Home ఎడిటోరియల్ తక్కినవి సరే, నల్లధనం ఏదీ?

తక్కినవి సరే, నల్లధనం ఏదీ?

2014 ఎన్నికల ప్రచారంతో, విదేశాలలోని నల్లధనాన్ని రప్పించి ప్రతి సామాన్యుడి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని నమ్మించి, ఓట్లు వచ్చినాక వారిని మోసగించిన ఆయన ఇపుడా విషయం ఎత్తటమే లేదు. ఇదే తెలివైన నాటకంలో రెండవ అంకంగా ఈ సారి, దేశీయ నల్ల ధనాన్ని బయటకు తీసేందుకే పెద్దనోట్లు రద్దు చేస్తున్నామని, 50 రోజులు ముగిసి అది వెలుపలికి రాగానే ఆ లక్షల కోట్ల ధనంతో విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాలను సామాన్యుల కోసం అద్భుతంగా తీర్చిదిద్దుతామని  ఎలుగెత్తి చాటారు. 

block-money1నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు జరిగి, ప్రధానమంత్రి మోడీ పెట్టిన 50 రోజుల గడువు ముగిసిపోయిందిగాని, నల్లధనం వెలికితీసిన జాడలు ఎక్కడా కన్పించటం లేదు. రద్దు వెనుక లక్షాలంటూ ఆయన పేర్కొన్న మూడిం టిలో నల్లధనం మొదటిది అన్నిటికన్న ముఖ్యమైనది. ఒకవేళ దానిని బయటకు తెచ్చివుంటే సామాన్యులు నగదు లేక ఈ 50 రోజుల పాటుపడిన కష్టాలను, ఎదుర్కొన్న నష్టాలను, ఈ సమస్యల వల్ల 100 మందికి పైగా బలి కావటాన్ని కూడా దేశం ఉపేక్షించి ఉండేదేమో.

ఈ 50 రోజుల నగదు సమస్యవల్ల తీవ్రంగా దెబ్బతిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు, జీవనో పాధుల ఇన్‌ఫార్మల్ ఎకానమీ, ఒకవేళ జనవరి నుంచి నగదు తిరిగి యథా ప్రకారం లభించినప్పటికీ, ఈ 50 రోజుల కష్టాల నుంచి కోలుకునేందుకు చాలా కాలం పడుతుంది. అయినప్పటికీ నరేంద్ర మోడీ ఎంతో నాటకీ యంగా, భరోసాగా చెప్పినట్లు నల్లధనం వెలికి వచ్చి ఉంటే ప్రజల దానిని విస్మరించవచ్చు. కాని గడువు తీరిన వేళకు నల్లధనం బయటకు వచ్చిన లక్షణాలు ఒక్కటైనా కన్పించటం లేదు.

“నాకొక్క 50 రోజులివ్వండి. 50 రోజులు ఓపిక పట్టండి. కొత్త సంవత్సరం నవీన భారతదేశం ఆవిష్కార మవుతుంది” అన్న ప్రధానమంత్రి మాటను నమ్మి సామా న్యులు నిజంగానే చాలా ఓపికపట్టారు. వారికి సహజంగానే ధనికులు, చీకటి వ్యాపారులు, రకరకాల అక్రమాలతో సంపన్నులయే వారిపట్ల ఆగ్రహం ఉంటుంది గనుక, ఆ వర్గాల నుంచి నల్లధనాన్ని పిండుతాననే మోడీ హామీపట్ల సహజమైన ఆశలు ఏర్పడ్డాయి. కాని చివరకు ఇపుడు ఏమీ తేలటం లేదు. 2014 ఎన్నికల ప్రచారంతో, విదేశాలలోని నల్లధనాన్ని రప్పించి ప్రతి సామాన్యుడి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని నమ్మించి, ఓట్లు వచ్చినాక వారిని మోసగించిన ఆయన ఇపుడా విషయం ఎత్తటమే లేదు. ఇదే తెలివైన నాటకంలో రెండవ అంకంగా ఈ సారి, దేశీయ నల్ల ధనాన్ని బయటకు తీసేందుకే పెద్దనోట్లు రద్దు చేస్తున్నామని, 50 రోజులు ముగిసి అది వెలుపలికి రాగానే ఆ లక్షల కోట్ల ధనంతో విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాలను సామాన్యుల కోసం అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎలుగెత్తి చాటారు. విదేశీ నల్లధనం – 15 లక్షల మోసాన్ని కాలక్రమంలో మరిచిన అమాయక ప్రజలు, స్వదేశంలోని నల్లధనం – విద్య, వైద్యం అనే రెండవ మోసాన్ని అంతే అమాయకంగా నమ్మి మరోసారి మోసపోతున్నారు.

