Home అంతర్జాతీయ వార్తలు సిరియాలో ఏం జరుగుతోంది?

సిరియాలో ఏం జరుగుతోంది?

Air-Attack-Syria
ఇటీవల ఒక ఇస్రాయీల్ చానల్ లో యాంకర్ సిరియా గురించి చెప్పిన మాటలు మనస్సాక్షి బతికి ఉన్న ప్రతి మనిషి కంట నీరు పెట్టిస్తాయి. టెల్ అవీవ్ నుంచి కేవలం 8 గంటల కారు ప్రయాణంలో చేరుకునే ప్రదేశంలో ఇప్పుడు నరమేధం జరుగుతుందని ఆమె ప్రకటించింది. అక్కడ జరుగుతున్నది హోలోకాస్ట్, ఊచకోతలు, మనం దాని గురించి వినాలనుకోకపోవచ్చు, మనకు ఆ పరిస్థితి లేకపోవచ్చు అంటూ, 21వ శతాబ్ధంలో, సోషల్ మీడియా యుగంలో, సమాచారం అరచేతిలో ఇమిడిపోయిన కాలంలో, బాధితులు, వారి దయానీయమైన గాధలను మనందరం చూడగలిగే, వినగలిగే ప్రపంచంలో, ప్రతిగంట కొనసాగుతున్న పసిపిల్లల అమానుష హత్యలను, మనం ఇవన్నీ చూస్తూ ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని చూస్తున్నామని ఆమె చెప్పిన మాటల్లో అక్షరమక్షరం సత్యమే. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పని నన్నడక్కండి. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని కూడా అడక్కండి. ఎందుకంటే ఎవరికీ తెలియదు. ఎవరు మంచివాళ్ళయినా, ఎవరు చెడ్డవాళ్ళయినా ఇప్పుడు అది అంత ముఖ్యం కాదు. జరుగుతున్న దారుణాలే ముఖ్యం. మన కళ్ళ ముందే ఇదంతా జరుగుతోంది.
94 People Were Killed in Syrian Airstrikes
ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ, అమెరికాల్లో ఎవ్వరూ ఏమీ చేయడం లేదు. సిరియాలో అమాయక ప్రజలు, మహిళలు, పసిపిల్లల కోసం వీధుల్లో ప్రదర్శనలు, నిరసనలు నిర్వహిస్తున్నవారెవరైనా ఉన్నారా అని ఆమె అడిగిన ప్రశ్నకు జవాబు లేదు. సిరియాలో పసిపిల్లల కోసం గొంతెత్తి నినదిస్తున్నవారెవరూ అంటూ ఆమె నిలదీసింది. ఐక్యరాజ్యసమితి సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రాణాలొదిలిన పసిపిల్లను ఎత్తుకున్న అభాగ్య తండ్రి ఫోటో చూసి ఒక్క కన్నీటి బొట్టును మాత్రం తుడిచేస్తోంది. ఇది హిపోక్రసీ తప్ప మరేమీ కాదంటూ ఆమె గట్టిగా ప్రకటించడమే కాదు, తాను అరబ్బుననీ, ముస్లిమునని, తాను ఇస్రాయీల్ పౌరురాలినని, కాని తాను ప్రపంచ పౌరురాలిని కూడా నంటూ తాను సిగ్గుపడుతున్నానని, చేతకాని నాయకులను ఎన్నుకున్నందుకు మనిషిగా సిగ్గుపడుతున్నానని, ఈ దారుణాలను ఖండించడం కాని, ఎదిరించడం కాని చేతకాని నాయకులను ఎన్నుకున్నామని చెప్పింది. టెర్రరిస్టులు, హంతకులు ప్రపంచంలో ఇష్టారాజ్యం చెలాయిస్తున్నా మనమేమీ చేయలేని పరిస్థితికి సిగ్గుపడుతున్నామని చెప్పింది.
