Search
Thursday 15 November 2018
  • :
  • :

టోకు ద్రవ్యోల్బణం 2.47 శాతం

bs

మార్చిలో స్వల్పంగా తగ్గుముఖం

న్యూఢిల్లీ : టోకు ధరల సూచీ(డబ్లుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 2.47 శాతానికి దిగొచ్చింది. ఆహార ధరలు, ప్రత్యేకించి.. పప్పు ధాన్యాలు, కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల కనిష్టానికి చేరింది. ఫిబ్రవరిలో డబ్లుపిఐ ద్రవ్యోల్బణం 2.48 శాతంతో పోలిస్తే ఈసారి ఇంచుమించు అంతే ఉంది. గత ఏడాది మార్చి నెలలో 5.11 శాతం ద్రవ్యోల్బణంతో పోలిస్తే మాత్రం ఈసారి చాలా వరకు దిగొచ్చింది.  గురువారం కేంద్ర గణాంకాల శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. మార్చిలో ఆహార పదార్థాల ధరలు 0.29 శాతానికి తగ్గాయి. ఇక కూరగాయల ధరలు 2.70 శాతం, పప్పు ధాన్యాల ధరలు 20.58 శాతం తగ్గాయి. ఇంధనం, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.81 శాతం ఉండగా.. మార్చిలో 4.70 శాతానికి పెరిగాయి. మరోవైపు ఈ ఏడాది జనవరిలో టోకు ధరల ద్రవ్యోల్బణం 2.84 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దీన్ని 3.02 శాతానికి సవరించారు. ఈనెల 12న రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా వెలువడ్డాయి. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయి 4.28 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. పారిశ్రామిక ఉత్పత్తి ఫిబ్రవరి మాసంలో 7.1 శాతానికి క్షీణించింది. మొత్తం ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.26 శాతానికి పడిపోయి 2.81 శాతంగా ఉంది. ఇంధన విభాగంలో కూడా నెలవారీగా ద్రవ్యోల్బణం 5.73 శాతంగా నమోదైంది.  అయితే రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని ఏప్రిల్-సెప్టెంబర్‌లో 4.7 నుంచి 5.1 శాతంగా ఆర్‌బిఐ నిర్ణయించింది. ఆహార ధరల పెరుగుదలలో చోటుచేసుకుంటున్న తీవ్ర మార్పుల మధ్య ఆర్‌బిఐ ద్రవ్యోల్బణం నియంత్రణ లక్ష్యాల్ని మరింత తగ్గించుకుంది.

Comments

comments