Search
Wednesday 14 November 2018
  • :
  • :

మరో చమురు షాక్

Wholesale price inflation was 4.43 per cent

న్యూఢిల్లీ: ఇంధన ధరలు, కూరగాయల ధరలు పెరిగిన కారణంగా మే నెలలో టోకు ధరల సూచీ(డబ్లుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠానికి చేరింది. గత నెలలో టోకు ద్రవ్యోల్బణం 4.43 శాతం నమోదైంది. ఇంతకుముందు నెలలో ఇది 3.18 శాతంగా ఉంది. అయితే గతేడాదిలో మే నెలలో 2.26%తో పోలిస్తే ఈసారి టోకు ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరింది. పెట్రో లు, డీజిల్ ధరల పెరగడం, ఇదే సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో టోకు ద్రవ్యోల్బణం పెరిగింది. ఆహార పదార్థాల ధరలు మే నెల లో 1.60 శాతం పెరగ్గా.. ఏప్రిల్‌లో 0.87 శాతంగా ఉన్నాయి. ఇక కూరగాయల ధరలు కూడా 2.51 శాతం పెరిగాయి. గత నెలలో కూరగాయల ధరలు 0.89 శాతం తగ్గాయి. ఇక అంతర్జాతీయంగా, దేశీయంగా చమురు ధరలు పెరగడంతో ఇంధన, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం మే నెలలో 11.22 శాతానికి పెరగ్గా.. ఇంతకుముందు ఏప్రిల్ నెలలో ఇది 7.85 శాతంగానే ఉండడం గమనార్హం. పండ్ల ధరలు 15.40 శాతం పెరిగాయి. ఇక పప్పు ధాన్యాల ధరలు 21.13 శాతం తగ్గాయని గణాంకాలు పేర్కొన్నాయి. ఏప్రిల్‌లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 66 డాలర్ల ఉంగా, ఇది ప్రస్తుతం 74 డాలర్లకు చేరింది.
సిపిఐ ద్రవ్యోల్బణం దారిలోనే : రెండు రోజుల క్రితం ప్రకటించిన వినియోగదారుల సూచీ ఆధారిత(సిపిఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా నాలుగు నెలల గరిష్ఠానికి చేరాయి. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.87శాతంగా నమోదైందని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలకు అనుగుణంగా ఏప్రిల్‌లో 4.58 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం, మే నెలకు వచ్చే సరికి 4.87 శాతంగా నమోదైంది.
మరోసారి వడ్డీ రేట్ల పెంపు : ఈనెల ద్రవ్యపరపతి సమీక్షలో వడ్డీ రేట్లను పెంచిన ఆర్‌బిఐ వచ్చేసారి కూడా పెంపుపైనే దృష్టి పెట్టవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గణాంకాలు చూస్తే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపునకే ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తుందని అంటున్నారు. ద్రవ్యోల్బణం లక్షం విషయంలోనూ ఆర్‌బిఐ కఠినంగా ఉండాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండేందుకే ఆర్‌బిఐ నాలుగున్నర ఏళ్ల తర్వాత రెపో రేటును పెంచింది. కాగా ఇప్పటికే ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉండగా, ద్రవ్యోల్బణం పెరుగుదలతో సెంటిమెంటు మరింత బలహీనపడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Comments

comments