శాంతిని ఆకాంక్షించే చాలా మెజారిటీ ప్రజలకు ప్రాముఖ్యం లేనే లేదని మరోసారి రుజువయ్యిందంటూ ఆమె చెప్పిన ప్రతి మాట సత్యమే. ఒక్క సిరియా విషయంలోనే కాదు పలస్తీనా విషయంలోను ఇది నిజమే. ఇస్రాయీల్ టెలివిజన్ లో ఆమె పలస్తీనాలో పసిపిల్లల ఆర్తనాదాల గురించి చెప్పలేకపోవచ్చు, సిరియాలో ఇస్రాయీల్, అమెరికాల దారుణాలను గురించి చెప్పలేకపోవచ్చు, కాని ఆమె చెప్పినట్లు తప్పెవరిదన్నది ముఖ్యం కాదు. అత్యంత అమానుషమైన క్రూరమైన మానవత్వం సిగ్గుపడే పరిస్థితికి సిగ్గుపడాలి. దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. కాని ప్రపంచదేశాలు ఎన్నడూ అలాంటి ప్రయత్నం చేసిన దాఖలా లేదు. అఫ్గనిస్తాన్ను అమెరికా సర్వనాశనం చేసినప్పుడు కాని, ఇరాక్ ను సర్వనాశనం చేసినప్పుడు కాని, లిబియా, పనామా ఒకటేమిటి ఎన్నో అమానుషాలుర, ఎన్నడూ ప్రపంచదేశాలు చేసింది ఏదీ లేదు. కన్నీళ్ళు తుడుచుకోవడం తప్ప. పలస్తీనాలో జరుగుతున్న అఘాయిత్యాలు, అమానుషాల విషయంలోను ప్రపంచం చేసింది ఏదీ లేదు. నిజం చెప్పాలంటే ఎవరైనా ఏమీ చేయలేరనే స్థితికి చేరుకున్నాం.
Aleppo-in-Syria
హృదయవిదారకమైన వార్తలు సిరియా నుంచి వస్తున్నాయి. పసిపిల్లల ఆర్తనాదాల వీడియోలు వస్తున్నాయి. ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాం. నిజానికి ఏమీ చేయలేని దుస్థితి ఐక్యరాజ్యసమితి ఏర్పాటులోనే ఉంది. ఎన్ని తీర్మానాలు ఐక్యరాజ్యసమితిలో వీటో అయ్యాయి. అగ్రరాజ్యాలకు వీటో హక్కు ఎందుకు లభిస్తోంది. భారతదేశం హాఫిజ్ సయీద్ గురించి మాట్లాడితే చైనా వీటో ఎందుకు చేస్తుంది. ఇస్రాయీల్ కోసం అమెరికా వీటో అధికారం ఎందుకు ఉపయోగిస్తుంది. అగ్రరాజ్యాల అడుగులకు మడుగులొత్తే బానిస సంస్థగా ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేశారన్నది కాదనలేని యదార్థం. బడుగు బలహీనదేశాల్లో ప్రజల ఆర్తనాదాలను వినడమే కాని ఏమీ చేయలేని సంస్థగానే ఐక్యరాజ్యసమితి నేటి వరకు నిరూపించుకుంది.
సిరియాలో ఈ ఘోరకలి నేటిది కాదు. 2011 నుంచి కొనసాగుతోంది. నిజం చెప్పాలంటే ఇరాక్ లో మాదిరిగా ప్రపంచదేశాలు అమెరికా ఒంటెద్దు పోకడను ఈ సారి ఒప్పుకోలేదు కాని, లేకపోతే ఇరాక్ మాదిరిగా, అఫ్గనిస్తాన్ మాదిరిగా, లిబియా మాదిరిగా ఎప్పుడో నేలమట్టమైపోయి, ఆ శిధిలాల్లో ఎంతమంది పసిపిల్లలు సమాధయ్యారన్న వార్తలు కూడా బయటకు పొక్కేవి కావు. ఇరాక్ లో దాదాపు 5 లక్షల మంది పసిపిల్లల మరణాలకు కారణమైనప్పటికీ సగర్వంగా మానవహక్కుల గురించి అమెరికా చెప్పుకోగలుగుతుంది.
