Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సంపత్‌కుమార్ సాహిత్య అరంగేట్రం

Sampath-Kumar-Writer

మనుషులందరికీ ఉండేవి రెండు కాళ్లే. నడవడ మంటే అడుగేసి అడుగు తీయడమే. అయితే అందులోనే తేడా ఉంది. రచన నడక లాంటిదే. ఎటునడుస్తు న్నాం అనే దానిలాగానే ఏమీ రాస్తున్నాం అనేది ఉంటుంది. మనిషి పుట్టి పెరిగినంత సహజంగా రచయిత పుట్టి పెరుగుతాడు. మనిషి శారీరక సౌష్టవానికి అతని ఆరోగ్యా నికి అవినాభావ సంబంధం ఉన్నట్లే, రచయిత రచనలకు అతని ఆరోగ్యకరమైన ఆలోచనలకు ఉంటుంది.
జీవం- జీవితం రెండూ చాలా దగ్గరివి. జీవం లేనిది జీవితం లేదు. మనిషి లేనిది రచయిత లేడు. మనిషి పుట్టడం జీవంకు సంబంధించిన విషయం. రచయిత పుట్టడం జీవితానికి సంబంధించిన విషయం.
పుట్టిన ప్రతి మనిషిలోంచి రచయిత ఉద్భవిస్తాడన్న నమ్మకం లేదు. అయితే అలా ఉద్భవించినపుడు అది ఒక గొప్ప జీవన ప్రక్రియ అవుతుంది. రచయితలో కలిగే స్పందన, పిండ దశలోని శిశువులో కదిలే కదలికల లాంటివే. అదీ.. అక్కడి నుంచి దాన్ని కేంద్రకంగా తీసుకొని మొదలు పెడితే పొరలు పొరలుగా ఛేదించుకుంటూ వస్తే, ఏ రచయిత అయినా ఎలా రాస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. సమాజ గర్భంలో రచయిత నిత్య శిశువు. అతనిలో, అతని కదలికల్లో, పెరుగుదలలో, తలకిందులుగా తిరుగుతూ ఉండడంలో, రచయితగా చేయి తిప్పుకోవడంలో అతని కలం గీతల్లో మార్పులు అతనికి తప్ప అందరికీ తెలుస్తాయి… రచయితగా చూస్తున్న వాళ్లకు! అతని రచనలు చదువుతున్న వాళ్లకు!! కథా రచయిత సంపత్ కుమార్‌లో ఒక కథకుడు ఎలా పరిణతి చెందుతూ వచ్చాడన్నది పరిశీలిస్తూ ఉన్నాను కనుక, ఆయన ఈ సాహిత్య అరంగేట్రానికి ఆత్మీయంగా తెర తీస్తున్నాను.
రచయిత టి.సంపత్ కుమార్ ప్రవాసాంధ్రుడు. తెలంగాణలోని అదిలాబాద్ జిల్లా వాడైనా, సుమారు ముప్పయి ఏళ్లకుపైగా దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడ్డాడు. విదేశీ పర్యటనల అనుభవాలు విరివిగా ఉన్నవాడు. నాలాగే సైన్స్ నేపథ్యంలోంచి వచ్చినవాడు. సమాజ సమస్యల పట్ల ఆవేదన చెందగల బాధ్యతగల సృజనకారుడు. ఈయన కథల్లో ఏ ఒక్కటి చదివినా ఈ విషయాలు అర్థమవుతాయి. ‘లియోసా’ కథ రాయక ముందు ఈయన కొన్ని కథలు రాశారు కానీ, ఆయనకు ‘లియోసా’ తోనే మంచి గుర్తింపు లభించింది. ఆయనకు ఒక స్థాయినిచ్చి, ఒక నేపథ్యాన్ని కల్పించిందా కథ. ఉదయపు ప్రశాంతమైన, శుభ్రమైన గాలిలా ఆయన కలం నుండి ‘లియోసా’ పాత్ర సృష్టించబడడం ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్నీ ఉత్సుకతను కలిగించాయి. జీవితానుభవాల్లోంచి తీసుకున్న ఇతి వృత్తాన్ని తనదైన శైలిలో నడిపించి, సమకాలీన తెలుగు కథా సాహిత్యానికి ఒక మంచి కథను అందించారీయన. తెలుగు కథాసాహిత్య ‘రన్‌వే’ మీద సంపత్ కథా రచన- ఫ్లైట్ ‘లియోసా’ నుండే ‘టేకాఫ్’ చేసింది. అందువల్ల సంపత్ కుమార్ గుర్తుకు రాగానే ఆ కథే గుర్తుకొస్తుంది.
