Home ఎడిటోరియల్ కుట్రపూరిత హత్యలకు అంతం పలకాలి!

కుట్రపూరిత హత్యలకు అంతం పలకాలి!

BJPవారు ముందుగా మైనారిటీలపై దాడి చేశారు. అటుతర్వాత హేతువాదులు, కమ్యూనిస్టులపై దాడి చేశారు. వారిప్పుడు మాంసాహారులపై దాడి చేస్తున్నారు.
హిందూ చిల్లర గ్రూపులుగా చెప్పబడుతున్న పచ్చి హిందూ మతోన్మాదులు దేశంలో వరుసబెట్టి హత్యలకు పాల్పడుతున్నారు. వారు తాలిబాన్‌లకు హిందూ నమూనా. ఐఎస్ ఇస్లామిక్ రాజ్యం కోరు కుంటున్నది. ఈ గ్రూపులు హిందూ రాజ్యం కోరు కుంటున్నాయి. ఈ గ్రూపులు కొత్తగా పుట్టుకొచ్చినవి కావు. బిజెపి కేంద్రంలో అధికారం చేబట్టాక వారు మరింత దుందుడుగా వ్యవహరిస్తున్నారు. ఏమి మాట్లాడాలో, ఏమి రాయాలో, బట్టలు ఎలా కట్టుకోవాలో, మన యువతులు ఎవరితో నడవాలో, మాట్లాడాలో, ఏమి తినాలో, అంతిమంగా ఏమి ఆలోచించాలో ఈ గ్రూపులు ప్రజలను ఆదేశిస్తు న్నాయి. అది భజరంగదళ్ లేక సనాతన సంస్థ, లేక రామసేన, లేక విశ్వహిందూపరిషత్ కావచ్చు. అవి సంఘ్‌పరివార్‌లో భాగం కాదని ఆర్‌ఎస్ ఎస్, బిజెపి చెప్పుకోవచ్చు. అది నిజమనుకున్నప్పటికీ, సంఘ్‌పరి వార్ తాత్వికతను వ్యతిరేకించే వారందరిపై దాడులు చేసే ధైర్యం వారికిస్తున్నది సంఘ్‌పరివార్ పోషణే.
ఏహ్యత, అసహనం విషం ప్రధాన జలధార నుంచే విరజిమ్మబడుతున్నది. చెప్పినదానికి మించి ఏదోకటి చేసే దుందుడుకు వాదులు ప్రతి సంస్థలో, పార్టీలో ఉంటారు. ఆర్గనైజర్లు వారిని మందలించ టమో, వారి వ్యాఖ్యలు, ప్రకటనలతో తమకు సంబం ధం లేదని ప్రకటించటమో, కొన్ని పర్యాయాలు వారిని తమ సంస్థనుంచి బహిష్కరించ టమో జరుగు తుంటుంది. వారు గనుక తమ సంస్థలో భాగం కానట్లయితే, వారి చర్యలను తీవ్రంగా ఖండించటం, వారిపై చర్యను డిమాండ్ చేయడం జరుగుతుంది. హిందూ చిల్లర గ్రూపుల సహించరాని హింసా కృత్యాలకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్, లేక బిజెపి నుంచి అటువంటిదేమీ జరగటం లేదు. కేంద్ర మంత్రు ల్లో ఎవరూ వాటి గూర్చి నోరెత్తరు. రాష్ట్రపతి మాత్రమే సహనశీలత కొరకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు బిజెపి నాయకులను తీసుకుందాం. బిజెపి పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ దేశ మంతటా గాడ్సే విగ్రహాలు నెలకొల్పాలని బహి రంగంగా కోరుతున్నాడు. నరేంద్రమోడీని వ్యతి రేకించే వారు పాకిస్థాన్ వెళ్లిపోవాలంటున్న గిరిరాజ్ సింగ్‌కి కేంద్రమంత్రి పదవి బహూకరణ జరిగింది. బిజెపికి ఓటు చేసిన వారు రాముని సంతానం, మిగతావారు అక్రమసంతానం అంటున్నారు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి. విశ్వహిందూపరిషత్ ఛైర్మన్ జన్మదినవేడుకలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. దాద్రిలో గోమాంసం భుజిం చారన్న ఆరోపణతో మహ్మద్ అఖ్లాక్‌ను పథకం ప్రకారం హత్యచేయటం దురభిప్రాయంతో జరిగిం దంటారు కేంద్ర సాంస్కృతిక శాఖామంత్రి మహేశ్ శర్మ. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని, లేకపోతే మహాపంచాయత్ పిలుస్తా నంటున్నాడు స్థానిక ఎంపి. దాద్రీ సందర్శన అనంతరం ఆయన, మీడియా అతిగా ప్రచారం ఇచ్చిందంటున్నాడు. ముఖ్య మంత్రి అఖిలేశ్‌యాదవ్ గోవులను వధించే వారిని సమర్థిస్తున్నట్లు మరో బిజెపి ఎంపి ఆరోపిస్తూ, బాధిత కుటుంబంపై గోవధ కేసు పెట్టాలంటు న్నాడు.
