Search
Sunday 23 September 2018
  • :
  • :

లాల్ జీ ఏం జరుగుతుంది?

What's happening with Lal Ji?

పట్టు తప్పుతున్న పాలన
ఫిర్యాదుల పరంపర
మండిపడుతున్న కార్పొరేటర్లు
కమీషన్ల లొల్లి
కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించని వైనం
కార్పొరేటర్లంతా మేయర్‌ను మార్చాలనే డిమాండ్
కమిషనర్ వ్యవహార తీరు చర్చనీయాంశం

మున్సిపాల్టీ నుంచి కార్పొరేషన్‌గా రూపొందడం తొలి పాలక వర్గం ఎన్నిక కావడంతో అభివృద్ది పైనే దృష్టి సారిస్తారని నగర ప్రజలు ఆశించారు. నగర సమీపంలోని గ్రామ పంచాయతీలు విలీనం కావడంతో ఆ పంచాయతీల ప్రజలు నగరంతో సమానంగా అభివృద్ధి జరుగుతుందని ఆశపడ్డారు. అందునా ఏకపక్షంగా ఒకే పార్టీకి మెజార్టీ ఇవ్వడంతో ఇంకా అభివృద్దికి ఎదురే లేదని భావించారు. అభివృద్ధి సంగతి పక్కనపెడితే కార్పొరేషన్లో అధికార పక్షం మధ్యనే లొల్లి మొదలైంది. ఆ లొల్లి రోజు రోజుకు పెరిగి చివరకు కార్పొరేటర్ల రాజీనామా వరకు వచ్చింది. అభివృద్ది నిలిచిపోయిందని కమిషన్లు పెరిగిపోయాయని అధికార పార్టీ కార్పొరేటర్లే ఆరోపణలు చేసే పరిస్థితి ఏర్పడింది. కార్పొరేషన్ పాలన క్రమేపి పట్టు తప్పింది. కమిషనర్ వ్యవహార తీరు చర్చనీయాంశమైంది. చివరకు కార్పొరేటర్లంతా మేయర్‌ను మార్చాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. మేయర్ పాపాలాల్ ఇప్పుడు ఏం చేస్తారన్నది ప్రధాన ప్రశ్న. కార్పొరేటర్ల ఆరోపణలు మొత్తం మేయర్ మీదే కావడం గమనార్హం.                                                     –

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం నగర పాలక వర్గంలో ముసలం పుట్టింది. కార్పొరేటర్లు, మేయర్, కమిషనర్ మధ్య ఎడ తేగని పంచాయతీ కొన్ని నెలలుగా సాగుతుంది. మేయర్ వైఖరి పైన కార్పొరేటర్లు మండిపడుతున్నారు. పాలన పరమైన వ్యవహారాల్లో కనీసం తమను సంప్రదించడం లేదని అభివృద్ది పనుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల నుండి మేయర్ నేరుగా కమిషన్ పుచ్చుకుంటున్నారనే ఆరోపణతో మొదలై వ్యక్తిగత ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఇటీవల మున్సిపల్ కార్మికులకు వేతనాల పెంపుదల జరిగినప్పుడు కృతజ్ఞత పూర్వక సమావేశంలో ప్రతిపక్షాలకు చెందిన యూనియన్లతో మేయర్ పాల్గొన్నారని అధికార పార్టీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అభివృద్ది పనుల విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతుందని కార్పొరేటర్లు అంటున్నారు. కార్పొరేషన్‌లో పనిచేసే కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో నూతనంగా రోడ్ల నిర్మాణానికి టెండర్లు వేసేందుకు ముందుకు రావడం లేదని ఈ విషయమై పలుమార్లు మేయర్ దృష్టికి తీసుకు వచ్చిన ఫలితం లేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ల ఒత్తిడితో ఆర్‌అండ్‌బి కాంట్రాక్టర్లను పిలిచి టెండర్లు వేయాలని కొరనున్నట్లు చెప్పడం మరింత వివాదానికి దారి తీసింది. దీనికి తోడు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లకు కనీస గౌరవం లేదని వారు వాపోతున్నారు. ఇక కమిషనర్ వైఖరిని వారు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులను కలిసి పరిస్థితిని వివరించి చివరకు రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చారు. నగర తొలి మేయర్‌గా పాలనపై పట్టుసాధించాల్సిన మేయర్ విఫలమయ్యారని ఆరోపణలు వినవస్తున్నాయి. పాలక వర్గంలో తిరుగులేని మెజార్టీ ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోవడంలో మేయర్ వైఖరి సరిగ్గా లేదనేది ప్రధాన ఆరోపణగా ఉంది. మొత్తంగా నగర మేయర్‌గా పాపాలాల్ వైఫల్యంతోనే ఇదంతా జరుగుతుందని కొందరు ఆరోపిస్తుండగా, కొందరు కార్పొరేటర్ల వైఖరే పాలనలో ప్రతిస్తాంభన ఏర్పడడానికి కారణమవుతుందని మరి కొందరు ప్రతివిమర్శ చేస్తున్నారు. మరి కొందరు కార్పొరేటర్లు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని అందుకే ఈ పరిస్థితి ఎదురవుతుందని ఆరోపణ కూడా వినపడుతుంది. మొత్తంగా ఖమ్మం నగర కార్పొరేషన్ తొలి పాలక వర్గం తరచూ వివాదాలకు కారణమవుతుంది. దీనికి తోడు కార్పొరేటర్లపై వ్యక్తిగత ఆరోపణలు, మేయర్ కమిషన్ల వ్యవహారం, కమిషనర్ ధృవీకరణ విషయంలో చేస్తున్న జాప్యం అన్ని కలగలిసి కార్పొరేషన్ పాలక వర్గాన్ని నిత్యం చర్చనీయాంశం చేస్తున్నాయి. మేయర్ పాపాలాల్ ఏం జరుగుతుందో తెలుసుకుని ఇప్పటికైనా సరిచేసే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో మరింత అబాసు పాలయ్యే అవకాశం ఉంది.

Comments

comments