Home నిజామాబాద్ భూపతిరెడ్డి సస్పెన్షన్ ఏమైంది?

భూపతిరెడ్డి సస్పెన్షన్ ఏమైంది?

bhupathi

= నిజామాబాద్ రూరల్ గ్రూపు తగాదాలు
= సస్పెండ్ చేయాలని ఉమ్మడి జిల్లాల నేతల సిఫార్సు
= కానిరాని చర్యలు

మనతెలంగాణ/ నిజామాబాద్‌బ్యూరో: రాష్ట్ర మంత్రి, ఇద్దరు పార్లమెంటు సభ్యులు, ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కలిసి, అధికార పార్టీకి చెందిన, శాసన మండలి సభ్యుడు భూపతిరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించి పార్టీ ఆదినాయకుడి కేసిఆర్‌కు విజ్ఞప్తి చేసినప్పటికి, ఆయనపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడడం లేదు. నిజామాబాద్ రూలర్ నియోజక వర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఇదే నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డిల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరుకున్న తరుణంలో టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి, భూపతిరెడ్డిపై వేటు వేయాలని కేసిఆర్‌ను కోరారు. మొత్తం జిల్లా నాయకత్వమంతా కలిసి, సిఫారసు చేస్తే వెంటనే భూపతిరెడ్డిపై చర్య తప్పకుండా ఉండి తీరుతుందని ఆశించారు. కానీ నెలలు గడుస్తున్న అటువంటి చర్యలు ఏమి కనబడడం లేదు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ స్థానాన్ని ఆశించిన భూపతిరెడ్డిని సామాజిక వర్గ కూర్పులో భాగంగా టిక్కెట్టు ఇవ్వకుండా ఆ ఎన్నికల్లో బలమైన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ఢీకొట్టడానికి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌కు పార్టీ తీర్థం ఇచ్చి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో గోవర్ధన్ గెలవడంతో, తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాటి నుండి తనవెంట పార్టీలో ఉన్న భూపతిరెడ్డిని స్థానిక సంస్థల ప్రతినిధిగా శాసనమండలికి పంపారు.

తన నియోజక వర్గంపై ఉన్న మక్కువ, అప్పటి వరకు తన వెంట ఉన్న కేడర్‌ను కాపాడుకోవడానికి ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నియోజక వర్గంలో పర్యటించడం గిట్టని బాజిరెడ్డి వ్యతిరేకించడం నియోజక వర్గంలోని ఓ గ్రామంలో జరిగిన సభలో బహిరంగగానే బాహబాహికి దిగడం నాటి నుండి ఇద్దరి మధ్య అగాదాన్ని పెంచింది. కాగా భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోని గ్రామాలాభివృద్దికి నిధులు ఇవ్వడం, తనకు వ్యతిరేకులైన వారిని పెంచిపోషిస్తున్నారని బాజిరెడ్డి వర్గం పార్టీ హైకమాండ్‌కు పదేపదే ఫిర్యాదు చేయడంతో పార్టీ లేజిస్లేచర్ల సమావేశంలో భూపతిరెడ్డిని, కెసిఆర్ మందలించడంతో రెచ్చిపోయిన గోవర్ధన్ వర్గం తాము పై చేయి సాధించినట్టు భావించి అడుగడుగున ఎమ్మెల్సీ వర్గాన్ని దెబ్బతీయడానికి పావులు కదిపారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి మారిన రేవత్‌రెడ్డి వెంట భూపతిరెడ్డి కూడా పార్టీ మారుతున్నారని ప్రచారం ప్రారంభించడం, రూరల్ నియోజక వర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ సర్పంచులను కాదని, కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల గ్రామాలకు తన నిధులను కేటాయిస్తున్నట్లు ఆరోపించారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ ఎంపీ కవితతో సహా నేతలంతా ఏకమై ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తీర్మానిస్తూ, జిల్లా ఇన్‌చార్జ్ తుల ఉమ ద్వారా కెసిఆర్‌కు విన్నవించారు. కానీ భూపతిరెడ్డిపై చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందా లేక లాభం జరుగుతందా అనే మీ మాంసంలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్బావం నుండి ఉన్న భూపతిరెడ్డిపై వేటు వేస్తే తెలంగాణ వాదుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం టిఆర్‌ఎస్ నాయకత్వం పట్ల పెదవి విరుస్తున్న తరుణంలో ప్రసార మాద్యమాలకు పని కల్పించినట్టవుతుందని పార్టీ హైకమాండ్ తీవ్రంగా తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బాజిరెడ్డి గోవర్ధన్ పట్ల సిఎం కెసిఆర్ పూర్తి సానుకూలత కనబర్చడంలేదని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు స్థానచలనం కలుగవచ్చని ప్రచారం జరుగుతుంది. భూపతిరెడ్డి వర్గం కూడా సిఎం కెసిఆర్‌ను కలిసి బాజిరెడ్డి కార్యకలాపాలపై ఫిర్యాదు చేస్తామని, ఆయన పక్కా తెలంగాణ వీధులను, పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న కార్యకర్తలను నాయకులను విస్మరించి తనకు అనుకూలమైన వారు పార్టీలోకి ఇటీవలే వచ్చి వివిధ పదవులు పొందిన వారే అసలైన కార్యకర్తలను నమ్మించడానికి చూస్తున్నాడని, పదేపదే పార్టీలు మారిన వారు, మళ్లీ పార్టీ మారరని నమ్మకమెంటని, భూపతిరెడ్డి వర్గీయులు నిలదీస్తున్నారు. పార్టీ ఆవిర్బావం నుండి ఉన్న తమను కాదని ఇష్టం వచ్చిన తీరుగా వ్యవహరిస్తున్న బాజిరెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్టీ నుండి భూపతిరెడ్డి సస్పెండ్ చేస్తే భారీ నష్టం వాటిల్లితుందని, తద్వారా వచ్చే ఎన్నికల్లో రూరల్ స్థానంలో ఆశించిన ఫలితం ఉండకపోవచ్చని పరిశీలకుల అభిప్రాయం.