Home ఎడిటోరియల్ ఏం చదువమంటారు?

ఏం చదువమంటారు?

edt

దేశ ప్రస్తుత జనాభా 132 కోట్లు. అందులో 25 ఏళ్ల లోపు వారు 50%, 35ఏళ్ల వయస్కులు 65% ఉన్నారు. విచారకరమైన విషయమేమిటంటే సగానికి పైగా జనాభా ఏం చదువుతున్నారు, చదివినవారు ఏం పని చేస్తున్నారు అనే లెక్కలు ప్రభుత్వాల దగ్గర లేవు. దేశంలో విద్యావంతులెందరో, చదువుకు తగిన ఉద్యోగాలు ఎందరికి దొరికాయి, మిగిలిన వారు ఏ ఉపాధి చేపట్టారు అనే వివరాలు ఏ శాఖ వద్దా లేవు. ఇంటికో ఉద్యోగం, ఏడాదికి కోటి మందికి ఉపాధి కల్పన హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు పకోడీ అమ్మేవాళ్లను, ప్రావిడెంట్ ఫండ్ నమోదు సంఖ్యను చూపి అదిగో కొత్త ఉద్యోగులని లెక్కలు చెబుతున్నారు. చదువుకున్నవారు ప్రభుత్వ సంస్థల్లో సజావుగా ఉద్యోగాలు చేసి రిటైరై నిశ్చింతగా బతికే రోజులు పోయాయి. 1991లో ఆనాటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో అవి కనుమరుగైనాయి. దేశం రాజకీయ బానిసత్వం నుండి ఆర్థిక బానిసత్వంలోకి మారి విదేశీ పెట్టుబడులతో ఊపిరి తీసుకోవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1995లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ప్రపంచ బ్యాంకు చుట్టూ రెండేళ్లు తిరిగి అప్పు సంపాదించారు. అప్పుకు ముందు ప్రపంచబ్యాంకు 1% ఉద్యోగుల కోత, కొత్త నియామకాల నిలిపివేత లాంటి జన వ్యతిరేక నిబంధనలు పెట్టింది.
ప్రభుత్వ ఉద్యోగాలనుండి యువత దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ ఉద్యోగాలు గొప్పవంటూ ఆశలు పెంచాడు. స్వయంగా బిల్‌గేట్స్‌ను ఒప్పించి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ బ్రాంచిని తెరిపించాడు. కేంద్ర ప్రభుత్వంపై తనకున్న ప్రాబల్యంతో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉదారంగా అనుమతులు పొందేలా చేశాడు.
ఆనాటికి ఆంధ్రప్రదేశ్‌లో 37 ఇంజినీరింగ్ కాలేజీలుండగా, 2004 నాటికి 220 అయ్యాయి. ఐటి ఉద్యోగాలు సంపాదించాలంటే, ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావాలంటే ఇంటర్‌స్థాయిలో తీవ్ర కృషి అవసరమైంది. దాంతో ప్రైవేటు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మధ్యతరగతి ఆశల్ని ఆసరా తీసుకొని కోట్లు గడించాయి, గడిస్తున్నాయి కూడా.
2008లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను 2009 ఎన్నికలకు గురిగా ప్రవేశపెట్టింది. 2010 నాటికి 705 కాలేజీలు, 2.52 సీట్లు అదో తారస్థాయి దశ. ఫీజు రీయింబర్స్‌మెంట్ వాటి కడుపు నింపింది. నాణ్యత లేని చదువులతో తెలుగిళ్లలో ఇంటికో ఇంజనీర్ తయారయ్యాడు. 2014లో తెలంగాణ ప్రభుత్వం కాలేజీల తనిఖీలతో నాణ్యత, బోధనా సిబ్బంది అర్హతలు, ప్రయోగశాలల వసతి లెక్కలు తీసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని సహేతుకంగా చేసే క్రమంలో ఈ చర్యలు చేపట్టింది. కాలేజీల యాజమాన్యం కోపానికి గురి కాకుండా వారికి ఫీజులు సవరించుకునే అవకాశం ఇచ్చింది. ఉచితమే కదాని చేరిన విద్యార్థులకు మధ్యంతరాన ఫీజుల భారం పడుతోంది.
ఇటు ఉద్యోగాల వసతులు చూస్తే పూర్తి నిరాశాజనకంగా ఉంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు అనుకున్న స్థాయిలో పెరగకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య పెరిగి పోయింది. ఊర్లోనే ఉండి వేల ఖర్చుతో డిగ్రీ పూర్తిచేసినా లక్షలు వెచ్చించి ఇంజనీరింగ్ చేసినా బేధమేమీ లేని స్థాయికి పరిస్థితి దిగజారిపోయింది. ఇంజనీరింగ్ మోజు తగ్గిపోయిందనడానికి తగ్గుతున్న కాలేజీలు, కోర్సుల్లో సీట్లే తార్కాణం. తెలంగాణలో 201718 అడ్మిషన్ల ప్రకారం 207 కళాశాలల్లో 90,011 సీట్లు ఉన్నాయి. అవి కూడా నిండక ఏడాదికిన్ని కోర్సులు, కాలేజీలు