Search
Wednesday 21 November 2018
  • :
  • :

దోమే కారకం

masqito

మలేరియా మారకం దోమే కారకం

మలేరియా మృతులు అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 7%శాతం రోగులు మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల మంది మలేరియా బారిన పడుతుంటే 4 లక్షల 45 వేల మంది ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఏటా రెండు లక్షల ఐదువేల మంది మలేరియాతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మనిషి పాలిట మారణా యుధాలకన్నా ప్రమాదకరంగా నేడు దోమలు తయారయ్యాయి. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది, మన దేశంలో లక్షలాది మంది దోమకాటుకు బలై వ్యాధుల బారిన పడడమో, మరణాలు సంభవించడమో జరుగుతోంది. ఈ పరిస్థితి తీవ్రతను గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) ప్రతి ఏటా ఏప్రిల్ 25వ తేదీని ‘మలేరియా దినం’గా ప్రకటించింది. ఈ సందర్భంగా మలేరియాపై ప్రాథమిక అవగాహన కల్గించుటకు నిజామాబాద్ జిల్లా, పోతంగల్ ప్రభుత్వాసుపత్రి  వైద్యాధికారి డాక్టర్ కె.పృధ్వీరాజ్‌తో పల్స్ పలకరించింది…

ఏప్రిల్ 25న మలేరియా దినాన్ని పాటిస్తున్నాం. దీని ప్రాముఖ్యత వివరిస్తారా?
ఔను! ప్రపంచవ్యాప్తంగా దోమల బెడద ఎక్కువైంది. వీటివల్ల మలేరియా వ్యాధి ప్రబలి లక్షలాదిమంది బాధపడుతున్నారు. వేలాదిమంది ఏటా మన దేశంలోనే చనిపోతున్న దాఖలాలున్నాయి. ఈ సమస్య చాలా ఏళ్ల నుండి ఉన్నా, తీవ్రతను బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) 2007లో, ఏప్రిల్ 25న మలేరియా దినాన్ని పాటించాలని ప్రకటించింది. దీనివల్ల ప్రజలకు మలేరియా వ్యాధిపై అవగాహన పెంపొందింపజేసి, ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చు.
మలేరియా వ్యాధి ఎట్లా వ్యాపిస్తుంది?
ఆడ అనాఫిలెస్ అనే దోమలకు తాము పెట్టే గుడ్లను పెంపొందించుకొనుటకు మనుషుల రక్తం అవసరమౌతుంది. అందుకు అవి మనుషులను కుట్టే కార్యక్రమం పెట్టుకుంటాయి. అవి మనిషిని కుట్టినప్పుడు ప్లాస్మోడియం పరాన్నజీవి వ్యాపిస్తుంది. ఒక మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన దోమ, మరో ఆరోగ్యవంతున్ని కుడితే అతడు కూడా మలేరియా బారిన పడడం జరుగుతుంది.
మలేరియా వ్యాధి లక్షణాలేమిటి?
మలేరియా వ్యాధి సోకిన వ్యక్తికి విపరీతమైన చలి, వణుకుతో జ్వరం వస్తుంది. ఈ మలేరియా పరాన్నజీవి రక్తంలో చొరబడిన తర్వాత అది కాలేయంలోకి ప్రవేశించి అభివృద్ధి చెందుతుంది. అనంతరం రక్తకణాలపై దాడిచేసి వాటిని నాశనం చేస్తుంది. అప్పుడు చలి, వణుకు లాంటివి వస్తాయి. కొందరికి తల, ఒళ్లు నొప్పులు అధికమౌతాయి. వాంతులు కూడా కావచ్చు. రక్తహీ
నత పెరుగుతుంది. చిన్న పిల్లలకు నీళ్ల విరేచనాలు కూడా అవుతాయి. హిమోగ్లోబిన్ క్షీణిస్తుంది. వ్యాధి ముదిరితే కిడ్నీలు, కాలేయం, మెదడు వంటి అవయవాలపై ప్రభావం ఉంటుంది. చిన్న పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు మరింత ప్రమాదం. వెంటనే సరైన వైద్యుల సమక్షంలో చికిత్స చేయించుకోవాలి.