Syria
ఇప్పుడు జరుగుతున్న మారణహోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తూర్పు ఘౌటా పట్టణంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా, సిరియా దేశాలు ఉల్లంఘించాయని ఆరోపించింది. సాధారణ పౌరులు ఆ ప్రాంతం వదిలి వెళ్లడానికి వీలుగా 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సిరియా నియంత బషారుల్ అసద్ ఈ పట్టణంపై సైన్యాలను నడిపించాడు. రష్యా యుద్ధవిమానాలు ఈ సైన్యానికి అండగా బాంబులు కురిపించాయి. దాదాపు 550 మంది సాధారణ పౌరులు మరణించారని వార్త. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగల్లో తొక్కుతూ సిరియా, రష్యా దేశాలు దాడులను కొనసాగిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. కాని రష్యా వాదన మరోలా ఉంది. కాల్పుల విరమణ సందర్భంగా మానవీయ సహాయానికి ఉద్దేశించిన మార్గాలపై తిరుగుబాటు దళాలు దాడులు చేశాయని, ప్రతిచర్య తప్పదని స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో అల్ ఖాయిదాకు సంబంధించిన టెర్రరిస్టు సంస్థలు జబత్ ఫతే అల్ షామ్ వంటి వాటిపై దాడులు కొనసాగిస్తామని ప్రకటించింది. మరోవైపు టర్కీ కూడా అమెరికా ద్వంద్వప్రమాణాలు పాటిస్తుందని ఆరోపించింది. టర్కీ కూడా సిరియా పట్టణం ఆఫ్రీన్ పై దాడులు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇది విరుద్దమంటూ అమెరికా చేసిన ఆరోపణను టర్కీ తిప్పి కొట్టింది. ఈ తీర్మానంలో ఆఫ్రీన్ ప్రస్తావనే లేనప్పుడు టర్కీ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని నిలదీసింది. ఇటీవల టర్కీ చాలా తీవ్రమైన హెచ్చరికలు అమెరికాకు చేసిందన్నది కూడా గుర్తుంచుకోవాలి. టెర్రరిస్టులు ఎవరైనా ఒక్కటే. మంచి టెర్రరిస్టులు, చెడ్డ టెర్రరిస్టులు లేరు. అమెరికా మతి లేకుండా మాట్లాడుతోంది. ఈ ద్వంద్వ ప్రమాణాలకు మేం ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. అమెరికా కూడా కాల్పుల విరమణ అనేది ఐ.యస్.ఐ.యస్, అల్ ఖాయిదా, అల్ నుస్రా ఫ్రంట్ లకు వర్తించదని, వారిపై దాడులు జరుగుతూనే ఉంటాయని చెబుతోంది. ఈ ప్రాంతంలో సాధారణ పౌరులు సురక్షిత స్థానాలకు వెళ్ళడానికి ఉద్దేశించిన కాల్పుల విరమణలో టర్కీ ప్రస్తావన దేనికి, టర్కీ సైనిక చర్యలు ఈ ప్రాంతానికి సంబంధించినవి కావు, ఆఫ్రీన్ లో టర్కీ సైనికచర్యలు టర్కీ రక్షణకు ఉద్దేశించినవి, ఐక్యరాజ్యసమితి చార్టర్ 51 ప్రకారం మాకు ఈ హక్కు ఉందని టర్కీ వాదిస్తోంది. ఇలాంటి వాదనలే గతంలో అమెరికా తన దాడుల కోసం చేసిందన్నది గుర్తించాలి.
