Home ఎడిటోరియల్ హైదరాబాద్ ఎందుకింత మురికి?

హైదరాబాద్ ఎందుకింత మురికి?

DIRTY

హైదరాబాద్ నగరంలో ఎందుకింత మురికి అనే ప్రశ్నకు ఒకే వాక్యంలో సమాధానం చెప్పాలంటే, అక్కడ నివసించే మధ్య తరగతి ప్రజలకు శుభ్రత పట్ల శ్రద్ధ లేదు. స్వయంగా తాము కూడా తమ పరిసరాలను మురికిగా మార్చుతుం టారు. శుభ్రంగా ఉంచేందుకు జిహెచ్‌ఎంసి సిబ్బంది చేసే ప్రయత్నాలకు సహకరిం చరు. నగరాన్ని మురికిగా మార్చటం తమ హక్కుకాగా, శుభ్రపరచటం అధికారుల బాధ్యత అన్నట్లు వ్యవహ రిస్తారు. ఇటువంటి వైఖరికి ఒక పేరు పెట్టాలంటే వారు అనాగరికులన్న మాట.
నగరంలో వివిధ వర్గాల ప్రజలుంటారు. పలు రకాలైన ప్రాంతాలుంటాయి. పెద్దవాళ్లు నివసించేవి కొన్ని. అక్కడి వారికి శుభ్రతకు సంబంధించి అన్నీ అమరి ఉంటాయి. విశాలమైన ఇళ్లు, పని మనుషులు, చెత్త వేసేందుకు పద్ధతి ప్రకారం ఏర్పాట్లు, అక్కడ పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపే అధికారులు, చదువులూ, సంపదలూ నాగరి కతవల్ల కలిగే స్పృహ వంటివన్నీ ఉంటాయి. కనుక వారికి, వారు నివసించే ప్రాంతాలకు సంబంధించిన దాదాపు ఎటువంటి సమస్యలు ఉండవు. అందుకు తగినట్లు మున్సిపాలిటీ వారు, ఇతర శాఖలవారు ఆ ప్రాంతంలో రోడ్లు, చెట్లు, పార్కులు, వీధి దీపాలు, మురికి నీటి పారుదల వ్యవస్థ, వివిధ మరమ్మత్తులపై ఎప్పుడూ దృష్టి పెడతారు.
మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు, పేదల విషయం వేరు. వారు నివసించే ప్రాంతాల పరిస్థితి కూడా వేరు. అదే విధంగా ఈ తరగతుల వారు తమ ఆర్థిక, వ్యాపార, వినియోగ వ్యవహరాలు చక్కబెట్టుకునే వ్యాపార ప్రాంతాల విషయం కూడా వేరు. మళ్లీ ఇందులో మధ్యతరగతి వారిని, తక్కిన వారిని వేరు చేసి చూడవలసి ఉంటుంది. ఈ రెండు వర్గాల మధ్య కొన్ని ముఖ్య మైన తేడాలు ఉంటాయి గనుక. ముందుగా దిగువ, మధ్యతరగతిని, పేదలను చూద్దాం. వీరు తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్న ఇరుకైన వీధుల లో, ఇరుకైన ఇళ్లలో, షెడ్లలో నివసిస్తుంటారు. రోడ్లు, మురికి కాలువలు, లైట్లు, చెత్త వేసేందుకు గాని దానిని తీసేందు కుగాని తగిన ఏర్పాట్లు వుండవు. చెట్లు, పార్కులు, మరమ్మత్తుల మాట మరిచిపోవటం మంచిది. వీరిలో చాలా మంది నివాసాలు నాలాల వెంట అస్తవ్యస్తంగా ఉంటాయి. తమ ఫిర్యాదులను అధికారులు పట్టించుకోరు గనుక, అసలు వారు ఫిర్యాదులు చేయటమే అరుదు. ఏమైనా చేస్తే గీస్తే ఆ ప్రాంతపు మున్సిపల్ కౌన్సిలర్లు, బస్తీ నాయకులు చేయాలి. అయినా పరిష్కారాలు తక్కువ. ఈ పరిస్థితులన్నీ అక్కడి శుభ్రతలో ప్రతిఫలిస్తాయి. వారి చదువులు, స్పృహ కూడా అందుకు తగినట్లుగా ఉంటాయి.