దాద్రీలో జరిగింది అనాగరికమైన ఆటవికతకు దారుణరూపం. మాంసాహారం భుజించినందుకు ప్రజలను వేటాడి, హత్యచేయటం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ప్రధానమంత్రి నోరుతెరిస్తే ముత్యాలు రాలతాయన్నట్లు మౌనముద్రలో ఉన్నారు. అటువంటి ఘటనలు జరిగినప్పుడల్లా, కఠినంగా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కోరుతుంటారు. అయితే ఆయన దాద్రీ హత్యను ఖండించలేదు, దురదృష్టం అన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయవలదని, మతంతో ముడిపెట్టవద్దని హోంమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ పనిచేస్తున్నదెవరు? అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు దాన్ని ఖండించారు. కవ్వింపు ప్రసంగాలు, ప్రకటనలు చేస్తూ, నిందితుల అరెస్టులను ఖండిస్తూ దాన్ని మతంతో ముడిపెడు తున్నది బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలే. ‘గోహత్యను సహించబోమ’ని అంటూ హత్యను సమర్థిస్తున్నది వారే. అంతేగాని తమ నేరాలు, టెర్రరిస్టు కార్యకలా పాలకుగాను సాధ్విప్రజ్ఞ, పురోహిత్‌లను వారెన్నడూ ఖండించబోరు.
హేతువాదుల హత్య
మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేందుకు కృషిచేస్తున్న హేతు వాదులపై వారు గురిపెట్టారు. ‘అంధ విశ్వాస్’కు వ్యతిరేకంగా సభలు జరుపుతూ, ప్రచారం చేస్తున్న నరేంద్ర దబోల్కర్ హత్యతో అది మొదలైంది. ఉదయ వాహ్యాళిలో ఉండగా రెండేళ్లక్రితం ఆయన్ను హత్య చేశారు. అయితే నిందితులను అరెస్టు చేయటంలో పోలీసులు ఘోరంగా విఫలం చెందారు. అటు తర్వాత వారు, సిపిఐ కేంద్ర కంట్రోలు కమిషన్ కార్యదర్శి, ప్రముఖ మార్కిస్టు మేధావి అయిన కామ్రేడ్ గోవింద పన్సారేను హత్యచేశారు. ఆయన ప్రజాదరణ ఉన్న రచయిత కూడా. ‘కోన్ హోతా శివాజీ’ అనే ఆయన పుస్తకం అనేక భాషల్లోకి తర్జు మా అయింది. దుండగుల దాడిలో ఆయన భార్య కూడా తీవ్రంగా గాయపడ్డారు. 2015 ఫిబ్రవరి లో ఈ దారుణహత్య జరిగితే, ఇటీవల ఒక్క నింది తుణ్ణి అరెస్టు చేశారు. అంతిమంగా వారు, హంపీ యూని వర్శిటీ మాజీ వైస్‌ఛాన్సలర్ ఎంఎం కల్బుర్గిని హత్య చేశారు. ఆయన హేతువాది, ప్రముఖ రచయిత.
ఈ హత్యలన్నీ ఉదయపు గంటల్లోనే జరిగాయి. హతులైనవారు మార్నింగ్‌వాక్‌లో ఉండగా, లేక అప్పుడే తిరిగివచ్చిన తదుపరి వారిపై దాడి జరిగింది. చేత తుపాకీ పట్టుకుని మోటారు సైకిలుపై వచ్చిన యువకులు కాల్పులు జరిపారు, కనుమరుగై నారు. దోషులను పట్టుకోవటంలో మహారాష్ట్ర పోలీసులు సంపూర్ణ వైఫల్యం చెందారు. సనాతన సాథక్‌లను నిందితులుగా కర్నాటక పోలీసులు నిర్ధారించారు. వారిని పోలీసులు అంతకుముందే అనుమానించకపోవటం అంతుచిక్కని రహస్యం. ఇప్పుడొక కొత్త వివాదం బయలుదేరింది. సనాతన సంస్థను నిషేధించాలన్న కేంద్ర హోంశాఖ ప్రతిపాద నను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం (పృధ్వీరాజ్ చౌహాన్ ప్రభుత్వం) ఆమోదించలేదని హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సిన్హ (ఇప్పుడీయన బిజెపి ఎంపి) చెబుతుండగా, సనాతన సంస్థను నిషేధించా లన్న అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వఅభ్యర్థన హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉండిపోయిందని ఇప్పటి ముఖ్య మంత్రి దేవేంద్ర పడ్నావిస్ చెబుతున్నారు. ఏది సత్యం? ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రప్రభుత్వం మధ్య జరిగిన కరస్పాండెన్స్ మొత్తం బహిరంగ పరచాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది.
