Home ఎడిటోరియల్ బంగ్లా ఎన్నికల్లో హింస

బంగ్లా ఎన్నికల్లో హింస

Bangladesh election Cartoon

 

బంగ్లాదేశ్‌లో ఎన్నికల హింసాను పాశ్చాత్య దేశాలు ఖండించాయి. అక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా పార్టీ 96 శాతం పార్లమెంటు సీట్లు గెలుచుకుంది. కాని ఈ ఎన్నికలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. భారీ ఎత్తున అవకతవకలు, అక్రమాల వార్తలు గుప్పుమన్నాయి.బ్రిటన్, యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు అత్యంత తీవ్రమైన స్వరంతో ఈ ఎన్నికలను ఖండించాయి. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రతిష్ఠ అడుగంటే పరిణామాలివి. మొన్న ఆదివారం జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ ప్రధాని వరుసగా మూడోసారి రికార్డు గెలుపు సాధించారు.

ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను తిరస్కరిస్తున్నాయి. ఓటర్లను భయపెట్టడం, బెదిరించడం, ఒత్తిడికి గురిచేయడం వంటి చర్యలు చోటు చేసుకున్నాయని, పెద్దస్థాయిలో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాని షేక్ హసీనా ఎలాంటి అవకతవకలు జరగలేదంటున్నారు. బంగ్లాదేశ్‌లో చాలా శాంతియుతంగా ఎన్నికలు జరిగాయని, ప్రజలు ఎంతో ఉత్సాహంతో తమ పార్టీకి ఓటేశారని ఆమె అంటున్నారు. కాని 300 స్థానాల సభలో 288 స్థానాలు అవామీలీగ్ సంకీర్ణానికే లభించాయంటే ఎన్నికలు ఎంత నిష్పక్షపాతంగా జరిగాయో తెలుస్తోందని విమర్శకులు అంటున్నారు. ఉత్తరకొరియా వంటి దేశాల్లో తప్ప ప్రజాస్వామిక దేశాల్లో ఇలా 96 శాతం గెలుపు ఒకే పార్టీ సాధించడం ప్రజాస్వామిక దేశాల్లో ఉండదంటున్నారు.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో చెదురుమదురు సంఘటనలు మాత్రమే జరిగాయి. కాని ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పక్షం దౌర్జన్యాలకు దిగిందని, బలవంతంగా ఓట్లు వేయించారని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆరోపించింది. అధికార పక్షం అవామీలీగ్ కార్యకర్తలు ప్రతిపక్షాలపై భయంకరమైన దాడులకు దిగారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.

ఎన్నికల్లో హింసాకాండ పెద్ద ఎత్తున జరిగిందని, ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని యూరోపియన్ యూనియన్ కఠిన పదాలతో వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలు, హింసాకాండపై విచారణ జరగాలని చెప్పింది. బంగ్లాదేశ్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశం అమెరికా. అది కూడా బంగ్లాదేశ్ ఎన్నికలపై విమర్శలు జారీ చేసింది. వేధింపులు, బెదిరింపులు, హింసాకాండ ఎన్నికలకు ముందు పెద్దఎత్తున జరిగినట్లు విశ్వసనీయమైన సమాచారం తమ వద్ద ఉందని అమెరికా పేర్కొంది.

ప్రతిపక్షఅభ్యర్థులు ప్రచారం చేయడం కూడా కష్టమైన పరిస్థితులు సృష్టించారని, సభలు సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ లేకుండా చేశారని అమెరికా వ్యాఖ్యానించింది. చాలా మంది ఓటు వేయకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. ఎన్నికల వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఈ ఎన్నికలు జరిగాయని అమెరికా విమర్శించింది. బ్రిటన్‌కు చెందిన ఆసియా పసిఫిక్ మంత్రి మార్క్ ఫీల్ తీవ్రమైన పదాలతో బంగ్లాదేశ్ ఎన్నికలను ఖండించారు. ఎన్నికల దౌర్జన్యాలకు సంబంధించి తన వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందన్నారు. అక్రమ నిర్బంధాలు, అరెస్టులతో ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం చేయకుండా అధికారపక్షం అడ్డుకున్న అనేక సంఘటనలున్నాయన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వచ్చిన అన్ని ఫిర్యాదులపై తగిన విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల రోజు జరిగిన హింసాకాండలో 17 మంది మరణించారని పోలీసులు అంటున్నారు. ఈ హింసాకాండకు ప్రతిపక్షాలే కారణమని అవామీలీగ్ ఆరోపిస్తుంటే, ప్రభుత్వ పక్షం దౌర్జన్యాలకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం రిగ్గింగ్‌కు సంబంధించిన అనేక సంఘటనల నివేదికలు సేకరించి ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తామని అంటున్నారు. ఎన్నికలు మళ్ళీ నిర్వహించాలన్న డిమాండ్ బలం పుంజుకుంటోంది. మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ను కమిషన్ ఇంతకు ముందు తిరస్కరించింది.