మరొక విధంగా చెప్పాలంటే ఈ పరిస్థితులకు దిగువ మధ్యతరగతిని, పేదలను నిందించవలసింది ఏమీ ఉండదు. మురికిని వారు మరింత పెంచినా అనగ లిగింది ఉండదు. వారంతా తమ రకరకాల పరిస్థితులో చిక్కుకుపోయిన నిస్సహాయులు. బాధితులు. అక్కడ శుభ్రత అన్నది పెరగాలంటే అది పూర్తిగా ప్రభుత్వం తీసుకోవలసిన బాధ్యత అవుతుంది. ఇక వారిలో శుభ్రత గురించి స్పృహ, అందుకు తగిన వ్యవహరణ ఏర్పడ టమన్నది తమ ఆర్థిక స్థితిగతులు, నివాస పరిస్థితులు గణనీయంగా మారటమనే విస్తృతమైన ప్రశ్నతో ముడిపడిన విషయం. అదే సమయంలో ఇక్కడ గమనిం చదగినది ఒకటుంది. ఈ విస్తృత ప్రశ్న మౌలిక మైనది, దీర్ఘకాలికమైనది గనుక, అది జరిగేంత వరకు పరిశుభ్రతలుగాని, అందుకు సంబం ధించిన వారిలో స్పృహలుగాని మారటం అసాధ్యమని అనలేము. మున్సిపల్ అధికారులు గట్టిగా పూనుకు న్నట్లయితే అక్కడి ప్రజలు, వారి నివాసాలు అట్లుండగా కూడా పరిసరాలను తగినంత శుభ్రం గా మార్చటం తప్పకుండా సాధ్యమే. వాటిని ఆ స్థాయిలో నిర్వహి స్తూనే ఉండాలి. మరొకవైపు అక్కడి ప్రజలు, యువకు లు, పిల్లలకు పరిశుభ్రత అవసరం గురించి మున్సిపా లిటీలోని ఆరోగ్య విభాగం వారు, ఈ రంగంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు చెప్పగలది, చేసి చూపగలది ఎంతైనా ఉంటుంది. అక్కడి ప్రజల ఆర్థిక, జీవన ప్రమాణ స్థితిగతులు మారేంత వరకు ఇవి వేచి ఉండా లనటం, వేచి వుండకతప్పదనటంలో సహేతుకత గాని, తార్కికత గాని లేవు. కనుక ఆ ప్రయత్నాలు జరగటం ఆ మేరకు ఉపయోగకరమవుతాయి. మొత్తానికి పైన అనుకున్నట్లు, వీరి విషయమై వారిని నిందించగలిగేది ఉండదు.
చివరి మాట మధ్య తరగతి గురించి. ఈ అన్ని తరగతుల మధ్య అన్ని విధాలా నిందకు అర్హమైన తరగతి ఇదే. వీరు తగిన చదువులు, ఆదాయాలు, సౌకర్యవం తమైన నివాసాలు గల వారు. తమను తాము వివేకవం తులుగా భావించుకుంటూ సకల విషయాలపై వ్యాఖ్య లు చేసేవారు. ప్రతి దానికి అధికారులపై, ఇతరులపై నిందలు మోపేవారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాని వారికి మంచి పౌరులంకావాలనే దృష్టి, బాధ్యతల స్పృహ అట్టడుగున ఉంటాయి. వీరి నివాస ప్రాంతాల లో పౌర సదుపాయాల సమస్యలు ఒక మేరకు ఉన్నప్ప టికీ, చాలా వరకు సదుపాయాలు సజావుగానే ఉంటా యి. వీరికి స్వయంగా నోరుండటంతో పాటు అనేక చోట్ల కాలనీ సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు. అధికారులపైనే గాక తమ కౌన్సిలర్లపై వత్తిడితేగలరు. కాని స్వయంగా తమ బాధ్యతలను గుర్తించి వ్యవహరించటం తక్కువ. అందువల్లనే ఆయా ప్రాంతాలు మురికిగా ఉంటున్నాయి. హైదరాబాద్ నగరం ఆ మేరకు మురికిగా ఉంటున్నది.
