Home ఆఫ్ బీట్ ‘యాక్సెస్’(access) అనే మాటకి తెలుగులో అర్ధమేమిటి?

‘యాక్సెస్’(access) అనే మాటకి తెలుగులో అర్ధమేమిటి?

Class

హిందీ లో ‘పహుచ్’ అంటారు. తెలుగులో..? ‘అనుమతి’ లేక ‘ప్రవేశము’ అని గూగుల్ చెప్పింది. ‘నీ మెయిల్ ను చూడడానికి నాకు యాక్సెస్ లేదు’, ‘నాకు నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లేదు…’ అంటే అనుమతి లేదా ప్రవేశము లేదన్నమాటేనా…అంత మాత్రమే కాదనుకుంటా…యాక్సెస్స్ అంటే ఇక్కడ ఉన్న సౌలభ్యాన్నో, లేక సేవనో ఉపయోగించుకోవడానికి మార్గం లేదని, లేక వాడుకునే పద్ధతీ తెలియదని లేక వివరమూ లేవని…కొన్నిసార్లు ఈ మూడూ లేవని.
మనదేశంలో ఎన్నో సమస్యలతో పాటు ఈ యాక్సెస్ సమస్య కూడా ఉంది. విద్య మొదలుకొని, మరుగుదొడ్లు, సేఫ్టీ, ప్రభుత్వ సంస్థలలో అప్లికేషన్స్ ఇవ్వడం, ఆరోగ్యం…ఇక ఈ లిస్టు సాగుతూనే ఉంటుంది. కాని కొన్ని వర్గాలున్నాయి. ఇప్పుడిప్పుడే చిన్నగా గొంతు విప్పుతున్నాయి. దళితులు, స్త్రీలు, వికలాంగులు, ఎల్.జి.బి.టి వంటి వర్గాలు- వీరంతా నెమ్మదిగా….. కానీ ఖచ్చితంగా మాటాడుతున్నారు. సానుభూతికీ సహానుభూతికీ మధ్యనున్న రేఖను గుర్తుచేస్తున్నారు.
మనదేశం లో ఆత్మ గౌరవం కన్నా, అహం సంతృప్తి పడడం ముఖ్యం. ఇవ్వాలనుకుంటే సరిపోదుగా, పుచ్చుకునే వారు కావాలి…మహాప్రసాదం అని పూర్తిగా వంగిపోయి తరతరాలు రుణపడిపోయేంత భారంతో క్రుంగిపోతే మహాబాగు. అన్నదానాలు, వస్త్రదానాలు…ఇలా ఎన్నో దానాలు చేయడం ఇష్టం మనకు. గుడ్డివాడా…రోడ్డు దాటించుదాము, కుంటివాడా ఎత్తుకుని వెళ్దాము, పేదవాడా అన్నదానం చేద్దాము..ఆడపిల్లా..పర్లేదు పెళ్లి చేసేద్దాము( ఆ తర్వాత ఆమె అగచాట్లు మనకు అనవసరము). అన్నదానాల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి. మేము మొన్న అన్నదానం చేస్తే ఇన్ని వందలమంది తిన్నారు అని గొప్పగా చెబుతారు. అన్నదానం గురించి కాదుగానీ, ఆ వెనుక ‘ఇంతమందికి పెట్టాము’ అన్న ఆభిజాత్యానికి, అంతమంది పేదవారు అన్నానికి ఎగబడడం లో ఉన్న విషాదాన్ని గమనించలేని మొద్దుబారిన మనసుల పట్ల విపరీతమైన అసహనం వస్తుంది.
మరికొన్ని సన్నివేశాలు….. ఉదాహరణకు, సఫాయి ఉద్యోగుల సంగతే తీసుకుందాం. మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా…సఫాయి కార్మికుడికి మురుగు నీటిలో దిగక తప్పడం లేదు. సాంకేతికత ఇబ్బంది కాదు, దానికి ఉండవలసిన ప్రాధాన్యత లేదు. అసలు ఆ అవసరాన్ని మన స్వచ్చభారత్ లో గుర్తించారో లేదో తెలియదు. డిస్పోసబుల్ కప్పులు, స్పూనులు, ముఖ్యంగా