బెంగళూరు: వేదికగా ఆతిథ్య భారత్ జట్టుతో జరిగిన చరిత్రాత్మక టెస్టులో అఫ్గనిస్థాన్ జట్టు ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో అఫ్గాన్ పై భారీ విజయం సాధించింది. టెస్టుల్లో ప్రపంచ నెం.1 జట్టుగా కొనసాగుతున్న భారత్ ముందు తొలి టెస్టు ఆడుతున్న పసికూన అఫ్గాన్ టీమ్ ఏ సందర్భంలోనూ పోటీని ఇవ్వలేకపోయింది. ఒకే రోజులో రెండుసార్లు ఆలౌట్ కావడంతో ఇన్నింగ్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే మ్యాచ్ అనంతరం ట్రోఫీ బహుకరణ సమయంలో చోటుచేసుకున్న ఓ దృశ్యం మాత్రం ఇప్పుడు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. చారిత్రక టెస్టులో ఘన విజయం సాధించిన రహానె సేన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడంలోనూ ముందు వరుసలో నిలిచింది. ట్రోఫీ అందుకొన్న భారత్ ఆటగాళ్లు మొదట ఫోటోలకు పోజు ఇచ్చారు. అనంతరం అక్కడే ఉన్న అఫ్గాన్ ఆటగాళ్లను కూడా సాదరంగా ఆహ్వానించి వాళ్లతో కలిసి మరోసారి గ్రూప్ ఫోటో దిగారు. ఈ దృశ్యం చూసిన స్టేడియంలో ఉన్న అభిమానులు ఇరుదేశాల జాతీయ పతాకాలను ఊపుతూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తిపై క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా క్రీడాస్ఫూర్తికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే…
What a brilliant gesture from #TeamIndia to ask @ACBofficials players to pose with them with the Trophy. This has been more than just another Test match #SpiritofCricket #TheHistoricFirst #INDvAFG @Paytm pic.twitter.com/TxyEGVBOU8
— BCCI (@BCCI) June 15, 2018