syria-air-bane.jpg-1
అసలు సిరియాలో ఏం జరుగుతోందన్నది మాట్లాడే ముందు సిరియాలో ఎవరి అధికారం ఉంది, ఎవరి నియంత్రణలో ఉందన్నది ముందు మాట్లాడుకోవాలి. మార్చి 2011 నుంచి సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు నాలుగున్నర లక్షల మంది మరణించారు. పదిలక్షల మంది గాయపడి ఉంటారు. దాదాపు కోటి ఇరవై లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అంటే దేశజనాభాలో సగం మంది ఇల్లూ వాకిలి వదిలి శరణార్ధులయ్యారు. ఇప్పుడు దారుణమైన దాడులకు సంబంధించి వార్తలు వస్తున్నది తూర్పు ఘౌటా పట్టణం నుంచి. ఈ పట్టణం తిరుగుబాటు దారుల నియంత్రణలో ఉంది. రాజధాని డమస్కస్ కు దగ్గరగా ఉన్న పట్టణం కాబట్టి దీన్ని తిరిగి హస్తగతం చేసుకోవాలని సిరియా ప్రభుత్వం దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలున్నారు. ఇప్పటికీ దాదాపు నాలుగు సంవత్సరాలుగా సిరియా ప్రభుత్వం ఈ పట్టణాన్ని దిగ్బంధం చేసి ఉంచింది. ఉత్తర సిరియాలో ఆఫ్రీన్ పట్టణంపై సిరియా నియంత బషారుల్ అసద్ సైన్యాలు కూడా టర్కీ దాడులను ఎదిరిస్తున్నాయి. అక్కడ కుర్దు వైపిజి మిలిషియాను అంతం చేయాలని టర్కీ ప్రయత్నిస్తోంది. ఈ పట్టణం కుర్దు మిలిషియా నియంత్రణలో ఉంది. కుర్దు మిలిషియా అసద్ సైన్యాల సహాయం కోరింది. అక్కడ వారికి అసద్ సైన్యం సహాయం చేస్తోంది. అంతేకాదు, అమెరికా ప్రత్యేకదళాలు కూడా సహాయం చేస్తున్నాయని వార్తలు. అమెరికా ప్రత్యేక దళాలంటే అమెరికన్ సైనికులు కాదు, కుర్దు మిలిషియాకు అమెరికా శిక్షణ, ఆయుధాలు ఇచ్చి నియమించిన దళాలు. మరి అసద్ ను గద్దె దించాలని అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు అసద్ సైన్యం కుర్దు వైపిజికి రక్షణ కోసం కూడా పోరాడుతోంది. ఇది ఒక అయోమయ పరిస్థితి. అందుకే ఇక్కడ తప్పెవరిదన్న ప్రశ్నకు సమాధానమే లేదు.
Chemical bomb Attack in-Syria
అసలు సిరియా ప్రభుత్వం, అంటే బషారుల్ అసద్ నియంత్రణలో ఉన్న భూభాగం అలెప్పో, లటాకియా, టార్టస్, హమా, హమ్స్, డమస్కస్, పాల్మిరా, అబూ కమాల్ పట్టణాలు మాత్రమే. సిరియాలో ఐయస్ఐయస్ అదుపులో కూడా కొంత భూభాగముంది. రఖ్ఖా పోరాటం తర్వాత ఐయస్ఐయస్ చాలా భూభాగం కోల్పోయింది. అబూకమాల్ లో కొంత భూభాగం ఇప్పటికీ ఈ ఉగ్రవాద సంస్థ అదుపులోనే ఉంది. దీనికి పశ్చిమాన సిరియా ప్రభుత్వ దళాలు చుట్టుముట్టి ఉంటే తూర్పున కుర్దు దళాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఈ దిగ్బంధం కొనసాగుతోంది.
