Home లైఫ్ స్టైల్ బరువు తగ్గాలంటే..

బరువు తగ్గాలంటే..

food

భోజనం చేసేప్పుడు పావువంతు కడుపును ఖాళీగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కడుపునిండా మెక్కితే ఆహారం సరిగా జీర్ణం కాకపోవటంతో పాటు ఒంట్లో కొవ్వు మోతాదూ పెరుగుతుందనేది అందులోని పరమార్థం. మరి అలా కొవ్వు పెరగకుండా చూసుకోవాలంటే మనం తినే ఆహరంలో కొన్ని మార్పులను అలవాటు చేసుకొవాలి. పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తెలుసు . అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రుణ ధాన్యాలను ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. . ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. వ్యాయామంతో పాటు, పదార్థాల ఎంపికలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వు తగ్గుతుంది. అదనంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చూడచక్కని రూపం మన సొంతమవుతుంది.

తేనె: పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా..వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క…కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.
గుడ్లు: శరీరానికి అవసరైన పోషకాలే కాదు, ఇందులోని విటమిన్ బి కొవ్వు కారకాలతో పోరాడుతుంది, ఫలితంగా కొవ్వు కరిగిస్తుంది.

గ్రీన్ టీ: అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. శరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాదు. దృడమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది ఈ గ్రీన్ టీ.

మొలకెత్తిన పెసలు: వీటిలో ఎ, బి, సి, ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం..మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే చాలా త్వరగా జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.

క్యాబేజీ: ఉడికించిన క్యాబేజీలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. తరచూ క్యాబేజీ తినడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ చేరవు. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదమూ తగ్గుతుంది. కండరాల దృఢత్వమూ సొంతమవుతుంది. రక్తాన్నీ శుద్దిచేయడం..కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడం..ఇలా శరీరానికి ఎన్నో విధాల మేలు చేస్తుందీ క్యాబేజీ.
క్యారెట్: క్యారెట్ శరీరంలోని చెడుకొవ్వునిల్వలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంచుతుంది. పీచుపదార్థాన్ని అందించే ఈ కాయగూరను వారంలో ఎక్కువసార్తు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నేరుగా తినే ప్రయత్నం చేయాలి.

కరివేపాకు: కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాదు..అదనంగా పేరుకోకుండా చేసే శక్తి కరివేపాకు రెమ్మల సొంతం. శరీరంలోని వ్యర్థాలనూ బయటకు పంపివేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ నూ కరిగిస్తుంది. అందుకే ఊబకాయంతో బాధపడేవారు రోజు కరివేపాకును ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

పసుపు: వంటకాల్లో ప్రతి నిత్యం వేసే చిటికెడు పసుపుతో కలిగే మేలు అంతా ఇంతా కాదు. యాంటీబ్యాక్టీరియల్ సుగుణాలున్న పసుపుతో శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థ కొవ్వు కరుగుతుంది. అదనంగా కొన్ని రకాల క్యాన్సర్ల తీవ్రతను తగ్గించే గుణం పసుపుకే సొంతం. కాలేయంలో చేరిన వ్యర్దపదార్థాలను వెలుపలికి పంపించివేస్తుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు తోడ్పడుతుంది. దాంతో గుండె ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది.
వెన్న తీసిన పాలు: ఇందులో ప్రోటీన్, క్యాల్షియం దండిగా ఉంటాయి. వెన్న తీసినప్పటికీ ఈ పాలు తాగినప్పుడు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఇవి బరువు తగ్గటాన్ని ముఖ్యంగా నడుం వద్ద కొవ్వు పేరుకుపోవటాన్ని తగ్గిస్తాయి.

పుచ్చపండు: ఇందులో నీరు అధికంగా ఉంటుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కేలరీలూ తక్కువే. పైగా ఇందులో లైకోపేన్ అనే యాంటీఆక్సిడెంట్ దండిగా ఉంటుంది. ఏ, సి విటమిన్లూ లభిస్తాయి.
చిక్కుళ్లు: బీన్స్, గోరుచిక్కుడు, చి క్కుడు వంటి కూరగాయల్లో ప్రోటీన్లు, పీచు దండిగా ఉంటాయి. తక్కువ కేలరీలతోనే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి.

గింజ పప్పులు: బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజపప్పులు (నట్స్) త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. వీటిల్లో ప్రోటీన్, పీచు, గుండెకు మేలు చేసే కొవ్వులు ఉంటాయి. అయితే వీటిని పరిమితంగానే తినాలని గుర్తుంచుకోవాలి. అప్పుడే ఇవి బరువు తగ్గటానికి, కొలెస్ట్రాల్ స్థాయులు అదుపులో ఉండేందుకు దోహదం చేస్తాయి.

పీర్స్, యాపిల్స్: వీటిని పొట్టుతీయకుండా తింటే పీచు మరింత ఎక్కువగా లభిస్తుంది. త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. చాలాసేపు ఆకలి వేయకుండా చూస్తాయి. నమిలి తినటం వల్ల కేలరీలూ ఖర్చవుతాయి.
బెర్రీలు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లలోనూ పీచు, నీరు అధికంగా ఉంటాయి. పైగా ఇవి తీయగా ఉండటం వల్ల తిన్న తృప్తీ కలుగుతుంది. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లూ దండిగానే ఉంటాయి.