ఒకానొక నిశితమైన అనుభవాన్ని చక్కగా అవగాహన చేసుకొని, ఆ అనుభవానికి విశ్వజనీనత కలిగించే రీతిలో మలచడం కథకుడు చూపే నేర్పరితనంలో ఉంటుంది. కథ వాస్తవికతతో కూడి ఉండాలి. కాని వాస్తవమే కథ కాదు. అనుభవం వల్లనే కథకు AUTHENTICITY వస్తుంది. “కథానిక ఎంత గంభీరమైన సాహిత్య ప్రక్రియో, అంత తేలికైన రచన కూడా! కథా వస్తువు ఏది తీసుకున్నా రక్తికట్టే విధంగా, హృదయాలను స్పృశించే విధంగా, బుద్ధి కుశలతకు గిలిగింతలు పెట్టే విధంగా, మేధావులను కదిల్చే విధంగా, మాన వాత్మను స్పృశించే విధంగా దానిని నిర్వహించడం తేలికైన పని కాదు. పనితనం చూపాలి. అడుగడుగునా నేర్పుగా వెళ్లాలి” అని ప్రఖ్యాత కథానికా సమీక్షకులు డి. రామలింగం అంటుండేవారు. “బాహ్య జగత్తులో వస్తువు ఎంత అద్భుతమైనా అది కథకుడి అంత రంగ జగత్తులో ఆవిర్భవించే ఒక కళా దృష్టితో సమన్వయం కుదిరి తనదైనప్పుడే రచయిత ఆ వస్తువును స్వీకరించాలి. పాఠకుడికి కావా ల్సింది కళాను గుణమైన సత్యం. నగ్న సత్యం కాదు. రచయితకి ఒక సంఘటన పట్ల సహజమైన అనురక్తి ఏర్పడితేనే దాని జోలికి పోవాలి” అని బుచ్చిబాబు చెప్పిన విషయం ఈ రచయిత బాగా వంటబట్టిం చుకున్నారు. సంపత్ అనుభవాలు వృథా కావు. హృద్యంగా సాహితీ కరించబడతాయి. అయితే సానబెట్టడం, సాధన చేయడం ఎంతటి రచయితలకైనా తప్పదు కదా!
“తెలుగు కథను 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో రచయితలు కృషి చేయడం ప్రారంభించాలి. ప్రపంచంలోని పలు ప్రాంతాలు తిరిగి కొత్త అనుభవాలతో తెలుగు కథకు కొత్త ద్వారాలు తెరవాలి. కొత్త వాతావరణాన్ని తేవాలి. గ్రహాంతర యానం, వ్యాధుల తో వచ్చే సంవేదనలు, ఫలితంగా మానవ సంబంధాలలో వచ్చే మార్పు లు, తరాల అంతరం, వేగవంతమైన జీవితంలో పెరిగిన పని భారం, నగర జీవితంలో ఒంటరి తనం, అవిశ్రాంత జీవనం, కొత్త వంగడాలు, కొత్త వైరస్‌లు, కొత్త సంబంధాలు, కృత్రిమ అవయవాలు, అద్దె గర్భాలు, మానవ – యంత్ర సంబంధాలు ఓజోన్‌పొర, పర్యావరణ సమస్యలు, ప్రళయాలు, ప్రకంపనలు.. వంటి అనేకానేక వైజ్ఞానిక అంశాలకు రాగల శతాబ్దంలో తప్పకుండా ప్రాధాన్యత పెరగనుంది. ఇవన్నీ వైజ్ఞానిక అంశాలే అయినా, సామాజిక సమస్యలుగా రూపు దిద్దుకొని మన ముందుకు వస్తున్న విషయాన్ని మనం గమనించక తప్పదు” అని కొన్నేళ్లుగా నేను చెపుతూ వస్తున్న విషయాలు సంపత్ కుమార్ వంటి రచయితల్ని దృష్టిలో ఉంచుకొని చెప్పినవే. అలాంటి కొన్ని కథాంశాలు ఇప్పుడు ఆయన సంపుటిలో కనిపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. విజ్ఞాన శాస్త్రంలో సాధించిన విజయాలు జీవన శైలిని, తద్వారా సాహిత్య శైలిని అనూహ్యంగా మారుస్తున్నాయన్నది నిజం.
