇచ్చేందుకు సైతం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలోని 55 వేల మంది పోలీసుల పుట్టిన రోజు డేటాను సైతం సేకరించనున్నట్లు తెలియవచ్చింది.

విధి నిర్వహణలో వివిధ ప్రాంతాలలో ఉన్న పోలీసుల పుట్టినరోజు వివరాలను సేకరించి వాళ్లు ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారో అక్కడికి ఆరోజున శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్ కార్డుతో పాటు స్వీట్ బాక్స్ పంపించే విధంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈక్రమంలో సదరు పోలీసు పుట్టిన రోజున పోలీస్ స్టేషన్ బోర్డులో అతని పేరు రాసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం. గ్రీటింగ్స్, స్వీట్ బాక్సులకు మొత్తాలను పోలీస్ వెల్‌ఫేర్ ఫండ్ నుంచి వెచ్చించేందుకు పోలీసు బాసులు నిర్ణయాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Weekly offs to Police