Home వనపర్తి పునరావాసుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం

పునరావాసుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం

 Whose land and house lost in construction Reservoir

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ /వనపర్తి: శంకర సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న కానాయపల్లి గ్రామం స్థానంలో నిర్మిస్తున్న పునరావాస కేంద్రానికి సంబంధించిన అన్ని సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో కానాయపల్లి ముంపు పునరావాస బాధితులు, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కానాయపల్లి పునరావాస కేంద్రం సమస్యలను తీర్చేందుకు 2014 నుండి కృషి చేయడం జరుగుతుందని, ప్రభుత్వ పరంగా గ్రామస్తులకు రావాల్సిన లబ్ధి అంతటిని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానాయపల్లి పునరావాస బాధితుల డిమాండ్ మేరకు  రిజర్వాయర్ నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు సంబంధించిన పిల్లలు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉంటే ఆర్ అండ్ ఆర్ కింద బెనిఫిట్స్ ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రితో మాట్లాడుతానని చెప్పారు. సోషియో ఎకనామిక్ సర్వేలో సాంకేతిక కారణంగా ఎవరి పేర్లు అయినా తప్పిపోయివుంటే రికార్డులను పరిశీలించి సరిదిద్దుతామని అన్నారు. ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయి గ్రామంలో లేనివారిగా గుర్తించిన 95 మంది లబ్ధిదారులకు కూడా ఆర్ అండ్ ఆర్ కింద అన్ని బెనిఫిట్స్ ఇచ్చే విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ కేంద్రం నుండి పంటపొలాలకు, లంబాడి తండాలకు వెళ్లేందుకు గాను రహదారులు కావాలని పునరావాస బాధితులు కోరగా అందుకు ఆయన స్పందిస్తూ తక్షణమే ఇందుకు సంబంధించిన అంచనాలను రూపొందించి సమర్పించాలని ఇంజ నీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ ఆర్ కింద పునరావాస కేంద్రంలో చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని, ముఖ్యంగా కానాయపల్లి పునరావాస కేంద్రాన్ని అద్భుతమైన మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, భవిష్యత్‌లో వనపర్తి, కొత్తకోటల మధ్య ప్రాముఖ్యతను సంతరించుకునే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కలెక్టర్ శ్వేతామహంతి మాట్లాడుతూ శంకరసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 1129 మందిని నిర్వాసితులుగా గుర్తించడం జరిగిందని, పునరావాస చట్టం ప్రకారం వీరందరికి అందించాల్సిన వివిధ రకాల బెనిఫిట్స్‌తో పాటు కొత్తగా నిర్మిస్తున్నఆర్ అండ్ ఆర్ కేంద్రంలో మౌళిక సదుపాయాలైన విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించడం జరిగిందని, అంతేకాక రహదారులు, అంగన్‌వాడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర పనులు జరుగుతున్నాయని, పునరావాస కేంద్రంలో సౌకర్యాల ఏర్పాటుకుగాను రూ. 14 కోట్ల నిధులు మంజూరు కాగా, ఇప్పటి వరకు రూ. 5 కోట్లు వెచ్చించినట్లు ఆమె వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌసింగ్ గ్రాంటును రూ. 50 వేల నుండి రూ. 1.25 లక్షలకు పెంచడం జరిగిందని, ముంపు బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని, పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ శంకర సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో ముంపుకు గురైన కానాయపల్లి గ్రామస్తులకు సాధ్యమైనంత లబ్ధి చేకూర్చాలన్నది తమ అభిమతమని, అర్హులందరికి పునరావాస ఫలాలు ఇవ్వవలసిన అవసరం ఉందని, సోషియో ఎకనామిక్ సర్వేలో తప్పిపో యిన వారి పేర్లను జాబితాలో చేర్చాలని, అలాగే 18 సంవత్సరాలు నిండిన వారికి  ఇళ్ల స్థలాలు, ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఖాళీ స్థలాలకు కూడా నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నట్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. గ్రామస్తులు కూడా వీలైనంత త్వరగా రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కానాయపల్లి ముంపు బాధితుల తరపున హేమవర్ధన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రావుల సురేంద్రనాథ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, శంకర్‌గౌడ్, దానయ్య తదితరులు మాట్లాడారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.చంద్రయ్య, ఆర్‌డిఒ చంద్రారెడి, ఎంపిపి గుంత మౌనిక, బీమా ప్రాజెక్టు ఎస్‌ఈ భద్రప్ప, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ వెంకటయ్య, ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు తదితరులు హాజరయ్యారు.