తమ హామీ నెరవేరే పని కాదని ప్రజలకు ఇంకా సరిగా అర్థమైనట్లు లేదుగాని, మోడీ బృందానికి ముందే తెలిసిపోయింది. దానితో, తమ దారుణ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, 50 రోజుల గడువు ఇంకా ముగియక ముందు నుంచే, ప్రజలను ఇంకా భ్రమలో ఉంచేందుకు కొత్త వాదనలు ఆరంభించారు. గడువు ముగియటానికి మూడు రోజులు ముందు డిసెంబర్ 27న ప్రధానమంత్రి డెహ్రాడూన్‌లో మాట్లాడుతూ, “నోట్ల “రద్దుతో ఒక్కపెట్టుకు టెర్రరిజం, మాదక ద్రవ్యాల మాఫియా, మనుషుల అక్రమ రవాణా, అండర్ వరల్డ్‌ను మేము నాశనం చేసి వేశాము’ అని సగర్వంగా చాటారు. ఈ నాలుగు నిజంగా నాశనమయ్యాయా అనే ప్రశ్నను పక్కన ఉంచితే, ఈ జాబితాలో నల్లధనం అనేది లేకపోవటం ప్రస్తుత సందర్భంలో ముఖ్యంగా గమనించదగ్గది.

నల్లధనంపై “పోరాటం కొనసాగుతుం”దని మాత్రం అన్నారు. గడువు ముగిసేందుకు ఒక రోజు ఉందనగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మాట్లాడుతూ, నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాలేదని, పన్ను వసూళ్లు గతం కన్న పెరిగాయని, జిడిపిపై ప్రభావం ప్రస్తుత త్రైమాసికంలో మాత్రం కొంత ఉండవచ్చునని ప్రకటించారు. కాని విషయం నల్లధనం గురించి తప్ప పన్నులు, జిడిపి గురించి కాదు. జైట్లీ మాట వరసకైనా ఆ జోలికి పోలేదు. తిరిగి అదే 29న మాట్లాడిన కేంద్ర మంత్రి, కేంద్రం పక్షాన ప్రధాన ప్రవక్తగా వ్యవహరిస్తున్న వెంకయ్య నాయుడు మాత్రం సామాన్యులను బోల్తా కొట్టించేం దుకు కొంత చతురంగా మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు వచ్చిన డిపాజిట్లను బట్టి ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం లేదనుకోవద్దని, ఇప్పటిదాకా చిరునా మా అంటూలేని నల్లధనం ఇపుడు బ్యాంకులకు వచ్చిందని, డిపాజిట్ అయిన డబ్బంతా తెల్లది కాకపోవ చ్చునని, పెద్ద డిపాజిట్లు సక్రమమైనవో కావో దర్యాప్తు చేస్తామని అన్నారాయన.

కాని ఇందులో కూడా, 50 రోజులు ముగియటంతో ప్రభుత్వ హామీ ప్రకారం నల్లడబ్బు బయటపడిపో యిందన్న సూచన ఎక్కడా లేదు. పైగా ఆయన, ఆ పని జరిగిందోలేదో అనే అపనమ్మకాన్ని స్వయంగా సృష్టించా రు. డిపాజిట్లు వచ్చినా వ్యవస్థలో నల్లధనం ఉందన్నారు. చిరునామా లేని నల్లధనం డిపాజిట్లు రూపంలో వచ్చిందంటూనే, అది నల్లదో కాదో మునుముందు విచారణలోగాని తెలియదన్నారు. ఈ మాటలను విశ్లేషించి చూస్తే అర్థమయేదేమిటి? నల్లధనం నగదు రూపంలో ఉండేది అతి తక్కువని, నగదు రూపంలో గలది కూడా ఎప్పటికప్పుడు చలా మణి అవతుంటుంది తప్ప ఒకచోట పోగుపడి ఉండటం స్వల్పమని, ఒకరి చేతిలో నల్లది అయినది మరొకరి చేతికి పోగానే తెల్లదికావటం సహజ ప్రక్రియ అని, నగదును అట్లుంచి నల్లధనం అంతకు వందల రెట్లు ఆస్తులు, బంగారం, ఇతర రూపాలలో స్వదేశంలో, ఇతర దేశాలలో ఉంటుందని ఆర్థిక నిపుణులు మొదటి నుంచీ చెప్తున్నారు.

