Home మహబూబాబాద్ ఇంటి ముందుకే సంక్షేమ పథకాలు

ఇంటి ముందుకే సంక్షేమ పథకాలు

ktr

*ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
*రైతుబాంధవుడు కెసిఆర్
*బయ్యారం ఉక్కు పరిశ్రమ స్థాపిస్తాం
*రాష్ట్రంలో 42 లక్షల మందికి ‘ఆసరా’
*ఆడపిల్లలకు మేనమామలా భరోసా

మన తెలంగాణ / మహబూబాబాద్ ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వంలో లబ్దిదారుడి ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు అందించే విధంగా పథకాలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రూ.35కోట్ల వ్యయంతో సాలార్‌తండ వద్ద నిర్మించనున్న జిల్లా సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్‌తో కలిపి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయితీలుగా చేస్తామని కాంగ్రెస్ పార్టీతో సహా గత ప్రభుత్వాలు మర్చిపోయారేమో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికార విభజన జరుగుతుందని, మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పిన మన ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఏ అం శాన్నీ వదల కుండా నేడు రాష్ట్రంలో 2,630 గిరిజన తండాలను గ్రామ పంచాయితీలుగా చేసేందుకు చర్యలు తీసుకున్న ఘనత కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలు, కొత్త గ్రామ పంచాయితీలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో తీర్చి దిద్దేందుకు ఆలోచనతో, ప్రణాళికా బద్దంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర వలస పాలకులకు చుక్కలు చూపించిన గడ్డ మానుకోటని దశాబ్దాల పోరాటానికి జీవం పోసిన పోరుగడ్డని మంత్రి కెటిఆర్ అన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, హేళనలు, అవమానాలు ఎదుర్కొన్నా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలుకూడా నెరవేరుస్తూ ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి చేయలేని పని నేడు ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇవ్వాలనే సంకల్పంతో భగీరధ ప్రయత్నం చేసి మిషన్ భగీరధ పథకం ప్రవేశపెట్టిన దమ్మున్న నాయకుడు కెసిఆర్ అని అన్నారు.
ఏప్రిల్ 20 నుండి రైతు బంధు అమలు
ఈ నెల 20నుండి రైతు బంధు పథకం క్రింద రైతులకు ప్రతి ఎకరాకు రూ.4వేలు చొప్పున ఏటా రెండు పంటలకు రూ.8వేలు ఇచ్చి రైతుకు పెట్టుబడి ఆసరా కల్పిస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రైతే రాజును చేయాలనే సంకల్పంతో ఎరువులు , పురుగుమందులు నిల్వ ఉంచేందుకు  రాష్ట్రంలో 4లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటి ఉన్న గోదాంలను నేడు 20లక్షల టన్నుల కెపాసిటీకి పెం చిన ఘనత మన ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనన్నారు.
జిల్లాను అన్ని హంగులతో అభివృద్ది చేయాలి
మహబూబాబాద్ జిల్లాను అన్ని హంగులతో పూర్త స్థాయిలో అభివృద్ది చేయాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మంత్రి సూచించారు. అందుకు తగిన పూర్తిస్థాయి నిధులు కూడా మంజూరు చేయిస్తామని, ఇప్పటి వరకూ వచ్చిన నిధులు సక్రమంగా సద్వినియోగపర్చుకోవాలని ఆయన అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ తప్పకుండా ఏర్పాటుచేస్తామని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఏర్పాటుచేస్తామని, సహకరించకుంటే సింగరేణితో కలిసి ఉక్కుపరిశ్రమ ఏర్పాటుచేస్తామన్నారు.