మలేరియా వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలేమైనా ఉన్నాయా?
మనం కొద్దిగా అవగాహనతో మెదిలితే మలేరియాను అరికట్టడం కష్టం కాదు. మొదలు దోమల దండుల్ని అడ్డుకోవాలి. అవికుట్టకుండా చూచుకోవాలి. ఒకవేళ కుట్టినా వెంటనే వీలైనంత త్వరగా తగు చికిత్సలు చేయించుకోవాలి. డాక్టర్ సలహా మేరకు క్రమంగా మందులు తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ మందులు వాడకపోవడం లో జాప్యం ప్రదర్శించినా ప్లాస్మోడియం పరాన్నజీవి మలేరియా మందుల్ని ఎదిరించే సామర్థాన్ని పెంపొందించుకుంటుంది. అప్పుడు సమస్య జటిలమౌతుంది. అందుకు డాక్టరు పర్యవేక్షణలో సరైన విధంగా ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.
దోమలు వ్యాప్తి కాకుండా మీ సలహా?
ప్రథమ సూత్రం దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూచుకోవాలి. అవి కుట్టకుండా దోమతెరల్ని వాడాలి. ఇంటి పరిసరాలల్లో నీటి నిల్వలు ఉండకుండా చూచుకోవాలి. ఇంటి కిటికీలకు, తలుపులకు జాలీలు బిగించుకోవడం మంచిది. మన ఇంటి పరిసరాల్లో కొట్టి పారేసిన కొబ్బరి బోండాలు, పాతబడిన వాహనాల టైర్లు, ఖాళీ కుండలు, లేదా పాత్రలు వంటివి ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే, వర్షం పడ్డప్పుడు అందులో నీళ్లుపడి అవి అట్లాగే రోజుల తరబడి ఉండడం, వాటిలో దోమలు వృద్ధిచెందడం జరుగుతాయి.
దోమలు అభివృద్ధి చెందకుండా “టిమిఫాస్‌” స్ప్రే చేసుకోవడం మంచిది. నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ‘గంబూసియా’ చేపలు వదలడం ఉత్తమం. అవి దోమలు పెట్టే గ్రుడ్లు తింటాయి. దోమలు కుట్టకుండా ఒంటికి రాసుకునే పూత మందులు వచ్చాయి. అవి వాడుకోవచ్చు. పొడవైన చేతుల చొక్కాలు వేసుకోవడం ఒక నివారణ చర్యనే దోమలను చంపే స్ప్రేలను కూడా చల్లుకోవచ్చు. ఇప్పుడు దోమతెరలకు కూడా దోమల నివారణ కోసం పూతలు పూసి అమ్ముతున్నారు. వాటినీ వాడుకోవచ్చు. అందుకే మలేరియా నివారణలో అవగాహన పెంచుకోవడం ముఖ్యం.
దోమలవల్ల ఏయే రకాల జబ్బులు వస్తాయి?
దోమకాటు వల్ల మలేరియా, పైలేరియా, చికెన్‌గున్యా, మెదడువాపు , డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి.
ప్రభుత్వపరంగా మలేరియా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ప్రభుత్వాసుపత్రులలో ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటిస్తున్నాం. ప్రధానంగా ఆశావర్కర్లు గ్రామాలల్లో మలేరియాపై అవగాహన కలిగించుటకు విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. జ్వరంతో మూడు రోజులకంటే ఎక్కువకాలం బాధపడుతుంటే వైద్యపరీక్షల్ని నిర్వహిస్తున్నాం. మోతాదుల్నిబట్టి మందుల్ని ఇస్తున్నాం. ఏదేమైనా ప్రజల అవగాహనలు, సహకారాలు ఉంటే సమస్య తీవ్రతల్ని చాలావరకు తగ్గించవచ్చు.

Comments

comments