తెలంగాణ గడ్డ మీద ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మట్టిలో పుట్టి పెరిగిన ఈ చిన్న మొక్క పై చదువు రీత్యా వెళ్లి, దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో వృక్షమై వేళ్లూనుకుంది. ఓ అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సంపత్‌కుమార్, శాస్త్రీయ అవగాహనను, మానవ సంబంధాల్ని,నైతిక విలువల్ని ఒకచోట చేర్చగల కూర్పరి. తన దేశ విదేశీ పర్యటనల అనుభవాల్ని కథలుగా మలచగల నేర్పరి! ‘రించిన్’, ‘అనగనగా ఒక దేశం’, ‘లియోసా’ వంటి కథలు చదివిన వారికి ఈ విషయం బోధపడుతుంది. ‘ఎడిటర్ పిలుపు’, ‘గిల్లేసిన రెమ్మలు’, ‘చిప్ప’ వంటి కథలు సామాజిక స్పృహగల ఏ ఇతర రచయితలైనా రాయగలరు. ‘రాస్‌కు శ్రద్ధాంజలి’, ‘మదర్ వర్సెస్ డాలర్’ ‘పత్ర హరితం ప్రశ్నిస్తోంది’ వంటి శాస్త్రీయ నేపథ్యం లోంచి వచ్చిన కథలు కేవలం డాక్టర్ టి.సంపత్ కుమార్ మాత్రమే రాయగలరు. రాబోయే కాలంలో ఎక్కువ మంది రచయితలు ఇలాంటి అంశాలపై శ్రద్ధ చూపాల్సి ఉంది. ‘చిప్ప’ శైలి రీత్యా పరిణతి సాధించిన కథ. గురిగి పగిలి పోవడం, నర్సు కడుపు పోవడం సింబాలిక్‌గా ఉంది. కాల ప్రవాహంలో నాగరికత మార్పు, మట్టి చిప్ప స్థానంలో అల్యూమి నియం బొచ్చె రాక తప్పదు. దేశంలో ప్రణాళికా పుటలు తిరుగుతున్నా మట్టి చిప్పలు చేసుకొనే వారి జీవితాలు రోజురోజుకూ దిగజారుతూనే వచాయని ఆ కథలో చెప్పడం జరిగింది.
తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉంటున్న ఈ రచయితకు మాతృభాషపట్ల గల మమకారం, అవ్యాజమైన ప్రేమ, గౌరవాలు తక్కువవి కావు. ‘తెలుగుకు సమాధి’ కథలో ఆయన హృదయాంత రాళాల్లోంచి పెళ్లుబికే మాతృభాషపై అనురక్తి గోచరమవుతుంది. ‘మట్టి’ కథలో ఒక మధ్య వయస్కురాలితో ఒకచోట రచయిత ఇలా అనిపి స్తారు. “ఇలా రోజు రోజుకు అడవికి పోయే బదులు ఒక్కసారే కాటికిపోతే మంచిదనిపిస్తుంది. అప్పుడు కట్టెలు వాటికవే మా మీదకు చేరుకుంటయ్‌” అని ! వంట చెరకు కోసం గ్రామీణ మహిళలు ఎంత వేదన అనుభవిస్తున్నారన్నది ఈ ఒక్కమాటతో చెప్పించారు రచయిత. ఇందులో ఆయన ఆత్మఘోష వినిపిస్తుంది.
ఈ మాట రావడానికి రచయితకు తను పుట్టిపెరిగిన వాతావరణం, పర్యావరణ సమస్యపై అవగాహన, మొక్కుబడిగా జరిగే ప్రభుత్వ పథకాల పట్ల నిరసన అన్ని ఉపయోగపడ్డాయి. మట్టి విలువ తెలిసిన రచయిత కాకపోతే – మత సహనాన్ని, సర్వమానవ సమానత్వాన్ని కాంక్షించే మానవతా వాది కాకపోతే … ‘పొగడరా నీ తల్లి భూమి భారతిని’ వంటి కథ రాసి ఉండేవాడు కాదు! ఒక ‘రించిన్’, ఒక ‘లిండా’, ఒక ‘లియోసా’లను సృష్టించి, తన ప్రత్యేకతల్ని చూపుకుంటూ తొలి సంపుటితోనే సుసంపన్నమైన తెలుగు సాహిత్య రంగంలోకి సగర్వంగా ప్రవేశించాడు… ప్రభావితంగా ప్రకాశిస్తున్నాడు. అందుకు అభినందనలు!

Comments

comments