ఐయస్ఐయస్ వంటి ఉగ్రవాద సంస్థపై ప్రపంచంలో ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన అమెరికా, నాటో దళాలు ఎందుకు విజయం సాధించలేకపోతున్నాయన్నది ఆలోచించవలసిన ప్రశ్న. ఇటీవల ఇస్రాయీల్ పార్లమెంటులో అక్కడి పార్లమెంటు సభ్యురాలే ఇస్రాయీల్ చవగ్గా చమురు ఐయస్ఐయస్ నుంచి కొంటుందని ఆరోపించింది. ఐయస్ఐయస్ లో ఇస్రాయీల్ గూఢచార సంస్థ మొస్సాద్ ఏజంట్లే ఉన్నారన్న వార్తలు బలంగా వస్తున్నాయి. లిబియాలో పట్టుబడిన ఐయస్ఐయస్ ఉగ్రవాది మొస్సాద్ ఏజంటని తేలింది. అసలు ఐయస్ఐయస్ అంటేనే ఇస్రాయీల్ సీక్రెట్ ఇంటిలిజెన్స్ సర్వీస్ అన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఐయస్ఐయస్ అధినేత బగ్దాదీకి శిక్షణ ఇచ్చింది మొస్సాద్ అనీ, ఆయన యూదుడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇస్రాయీల్ తన ప్రయోజనాల కోసం లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగించడానికి ఐయస్ఐయస్ ను వాడుకుంటుందన్న వాదనలు కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి సిరియాలో ఐయస్ఐయస్ ను పూర్తిగా తుడిచేయడానికి అమెరికా నిజంగా ప్రయత్నిస్తుందా అన్నది అనుమానాస్పదం.
SYRIA-ATTACKS
సిరియాలో కొన్ని ప్రాంతాలు కుర్దు మిలిషియా అధీనంలో ఉన్నాయి. ఇవి కూడా సిరియా దళాలతో పోరాడుతున్నాయి. ఇందులో జబత్ ఫతే అల్ షామ్, ఈరాన్ మద్దతున్న హిజ్బుల్లా, అలాగే సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (వైపిజి మిలిషియా ఇందులో ఎక్కువ) వంటి సంస్థలు కొన్ని ప్రాంతాలపై పట్టు కలిగి ఉన్నాయి. ఆఫ్రీన్, రఖ్ఖా, కామిష్లీ, హసాకా ప్రాంతాలు వీటి అదుపులో ఉన్నాయి. ఇతర గ్రూపుల్లో బషారుల్ అసద్ ను గద్దె దించడానికి మాజీ సైనికులు, తిరుగుబాటుదారులతో ఏర్పడిన ఫ్రీ సిరియన్ ఆర్మీ అధీనంలో ఇద్లిబ్, తూర్పు ఘౌటా, డెమస్కస్ శివారు ప్రాంతాలు ఫ్రీ సిరియన్ ఆర్మీ అదుపులో ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం కొనసాగుతున్నది తూర్పు ఘౌటాలోనే. ఈ ప్రాంతం 2013 నుంచి దిగ్బంధంలో ఉంది. సిరియా రాజధాని నగరం డెమస్కస్ కు దగ్గరగా ఉన్న చిట్టచివరి తిరుగుబాటు దారుల స్థావరమిది. ఇప్పుడు సిరియా ప్రభుత్వం పూర్తి స్థాయి యుద్ధానికి దిగింది. ఇక్కడ జైష్ అల్ ఇస్లామ్, ఫైలాఖుల్ రహ్మాన్, అహ్రారుల్ షామ్ వంటి సాయుధ తిరుగుబాటు సంస్థలు అనేకం ఉన్నాయి. అల్ ఖాయిదాకు సంబంధించిన జబత్ అల్ ఫతావుల్ షామ్ కూడా ఉంది. నాలుగు సంవత్సరాలకు పైబడి దిగ్బంధంలో ఈ ప్రాంతం ప్రజలు అలమటిస్తున్నారు. టర్కీ, రష్యా, ఈరాన్ దేశాలు తూర్పు ఘౌటాను డీ ఎస్కలేషన్ జోన్ గా ప్రకటించడానికి 2017లో ఒప్పుకున్నాయి. అంటే ఆ ప్రాంతంపై సిరియా, రష్యా యుద్ధవిమానాలు ఎగరకూడదు. కాని సిరియా దళాలు, రష్యా యుద్ధవిమానాలు ఈ ప్రాంతంపై తీవ్రమైన సైనికచర్య ప్రారంభించాయి. హృదయవిదారకమైన వార్తలు వచ్చాయి. చివరకు ఐక్యరాజ్యసమితి కాల్పులు విరమణ ఒప్పందం చేయించింది. కొన్ని టెర్రరిస్టు సంస్థలపై దాడుల విషయంలో ఈ కాల్పుల విరమణ వర్తించదు. అలాంటి సంస్థల్లో జబత్ ఫతే అల్ షామ్ కూడా ఒకటి. ఈ ప్రాంతంలోని ఇతర గ్రూపులు జైషల్ ఇస్లామ్, ఫైలాకుర్రహ్మాన్, అహ్రారల్ షామ్ ఐక్యరాజ్యసమితికి ఒక లేఖ రాసి, జబత్ ఫతే అల్ షామ్ సంస్థను బహిష్కరించడం పట్ల అభ్యంతరం లేదని చెప్పాయి.
