Search
Sunday 18 November 2018
  • :
  • :

8 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

నవంబర్‌లో 3.93 శాతం నమోదు

Market

న్యూఢిల్లీ: నవంబర్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3.93 శాతానికి పెరిగింది. ఉల్లి ధరలు పెరగడం, కూరగాయల ధరలు ప్రియం కావడంతో టోకు ద్రవ్యోల్బణం 8 నెలల గరిష్ఠానికి చేరింది. ఈ మేరకు గురువారం వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారిక గణాంకాలను విడుదల చేసింది. ఇంతకుముందు అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.59 శాతంగా ఉంది. అయితే గతేడాదిలో 1.82 శాతం ఉండగా ఇప్పుడు ఏకంగా 3.93 శాతానికి ఎగబాకింది. ఏడాది సూచీ 4.10 శాతం పెరిగింది. గత నెలలో నెల 3.23 శాతం పెరుగుదలను నమోదుచేసింది. ఉల్లి ధర గత నెలలో 178.19 శాతానికి పెరిగింది. సీజనల్ కూరగాయల ధర కూడా మరింత ప్రియం అయ్యాయి. నవంబర్ నెలలో 59.80 శాతానికి పెరగ్గా, అంతకుముందు అక్టోబర్‌లో ఇది 36.61 శాతంగానే ఉంది. టోకు ద్రవ్యోల్బణం ప్రకటించడానికి రెండు రోజుల వినిమయ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ నెలకు గాను ఇది 4.88 శాతం నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో 3.63 శాతంతో పోలిస్తే ఈసారి భారీగా ద్రవ్యోల్బణం పెరిగింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 4 శాతం కంటే అత్యధికంగా నమోదైంది. ఆహార ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందనే భయాందోళనతోనే ఇటీవల జరిగిన పాలసీ సమీక్షలో కూడా ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వడ్డీరేట్లను తగ్గించలేదు. పండ్లు, కూరగాయల తోటలకు నవంబర్ నెలలో కురిసిన వర్షాలు తీవ్ర స్థాయిలో దెబ్బకొట్టాయని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఉల్లిపాయలు, టోమాటోలు, ఇతర ఉత్పత్తుల ధరలు పెరిగినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అక్టోబర్‌లో 2.2 శాతానికి క్షీణించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా పెరుగు వస్తున్నాయని, విధానకర్తల నిర్ణయాలతో దిగుమతులు, ఇతర అంశాలపై ప్రభావం పడిందని ఇండస్ట్రీ బాడీ అసోచామ్ పేర్కొంది. ఇది పరిశ్రమ ఉత్పత్తి ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, ఇప్పటికే లాభదాయకతపై ఒత్తిడి నెలకొందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే
2018 చివరి వరకు ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

Comments

comments