సనాతన సంస్థ కేంద్ర కార్యాలయం గోవాలో ఒకే గ్రామంలో ఉంది. దాని వ్యవస్థాపకుడు డాక్టర్ జెబి అథవాలే ఏడేళ్లుగా రహస్యజీవితం గడుపు తున్నారు. అనేక జాతివ్యతిరేక, టెర్రరిస్టు కృత్యాల్లో ఆ సంస్థ నిందితురాలు. ‘జోథా అక్బర్’ ప్రదర్శిస్తున్న నవీ ముంబయిలోని సినిమా హాల్‌లో, ‘అంబర్ పచుపతె’ నాటకం ప్రదర్శిస్తున్న థానే థియేటర్‌లో బాంబులు పెట్టటం, 2009లో మార్మగోవాలో బాంబు పేలుళ్లు ఆ సంస్థ దుష్కుృత్యాల్లో ఉన్నాయి. పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన, ఇప్పుడు బిజెపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే సనాతన సంస్థపై చర్యకు అడ్డుపడు తున్నట్లు చెప్పబడుతున్నది. అతనిపై ఎందుకు చర్య తీసుకోవటం లేదు.
రచయితలు, మేధావులు, కళాకారులపై దాడులు చేస్తున్నారు. ఐఐటిలు, యూనివర్శిటీల స్వయంప్రతిపత్తి దాడికి గురవుతున్నది. చరిత్రను తిరగరాసేందుకు సర్వప్రయత్నాలు జరుగుతున్నా యి. ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి, సమీక్ష పేరుతో రిజర్వేషన్ లపై ప్రత్యక్షంగా దాడిచేస్తున్నారు. అందులో తప్పేమిటని కొందరు బిజెపి నాయకులు ప్రశ్నిస్తు న్నారు. దానిని బిజెపి అంగీకరించటంలేదని మరి కొందరు అంటున్నారు. బిజెపిమంత్రులంతా కొద్ది రోజుల క్రితమే స్వయం సేవక్ బైఠక్ పేరుతో ఆర్‌ఎస్ ఎస్‌తో సమావేశమైనారు. ‘మేము స్వయం సేవ కులం’ అని వెంకయ్యనాయుడు ప్రకటించారు. అటువంటప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌కు భిన్నమైన విధానం బిజెపికి ఎలా ఉంటుంది?
వినాశకరమైన ఆర్థిక విధానాలు అనుస రించటంతోపాటు, బిజెపి, దాని సంస్థలు మతహింస తో వాతావరణాన్ని కలుషితం చేసే ప్రమాదకరమైన సాంప్రదాయం నెలకొల్పుతున్నాయి. జాతీయ సమగ్రత ప్రమాదంలో పడుతున్నది. మైనారిటీలు, లౌకికశక్తులు, హేతువాద ఆలోచనాపరుల్లో ఇబ్బంది కరమైన అభద్రతాభావం నెలకొంది. దీనిని ఆపవల సిన సమయం ఇది. దాద్రీ ఘటన చెదురుమదురు సంఘటనో లేక అరుదైన లక్షణమో కాదు. అధికార దాహార్తులైన మత ఛాందసవాదులు, మతోన్మాదులు రక్తదాహంతో ఉన్నారు. దాద్రీలోని బిసరా గ్రామంలో మహ్మద్ అఖ్లాక్ దారుణమైన హత్య జరిగి వారం దాటింది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఇంకా సద్దుమణ గలేదు. ఒక విభాగం ప్రజల్లో నిస్పృహ, నిస్సహాయ త, తెగింపు అంతిమంగా అసహజమైన, దురదృష్ట కర పరిణామానికి దారితీయవచ్చు. అందువల్ల ఇది తీవ్రమైన విషయం. దోషులపై అనువైన కఠిన చర్యలు తీసుకోవటంద్వారా, ప్రజల మనస్సుల్లోని అపోహలను తొలగించటం లౌకికభారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం బాధ్యతకాదా?