విస్తరాకుల ప్లేట్లు అమ్ముడు పోయినంతగా వేస్ట్ డిస్పోసబుల్ కవర్లు అమ్ముడు పోవు. మనకవి అవసరం లేదు. డిస్పోసబుల్ కవర్లు వాడము. చెత్త ఎలా పడేస్తున్నాము అనే విషయంలో ఏ విధమైన ప్రమాణాలు ఉండవు. వేస్ట్ డిస్పోసల్ మానేజ్ మెంట్ అనే కాదు. ఆయా వ్యక్తులకు ఇచ్చే విలువ గురించి కూడా అర్ధం చేసుకోము! అసలు చెప్పాలంటే వారి ఉనికికి విలువ లేదంతే. రెండవ సన్నివేశము. ప్రభుత్వ కార్యాలయల వద్ద, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో బిక్కుబిక్కు మంటూ ఒక మూల నుంచున్న పేద పల్లె మనుషులు! ఆసుపత్రి ఉందని తెలుసు, రోగికి అందించవలసిన సహాయం కొరకే వచ్చారు. ఎవరిని కలవాలో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. జబ్బు ఎంత పెద్దదో తెలియదు…ప్రాణం విలువ పరిహాసమైపోతుంది. సేవలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. సమాచారం లేదు. దానికి తగ్గ యాక్సెస్ లేదు.
నేను సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఎన్. ఐ. ఎం. ఎచ్ లో ఒక అధికారి చెప్పారు. మనిషికి ఏ విధమైన మానసిక లేక శారీరక ఇబ్బందులున్నా వారు ఉత్పత్తికి తోడ్పడగలరు. వారు వాడగలిగే పరికరాలను అందించడం ద్వారా…వీల్ చైర్, వాకింగ్ స్టిక్, కళ్ళజోడు ఇలా ఎన్నో. ఒక్కో మనిషికి ఒక్కో ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించదానికి బోల్డన్ని పద్ధతులు. మనమింకా ఇంకా అధిగమించే పద్ధతులు నేర్చుకుంటూనే ఉన్నాము. అలాగే టెక్నాలజీ వాడే సమయాల్లో కూడా ఎ టి. ఎం ల దగ్గర ఇబ్బంది పడే వారికోసం దృశ్య శ్రవణ సహాయాలందిస్తాము. వాహనాల్లో ఆడవారికనీ, పెద్దవారికనీ, కాళ్ళు సరిగ్గా పని చేయని వారికీ ఇలా అందరికి చిన్న చిన్న మార్పులతో స్వాతంత్రానికి దారులు వేయగలం. సమాజం లో వీటిని గురించి ఎంత అవగాహన పెరిగితే సామాజికులమని విర్రవీగే మనము అంత మెరుగుపడతాము.
అలాగే సదుపాయాలు….పరికరాలు! వీటి మధ్య తేడాను గమనించాలి. ఉదాహరణకు, ఒకమనిషికి వీల్ చైర్ మొబిలిటీ కోసం కావాలంటే, ఆ వీల్ చైర్ తో బాటే, తిరగడాకి అనువుగా రోడ్ లు, ఆఫీసులు ఉండగలగాలి. పల్లెటూర్లో ఉన్న వాళ్లకు మోటార్ వేయించుకోవడానికి లోన్లు ఇస్తే సరిపోతుందా..మోటార్ పనిచేయడానికి కావలసిన విద్యుత్తూ అందివ్వాలి. ఆడపిల్లకు భర్తనే కాదు, తనను నిలబెట్టే వెన్నెముకను కూడా ఇవ్వాలి.
ఇకపై ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మూఢసేవను వదులుదాం. మన అహానికి కాదు, ఇతరుల అవసరానికి స్పందించుదాం.

అపర్ణ తోట