అదృశ్యమౌతున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, నాస్కామ్ మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం లేదంటున్నాయి. ఉద్యోగాలకు సరిపడేవారు 18% మించి రావడం లేదు అని వారి వాదన. ఆ 18% నుండి 25% ఉద్యోగులైనా సుఖంగా ఉద్యోగ జీవితం గడుపుతున్నారా అంటే అదీ లేదు. పదేళ్ల క్రితం సుమారు మూడు లక్షల ప్రారంభ ప్యాకేజీ ఉంటే ఇప్పుడు అంతే మొత్తం లేదా అంతకన్నా తక్కువ ఇస్తున్నారు. దానికే మహాభాగ్యమనే స్థితి ఉద్యోగార్థులది. జీతభత్యాలు నచ్చక బెంగుళూరులో కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఊబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసుల్లో చేరిపోయారు. మధ్యప్రదేశ్‌లో ఇంజనీరింగ్ చదివిన వారు చప్రాసీ ఉద్యోగాలకు అప్లికేషన్లు పెడుతున్నారని స్వయానా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నట్లు పత్రికల్లో వచ్చింది.ప్రాంగణ నియామకాలు క్రమంగా తగ్గుమొకం పడుతున్నాయి. ఈ సంవత్సరం ఐఐటి ముంబైలో 24% ఐటి ఉద్యోగాలు కాగా 45% ఫైనాన్స్, ఇప్పుడు కన్సల్టెన్సీల్లో నియామకమయ్యారు. ఐఐటిల్లో కూడా నియామకాలు తగ్గుతున్నాయి. 201617లో 66% ప్లేస్‌మెంట్లు జరిగాయి.ఏదో ప్యాకేజీలో ఉద్యోగం వచ్చిందని సంతృప్తిపడే కాలంకూడా కాదు. ఏరోజు పింక్ స్లిప్ ఇచ్చి బెంచిపై కూర్చోబెడతారో తెలియదు. వివిధ కారణాల వల్ల ఏటా రెండు లక్షలమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పనులు కోల్పోతుండగా సుమారు లక్షన్నర మంది కొత్త ఉద్యోగులు వస్తున్నారు. అనగా ఏడాదికి 50వేలమంది నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. వీళ్లంతా ఇరవై ఏళ్ల ఉద్యోగం చేసిన నాలుగు పదుల వయసు దాటినవాళ్లు. ఈ మధ్య హెచ్‌సిఎల్ కంపెనీ +2 పూర్తి చేసిన వాళ్లను ఎంపిక చేసుకొని తగిన నైపుణ్యాలకు శిక్షణ ఇచ్చి ఒప్పందం చేసుకొని ఉద్యోగాలిస్తోంది. బిటెక్ పూర్తి చేసినవారికి 3లక్షల ప్యాకేజీ ఇస్తే +2 వాళ్లు 1.5లక్షలకే ఉద్యోగాల్లో చేరుతున్నారు.ఇంజనీరింగ్ చదువు వ్యక్తిగత ఇష్టానికి సంబంధించినది. అదేదీ పట్టించుకోకుండా తల్లిదండ్రులు పేరాశతో పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి అటు తల్లిదండ్రులు, ఇటు చదువు పూర్తి చేసిన పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అసలు ఇంజనీరింగులో ఉద్యోగాలే లేనపుడు ఆ చదువు ఎందుకనే ప్రశ్న ఈ మధ్య వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నియామకాల్లో పోలీసు కానిస్టేబుల్స్‌గా, గ్రామాధికారులుగా బిటెక్, ఎంటెక్ వాళ్లు చేరుతున్నారు.
ఆటోమేషన్, రోబోటిక్ యాంత్రికత వల్ల వందమంది చేసే పనికి 70 మంది చాలు. సీనియర్ ఉద్యోగుల్లో 60% మందికి కొత్త నైపుణ్యాల అవసరం ఉంది. ఉద్యోగ కల్పన లేదు, ఉన్న ఉద్యోగం ఎన్నాళ్లు చేస్తారో తెలీదు. వృత్తి నైపుణ్యాల కొరత పేరిట నలభై ఏళ్లు దాటిన వాళ్లను బయటికి నెట్టేస్తే వాళ్ల పరిస్థితికి బాధ్యత వహించే వాళ్లు లేరు. సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగ సంఘాలు లేవు. ఇప్పుడిప్పుడు ఆ ఆలోచన వస్తోంది.విచిత్రమేమిటంటే ఎలాంటి చదువు, ఖర్చు లేకుండా దేశం లో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వెల్డర్లు తీరిక లేకుండా పనులు పొందుతూ రోజుకు 500నుండి వేయి రూపాయలు సంపాదిస్తున్నారు. అదే దాదాపు 18 నుండి 20 ఏళ్లు చదివి, బోలెడు డబ్బు వెచ్చించి పొందిన విద్యార్హతలు, సర్టిఫికెట్లు దినసరి పని మంతుల ముందు తలదించుకుంటున్నాయి.కళాశాల చదువుకు, వృత్తి నైపుణ్యాలకు పొంతనలేనప్పుడు ఈ చదువుల పరమార్థం ఏమిటి? నైపుణ్యం ఉండి ఆర్థిక సంక్షోభంలో ఉద్యోగం ఊడితే ఎవరు బాధ్యులు? ఏది చదివితే ఉద్యోగి, ఆయన కుటుంబం నిశ్చింతగా ఉంటుందో చెప్పేవారు కరువయ్యారు.

బి.నర్సన్
9440128169