Home వరంగల్ పరకాల మున్సిపల్‌లో నెగ్గేది ఎవరు..?

పరకాల మున్సిపల్‌లో నెగ్గేది ఎవరు..?

 Who Is Win The Parakal Muncipal Elections

మనతెలంగాణ/వరంగల్ అర్బన్ ప్రతినిధి : రానున్న అసెంబ్లీ ఎన్నికల రణరంగం సమయం ఆసన్నం కావడంతో నియోజకవర్గాల స్థానాల కోసం నేతల కుస్తీ పట్ల చదరంగం ఊపందుకుంది. వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఎదురులేని పరిపాలన కొనసాగింది. ఆయన మరణం తరువాత వారికి కెసిఆర్ అండదండలు ఉన్నప్పటికి తన కూతురు కొండా సుశ్మితపటేల్‌కు అసెంబ్లీ స్థానం సంపాదించడం కోసం పావులు కదుపుతూనే ఉన్నారు. దానికి సరైన సమయం ఆసన్నమైందని పరకాల మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మాణం కలిసొచ్చిన అవకాశంగా భావించి దూకుడు పెంచారు. స్థానిక ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి టిడిపి నుంచి గెలుపొంది టిఆర్‌ఎస్‌లో చేరిన తరువాత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోయినా, పాత టిఆర్‌ఎస్ క్యాడర్‌కు దూరంగానే ఉండిపోయారు. గత ఎన్నికల వరకు పరకాల శాసనసభ్యురాలిగా కొండా సురేఖనే నియోజకవర్గంలో ఎక్కువ శాతం ప్రజలతో కలసి ఉండేది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎంఎల్‌ఎగా గెలుపొందిన తరువాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కొంతమంది ఇనుగాల వెంకట్రామిరెడ్డితో ఇమడలేక చల్లా ధర్మారెడ్డితో కలిసిపోయారు. కొంత క్యాడర్ కొండా దంపతులపైనే ఆశలు పెట్టుకొని తటస్తులుగా ఉన్నారు.
టిడిపిలో ధర్మారెడ్డి గెలుపుకు కృషి చేసిన గీసుకొండ మండల నాయకులు చాడ కొమురారెడ్డి, కొండా మురళి పంచన చేరడంతో గీసుకొం డ మండలంలో కొత్త సమీకరణాలకు తెరలేచింది. అయితే పరకాల నియోజకవర్గ సీటుపై కన్నేసిన కొండా దంపతులు మొద టి నుంచి నియోజకవర్గంలో సంబంధాలను కార్యకర్తలతో కొనసాగించుకుంటూనే వస్తున్నారు. ఆ సంబంధాలను ప్రస్తు తం బలపరచుకోవడానికి మున్సిపల్ అవిశ్వాస తీర్మాణం అందివచ్చిన ఆయుధంగా భావించి కాంగ్రెస్ పార్టీ వైపు అభ్యర్థికి తన భరోసాను ఇచ్చినట్లు తెలిసింది. పరకాల మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన రాజభద్రయ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవగా టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చి అధికార పార్టీ చైర్మన్‌గా చేసింది. అయితే ఇటీవల రాజభద్రయ్యకు స్థానిక ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డికి నిధులు, పనుల కేటాయింపుల విషయాల్లో విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో రాజభద్రయ్య పై అవిశ్వాసం పెట్టి తన మనిషిని చైర్మన్‌గా చేసుకోవాలని ఎంఎల్‌ఎ పావులు కదిపారు. దాన్ని పసిగట్టిన రాజభద్రయ్య కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రామిరెడ్డిని ఆశ్రయించారు. వెంకట్రామిరెడ్డి ఏకంగా అధికార పార్టీని ఎన్నికల ముందే ఓడించాలని కంకణం కట్టు కోగా ఇద్దరికి జరుగుతున్న కొట్లాటలో ప్రధాన శత్రువుగా కొండా మురళి, చల్లా ధర్మారెడ్డిని టార్గెట్ చేసి పరోక్షంగా రాజభద్రయ్యకు మద్దతు పలికారు. దీని వల్ల రాజభద్రయ్యకు ఇటు అధికార పార్టీ నుంచి అటు ప్రతిపక్ష పార్టీ నుంచి అనూహ్యమైన మద్దతు లభించడంతో అవిశ్వాస తీర్మాణం వీగిపోయే విధంగా మెజార్టి సభ్యులను కాంగ్రెస్ శిబిరంలో కొనసాగిస్తున్నారు. 20 మంది కౌన్సిలర్లలో రాజభద్రయ్య ఇండిపెండెంట్ కాగా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏడుగురు, బిజెపికి ఇద్దరు, టిఆర్‌ఎస్‌కు పదిమంది కౌన్సిలర్లు ఉన్నారు. బిజెపి ఇద్దరు మినహా ఎవరి కౌన్సిలర్లు వారి శిబిరాల్లో ప్రస్తుతం కొనసాగుతున్నారు. అవిశ్వాస తీర్మాణం నెగ్గడానికి 14 మంది సభ్యుల మెజార్టి అవసరం ఉంది. అందులో నుంచి ఒక కౌన్సిలర్ జారిపోయిన అవిశ్వాస తీర్మాణం వీగిపోతుంది. రాజభద్రయ్యను చైర్మన్‌గా చేయడానికి కొండా మురళి టిఆర్‌ఎస్‌కు సంబంధించిన కౌన్సిలర్లలో ఒకరిద్దరితో మద్దతు ఇప్పిస్తారనే భరోసా రాజభద్రయ్యకు ఉంది. ఈ లెక్కన అవిశ్వాసంలో ఏ పద్ధతిలోనైనా రాజభద్రయ్యను చైర్మన్ చేయాలని వెంకట్రామిరెడ్డి, కొండా మురళి రాజభద్రయ్యకు ఉండడంతో ఎక్కువ శాతం మొగ్గు రాజభద్రయ్యకే ఉందన్న ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే కొండా మురళికి పరకాలపై మరింత పట్టు వచ్చే అవకాశం ఉంది.
– పార్టీలు వేరైనా ఇద్దరి టార్గెట్ ఒక్కరే..
పరకాల నియోజకవర్గంలో ముగ్గురు నేతలు బలవంతులు కావడంతో మున్సిపల్ అవిశ్వాస తీర్మాణాన్ని ముగ్గురు చాలెంజ్‌గానే తీసుకున్నారు. పార్టీలు వేరైనా చల్లా ధర్మారెడ్డి సూచిస్తున్న వ్యక్తి మున్సిపల్ చైర్మన్ కాకుడదని మిగిలిన ఇద్దరు నేతలు పట్టుపట్టి కూర్చున్నారు. కొండాకు, వెంకట్రామిరెడ్డికి రాజకీయ వైరం ఉన్నప్పటికి బయటి నుంచి ఎవరికి వారు రాజభద్రయ్యకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. రాజభద్రయ్య చైర్మన్ కోసం ఇద్దరు నాయకుల టార్గెట్ చల్లానే కావడం వల్ల రానున్న రోజుల్లో పరకాల నియోజకవర్గ రాజకీయాలు ఏవైపుకు మలుపుతిప్పనున్నాయోనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.