ఎన్నికల సందర్భంగా అనేకమంది జర్నలిస్టులకు అరెస్టులు, అక్రమ నిర్బంధాలు తప్పలేదు. ఎన్నికల అవకతవకలపై అబద్ధపు వార్తలు ప్రచురిస్తున్నారంటూ జర్నలిస్టులపై అధికారులు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అసమ్మతి గొంతు నులిమే కొత్త చట్టాలను ప్రభుత్వం ఇంతకు ముందే చేసి పెట్టింది. ఖుల్నా ప్రాంతంలో రిజిస్టరైన ఓటర్ల సంఖ్య కన్నా చాలా ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని హిదాయత్ హుస్సేన్, రషీదుల్ ఇస్లామ్ అనే జర్నలిస్టులు బయటపెట్టారు. వారిద్దరిపై డిజిటల్ సెక్యురిటీ చట్టం క్రింద కేసు పెట్టారు. ఈ చట్టం మొన్న సెప్టెంబరులో వచ్చింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన అమానుష చట్టమిది. హిదాయత్ హుస్సేన్ ఇప్పుడు నిర్బంధంలో ఉన్నాడు.

రషీదుల్ ఇస్లామ్ తప్పించుకుని రహస్యంగా బతుకుతున్నాడు. ఈ జర్నలిస్టులు అబద్ధపు వార్తలతో ఎన్నికల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారంటూ పోలీసులు వారిపై విరుచుకుపడుతున్నారు. పోలింగ్ రోజున భారీ స్థాయిలో హింసాకాండ జరిగింది. ఎన్నికల ప్రచారం కొనసాగినంత కాలం హింసాకాండ కూడా కొనసాగింది. ప్రతిపక్షాలపై వేధింపులు, ప్రతిపక్షాల కార్యకర్తల అక్రమ నిర్బంధాలు, దాడులు, దౌర్జన్యాల ఫిర్యాదులు లెక్కకు మిక్కిలి వచ్చాయి. హింసాకాండకు తమకు సంబంధం లేదని పాలకపక్షం చెబుతోంది. దక్షిణాసియాకు చెందిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కూడా హింసాకాండ, వేధింపులు జరిగాయని అంటున్నారు. ఈ ఫిర్యాదులపై తక్షణం విచారణ జరగాలని కోరుతున్నారు.

ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజీబుర్రహ్మాన్ కుమార్తె. ఆయనన్‌ను 1975లో హతమార్చారు. ఆమెకు ప్రధాన ప్రత్యర్థి ఖాలిదా జియా. గత మూడు దశాబ్దాలుగా షేక్ హసీనా బంగ్లాదేశ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2009 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికలను ప్రతిపక్షాలన్నీ బహిష్కరించాయి. పోటీలేని కేవలం 22 శాతం పోలింగ్ జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా గెలిచినట్లు ప్రకటించుకుని ప్రధానిగా పరిపాలించారు. ఖాలిదా జియా అవినీతి ఆరోపణలతో జైల్లో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో ప్రజాస్వామ్యం కుప్పకూలిందనడానికి ఈ రెండు ఎన్నికలు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్ కేవలం ఒకే పార్టీ ప్రజాస్వామ్యంగా మారింది. అంటే నిరంకుశత్వం. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ప్రతిపక్షమే లేదు. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం ఉండకూడదు.

Western countries condemn election violence in Bangladesh

Telangana Latest News