న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా వాట్సప్ సంస్థ చెల్లింపు సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోరావడానికి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది సాధ్యమైతే ఇక దేశంలో డిజిటల్ చెల్లింపులు ఊపందుకోనున్నాయి. ఇదివరకే మెసేజింగ్, వీడియో కాలింగ్, ఫోటో షేరింగ్, ఫోన్ మాట్లాడడానికే పరిమితమైంది. స్మార్ట్ఫోన్ల వినియోగం దినదినం పెరిగిపోవడంతో వాట్సప్ యూజర్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌కు 1.5 బిలియన్ యూజర్ల వినియోగిస్తుండగా, ఇండియాలో దాదాపు 200 మిలియన్ల మంది వాట్సప్ ను వాడుతున్నారు.
ఈ క్రమంలో యాప్ తరుపు నుంచి చెల్లింపుల రంగంలోకి అడుగు మోపాలని యాజమాన్యం భావిస్తోంది. వాట్సప్ పేమెంట్స్ టెస్టింగ్ సర్వీస్ ను భారత్ లో ప్రవేశపెట్టగా, సూమారు 10 లక్షల మందికిపైగా ఈ ఫీచర్ ను వినియోగించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్లో వచ్చిన సమస్యలను పరిష్కరించి యాప్‌లో ఇంకోన్ని ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకోరావడానికి ప్రయత్నాలను సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ “యుపిఐ” ద్వారా ఆర్థిక లావాదేవీలను కొనసాగించడానికి అనుకులంగా బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వాట్సాప్ సంస్థకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా అనుమతులను జారీ చేసింది. ఈ నయా ఫీచర్ ను లాంచ్ చేసేముందు యూజర్లకు చెందిన ప్రైవసీ, పాలసీని అప్డేట్ చేసే పనిలో వాట్సప్ యాజమాన్యం నిమగ్నమైంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవాళ్లలో 90శాతం పైగా యూజర్లు వాట్సప్‌ను వాడుతున్నారు. ఈ వాట్సప్ పేమెంట్స్ చెల్లింపు సదుపాయం సక్సెస్ అయితే పెటిఎం, తెజ్, ఫోన్‌పే ఇతర పేమెంట్స్ యాప్‌లకు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని, బిజినెస్ విశ్లేషకులు భావిస్తున్నారు