ఆడపిల్ల పుడితే అవస్థలు ఉండవు: మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్రంలో ఇక నుండి ఆడపిల్ల పుడితే అవస్థలు ఉండవని గర్భిణీ నుండి బాలింతకు ప్రభుత్వమే సేవలు అందిస్తూ పుట్టిన బిడ్డకు కెసిఆర్ కిట్ క్రింద 15రకాల వస్తువులను ప్రభుత్వం ఇస్తోందన్నారు. అలాగే ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి అయిన వారికి రూ.12వేలు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టన కళ్యాణలక్ష్మి, షాది ముబాకర్ పథకం క్రింద ప్రతి ఆడపిల్ల పెళ్ళికీ రూ.1లక్ష వెయ్యినూట పదహార్లు ఇచ్చి ఆసరా ఉన్నారన్నారు. జిల్లాను చేసిన ఒక సంవత్సరంలోనే రూ.50కోట్ల నిధులు మంజూరుచేసి జిల్లా అభివృద్ది చేసుకోమంటున్నారంటే ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం గొప్పదని తుమ్మల అన్నారు.
కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవు: మంత్రి చందూలాల్
విద్యార్ధులకు కంపుగొడుతున్న హాస్టళ్ళు, దొడ్డుబియ్యం అన్నం పెట్టి విద్యార్ధుల ఉసురు పోసుకున్న కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని, టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో విద్యార్ధులకు సన్న బియ్యం అన్నం, చికెన్, గ్రుడ్లు, బెడ్‌లు ఇచ్చి ప్రతి విద్యార్ధికీ ఏటా సుమారు 1లక్షా25వేల ఖర్చుచేస్తున్నామని గిరిజన శాఖ మంత్రి అజ్మిర చందూలాల్ అన్నారు.
బయ్యారం గనులు కాపాడుకున్నాం: ఎంపి
సీతారాంనాయక్
నాడు బయ్యారం గనులు నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడి రచన కన్‌స్ట్రక్షన్స నుండి కాపాడుకున్నామని, సీమాంద్ర పాలకుల అక్రమ రవాణాకు అడ్డుకున్నామని మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్ అన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు వస్తోందో అర్ధం కావడంలేదన్నారు. తప్పైందని ప్రజల ముందు చెంపలు వేసుకునేందుకే బస్సుయాత్ర చేస్తున్నారని ఎంపి విమర్శించారు.
సుందరీకణ దిశగా రూపురేఖలు మారాలి: ఎమ్మెల్యే రెడ్యానాయక్
గ్రామ పంచాయితీ నుండి మున్సిపాలిటీకి తద్వారా నేడు జిల్లా స్థాయికి ఎదిగి మహబూబాబాద్ జిల్లాను సుందరీకరణతో అన్ని హంగులతో తీర్చి దిద్ది ముఖ్యమంత్రి కెసిఆర్ కలలు నిజం చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా అవుతుందని కలలో కూడా ఊహించలేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ దయతో నూతన జిల్లాగా ఏర్పడడమే కాకుండా, జిల్లాలో తండాలను గ్రామ పంచాయితీలుగా చేసి బంగారు తెలంగాణ దిశగా దినదినాభివృద్దికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి: ఎమ్మెల్యే ఎర్రబెల్లి
జిల్లాకు గిరిజన జిల్లాగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గత ప్రభుత్వాలు, పాలకులు చేయలేని పని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపిస్తున్నారని కాళేశ్వరం ప్రాజక్ట్ పూర్తి చేసి రాబోయే రోజుల్లో సంవత్సరంలో 365రోజులూ కాలువల్లో నీళ్ళు వచ్చే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వాల్లో తవ్వించిన కాలువల్లో ఏనాడూ నీరు పారలేదన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ, ఖమ్మం చైర్మన్ కవిత, ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ గుడిపూడి నవీన్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, సత్యవతిరాధోడ్, రాష్ట్ర నాయకులు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు, నూకల నరేష్‌రెడ్డి, బీరెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటిసి మూలగుండ్ల వెంకన్న, ఎంపిపి గోనె ఉమారాణి, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, ఎస్‌పి నంద్యాల కోటిరెడ్డి, జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి, మున్సిపల్ కమీషనర్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.