కొన్ని ఉదాహరణలను గమనించండి. వీరు తమ ఇంటి చెత్తను ఇంటి బయట రోడ్డు పక్కన, కొంతవరకు రోడ్డు మీద, ఖాళీగా ఉన్న ఇరుగుపొరుగు ప్లాట్లలో పడవేస్తుండేవారు. కొందరు మరీ దారుణంగా పక్క ఇళ్లలో వేసేవారు. మున్సిపల్ కుండీలు వీధి మూలన ఉన్నా“ అంతదూరం” పోయే వారు కాదు. పోయిన వారిలో పలువురు సగం చెత్తను కుండీలో, సగం బయట పడవేసేవారు. కొందరు చెత్తను ప్లాస్టిక్ కవర్లలో తీసుకువెళ్లి విసిరి, అదే ఒకవేళ బయటపడినా చూడనట్లు వెళ్లిపోయేవారు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు వచ్చినపుడు వారిపై నానా అరుపులు అరిచేవారు. రోడ్లపై వేయటం, పొరుగిళ్లలో, ప్లాట్లలో పడవేయటం గురించి ఒకరినొకరు నిందించుకుం టూనే తిరిగి అదేపని చేస్తుండేవారు. ఇదంతా మధ్యతరగతి కపట సభావం. అయితే నగరంలో ట్రాలీలు, ఇపుడు మినీట్రక్కులు ప్రవేశపెట్టి, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రవేశపెట్టి, తడి – పొడి చెత్తల కంటూ ఉచితంగా డబ్బాలు ఇచ్చిన తర్వాత సైతం ఈ కపట స్వభావం మారింది. చాలా కొద్ది గానే ఈ తరగతిని నిందించటం అందువల్లనే. ట్రాలీ కార్మికునికి పైసలు ఇవ్వవలసి వస్తుందని తనకు సర్వీసు వద్దంటూ వెనుకటి పద్ధతుల్లోనే చెత్తపడవేసే మధ్య తరగతివారు ఇప్పటికీ కోకొల్లలు. మున్సిపాలిటీ ఇచ్చిన చెత్త డబ్బాలను వారు ఇతరత్రా వాడుకుంటున్నారు. (రెండు రంగుల డబ్బాల లక్షాన్ని మున్సిపాలిటీ వారు పాటించటం లేదన్నది మరో విషయం) ఇదిగాక, ఈ మధ్య తరగతివారు తమ ఇళ్లలోని వాడకం నీరు, ఎంతమాత్రం బాధ్యత లేకుండా అదనపు నల్లానీళ్లు, డాబాలపై పడే వాన నీళ్లు యధేచ్ఛగా రోడ్లపైకి వదలి మురికి చేస్తారు. అవీఇవీ కూలగొట్టిన ఇటుకలు -సిమెంట్ కుప్పలు రోడ్ల పక్కపోస్తారు. తమ పనుల కోసం రోడ్లు, ఆ పక్క ఖాళీలు తవ్వించి అట్లానే వదలుతారు. ఇదంతా కాలనీ అసోసియేషన్లు కూడా పట్టించుకోవు.
హైదరాబాద్‌లో ఎటుపోయినా ఇదే విధమైన మధ్యతరగతి ప్రవర్తన కన్పిస్తుంది. విచారించ దగినదేమంటే స్వచ్ఛ హైదరాబాద్ గురించి ముమ్మర మైన ప్రచారం సాగుతుండిన రోజుల్లో కూడా వీరు అదంతా పారిశుద్ధ కార్మికులు, జిహెచ్‌ఎంసి “తలనెప్పి” అనే పద్ధతిలోనే చూశారు తప్ప, ఆ కృషి అంతా తమ కోసమని, అందులో తమ కనీస బాధ్యత లను నిర్వహించాలని గ్రహించలేదు. కనుక, ఆ ప్రచా రం తర్వాత గమనిస్తే, తమ నగరం శుభ్రంగా ఉండాలనే నాగరిక స్పృహ ఎక్కువ మిగలలేదు. కార్మికులు వీధులను ఊడ్చటం, చెత్త తరలించు కుపోవ టం ఉదయమే మొదలై గతం కన్న చాలా బాగా సాగుతున్నది. కాని మధ్య తరగతి ప్రవర్తన మారింది చాలా తక్కువ.

– టంకశాల అశోక్
9848191767