Turkey-Devastation-in-Syria
సిరియాలో ప్రతి దేశానికి స్వంత ప్రణాళికలున్నాయి. అమెరికా ఎత్తుగడలు అమెరికావి, రష్యా ప్రయత్నాలు రష్యావి. ఈరాన్ తన స్వంత ప్రయోజనాలు చూసుకుంటుంది. టర్కీ తన ప్రయోజనాలు చూసుకుంటుంది. ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలుగా సిరియా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇదంతా ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు ప్రారంభమైంది? అనే ప్రశ్నలకు కూడా జవాబులు వెదుక్కోవాలి. సిరియా 2011కు ముందు పేదదేశమేమీ కాదు. ఇల్లు లేక ప్లాట్ ఫాంపై గడిపేవాళ్ళెవరు అక్కడ కనబడేవారు కాదు. ధరలు కూడా పొరుగు దేశాలతో పోల్చితే చాలా చవగ్గా ఉండేవి. విద్యవైద్య సదుపాయాలు ఉచితంగా లభించేవి. కాని సంపన్నుల అవినీతికి అంతులేదు. రాజ్యం కఠినమైన అణిచివేత అవలంబించేది. పౌరస్వేచ్ఛలు లేవు. అవినీతి, ఉపాధి దెబ్బతినడం వంటి కారణాలతో పాటు పౌరస్వేచ్ఛలు లేకపోవడం తిరుగుబాటుకు దారితీసింది. సిరియా ప్రభుత్వం అమానుషమైన బలప్రయోగంతో తిరుగుబాటును అణిచివేసే ప్రయత్నం చేసింది. 2011 సంవత్సరం అరబ్ స్ర్పింగ్ సంవత్సరంగా పేరుపడింది. టునిషియాలో తిరుగుబాటు అక్కడి వ్యవస్థను మార్చేసింది. ఈజిప్టులో తిరుగుబాటు హోస్ని ముబారక్ ను గద్దె దించింది. తర్వాత అమెరికా కుట్రలతో ఈజిప్టు సైన్యం తిరుగుబాటు చేసి ప్రజాస్వామికంగా ఎన్నికైన మోసీని గద్దెదించిందన్నది వేరే విషయం. కాని 2011లో వివిధ దేశాల్లో తిరుగుబాటులు విజయవంతం కావడంతో సిరియా ప్రజల్లోను ఆశలు చిగురించాయి. నిరంకుశంగా పాలిస్తున్న బషారుల్ అసద్ ను గద్దెదించాలని తిరగబడ్డారు. ఈ తిరుగుబాటను క్రూరంగా అణిచేయాలని బషారుల్ అసద్ ప్రయత్నించాడు. ఆయన సైన్యం నుంచే కొందరు బయటకు వచ్చి ఫ్రీ సిరియన్ ఆర్మీ ఏర్పాటు చేశారు. ఇది కూడా 2011లోనే జరిగింది. అప్పటి నుంచి అంతర్యుద్ధం రగులుకుంది. 2011 వరకు సిరియా తిరుగుబాటుదారుల్లో వర్గపరమైన భేదాలు లేవు. సిరియా ప్రజలు దాదాపు అందరూ సున్నీ ముస్లిములు. కాని సిరియా భద్రతా దళాల్లో అలావీ తెగ వారే ఎక్కువ. ఈ తెగ షియా వర్గానికి చెందింది. సిరియా నియంత బషారుల్ అసద్ ఈ తెగకు చెందినవాడే. బషారుల్ అసద్ తండ్రి కూడా సిరియాను నిరంకుశంగా పాలించాడు. 1982లో బషారుల్ అసద్ తండ్రి నియంతగా హమా పట్టణంలో ఇఖ్వానుల్ ముస్లిమీన్ సంస్థపై అమానుష దాడులకు తెగబడడమే కాదు, పట్టణాన్ని పూర్తిగా నేలమట్టం చేశాడు. వేలాది మంది ఈ దాడుల్లో మరణించారు. 