ఇది ఒకటిగాకా, పెద్దనోట్ల డిపాజిట్లను తమ చేతికి మట్టి అంటని విధంగా పెద్దవాళ్లు చేస్తున్నారని కూడా వారు ఎత్తి చూపారు. అందుకు తార్కాణాలు కనించాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అసలు నోట్ల రద్దు చర్యకుగాని, పైన పేర్కొన్న వెంకయ్య నాయుడు మాటలకుగాని అర్థం ఏమైనా కన్పిస్తున్నదా?

మునుముందు ఇంకా ఏమేమో చేయగలమని ప్రధానమంత్రి సహా ముఖ్యులంతా ప్రకటిస్తున్నారు. వారు చేయగలదేమిటో వేచిచూడక, ఆ ఫలితాలను అనుభవించక సామాన్యుడు చేయగలిగిందేమీ లేదు. కాని గత 50 రోజులుగా ప్రభుత్వం తన మొదటి చర్యలో సాధించింది మాత్రం, తను ఇచ్చిన హామీ ప్రకారం లేదు. అటువంటి హామీని సాధించేందుకు అది మార్గంకాదని ప్రధాన మంత్రి బృందానికి నిజంగా తెలియదని ఎవరూ భావించలేదు. తెలిసి కూడా నడిపిన ప్రహసనం ఇదంతా. దేశంలో అవినీతి, అక్రమ ధనం సమస్య ఒక హిమాలయమంత వాస్తవం

.
అక్రమ ధనం నగదుకన్న ఆస్తుల రూపంలో కొన్ని వందల రెట్లు ఉంటుందని, ఒకే చోట పోగుపడేది తక్కువ కాగా నిత్యం చలామణీ జరుగుతుందని, విదేశీ అకౌంట్లలో కుప్పతెప్పలుగా ఉందని, మారిషస్ వంటి మార్గాల్లో తెల్లగా మారి దొరడబ్బుగా వస్తున్నదని, ఇదిగాక సంపన్నులు బ్యాంకులలో సామాన్యులు పొదుపు చేసుకునే సొమ్ము లక్షల కోట్లు తీసుకుని, ఎగవేస్తున్నారని, బినామీ ఆస్తులు లక్షల కోట్లలో ఉంటాయన్న విషయాలు ప్రభుత్వానికి తెలుసునన్నది కూడా ఒక ఎవరెస్టు శిఖరమంత వాస్తవం.

ఇటువంటి పలు విధాలైన అక్రమాలకు ఆ పనులు చేసే వారికి సాక్షాత్తూ ప్రభుత్వాలు, అధికార పక్షాలు, చట్టాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, దర్యాప్తు సంస్థలు సహకరించటం మాట హిందూ మహాసముద్రమంత వాస్తవం.  అటువంటపుడు, నల్లధనాన్ని వెలికితీయటం, ఇక ముందు సృష్టి కాకుండా అరికట్టటం, అక్రమాలకు పాల్పడే వారిని శిక్షించటం, అవినీతిని నిర్మూలించటంపట్ల నరేంద్ర మోడీకిగాని, మరొకరికిగాని చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఇటువంటి వాస్తవ పరిస్థితులను మార్చివేయటంతో తమ చర్యలను ఆరంభించాలి. అంతేగాని, ఎందుకు చేశారో, ఏమి సాధించారో 50 రోజుల తర్వాత కూడా అంతుపట్టక, సామాన్యుల జీవితాలను మాత్రం అస్తవ్యస్తంగా మార్చి, 100 మంది ప్రాణాలు తీసిన నోట్లు రద్దు వంటి ప్రహసనంతో కాదు. ఈ చర్యకే ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లు లేక, తర్వాత “అయో ఇదంతా ఊహించలే” దని నాలుక కరచుకున్న మహా అనుభవజ్ఞులు, మునుముందు మరే ప్రహసనాలు సాగించగలరోనని భయమవుతున్నది.

టంకశాల అశోక్
9848191767