2011లో తిరుగుబాటుకు మరో కారణం గ్లోబల్ వార్మింగ్ కూడా. తీవ్రమైన కరువు పరిస్థితి అప్పట్లో సిరియాలో ఏర్పడింది. 2007 నుంచి 2010 వరకు సిరియా కరువుతో విలవిలలాడింది. కరువు కారణంగా గ్రామాల నుంచి జనం పనులు వెదుక్కుంటూ పట్టణాలకు వచ్చారు. ఫలితంగా ఉపాధి కోసం పెనుగులాటలు, పేదరికం, సామాజిక కల్లోలం పెరిగాయి. ఇవి కూడా తిరుగుబాటుకు కారణాలే. అప్పటి వరకు ఇదంతా సిరియా అంతర్గత వ్యవహారం.
Russian-soldiers-in-Syria-4
బషారుల్ అసద్ లాంటి నిరంకుశ పాలకుడిని గద్దె దించడానికి సిరియా ప్రజలు ప్రారంభించిన తిరుగుబాటు, సాయుధ తిరుగుబాటుగా మారి అనేక ఉగ్రవాద సంస్థలు ఇందులో అడుగుపెట్టడంతో ఈ సంస్థల మధ్య కూడా పోరాటాలు మామూలయ్యాయి. ఇది సిరియా పరిస్థితి. రెండవ ప్రపంచయుద్ధం కన్నా సుదీర్ఘమైన యుద్ధం. 55 లక్షల మంది శరణార్ధులుగా ఇతరదేశాల్లో తలదాచుకోవలసి వచ్చింది. సిరియాలోనే తమ ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలిపోవలసి వచ్చిన అంతర్గత శరణార్ధుల సంఖ్య మరో 65 లక్షలు ఉంటుంది. లెబనాన్, టర్కీ, జోర్డన్ దేశాలు చాలా మంది సిరియన్లకు ఆశ్రయమిచ్చాయి. అక్కడి నుంచి కొందరు మరింత మెరుగైన బతుకు కోసం యూరప్ దేశాలవైపు కూడా వెళ్ళారు. ఈ అంతర్యుద్ధ పరిస్థితి ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేము. యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి సిరియా పునర్నిర్మాణానికి ఎన్ని యుగాలు పడుతుందో చెప్పలేము.
Sucide-Attack-Syria
ఐక్యరాజ్యసమితి సిరియా విషయంలో ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉన్నానంది. అందరి కళ్ళ ముందే అమానుషాలు జరుగుతున్నాయి. రక్తంతో తడిసిముద్దయిన కొడుకును శిధిలాల నుంచి మోసుకువస్తున్న తండ్రిని చూసి కూడా చలించని స్థితికి చేరుకున్నాం. అమెరికా తన ప్రయోజనాల కోసం ఐయస్ఐయస్ పై దాడులంటూ మరోవైపు కొన్ని సాయుధ ఉగ్రవాద దళాలకు ఆయుధాలిస్తుంటే, రష్యా బషారుల్ అసద్ ని దించడానికి వీల్లేదంటూ మొండికేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఐక్యరాజ్యసమితి చేతులు ముడుచుకుని కూర్చుంది. ఇంత నిస్సహాయమైన ప్రపంచంలో బతుకుతున్నందుకు సిగ్గుపడాలి.
తప్పెవరిదని తప్పులు వెదకడం కన్నా మనుషులను కాపాడుకోడానికి ప్రయత్నించడం ముఖ్యం.
– వాహెద్
 What’s happening in Syria?