Home కలం బిసి వాదం ఎందుకు స్థిరపడలేదు?

బిసి వాదం ఎందుకు స్థిరపడలేదు?

klm.2

తెలుగు సాహిత్యంలో దళిత, స్త్రీ, ముస్లిం, తెలంగాణ వాదాలు అస్తిత్వ సాహిత్యోద్యమాలుగా స్థిరపడి భిన్న విభిన్న కోణాల నుంచి చర్చలు రేకెత్తించాయి. తద్వారా మన సమాజంలోకి ఇంకిన చైతన్యం వల్ల ఆయా సమూహాలను చూసే చూపు మారడం, అనేక ప్రజాస్వామిక డిమాండ్లు తలెత్తి కార్యరూపం దాల్చడం చూశాం. అయితే ముందు దళిత వాదంలో భాగంగా వెలువడిన బిసి (కులాల) సాహిత్యం ముస్లింవాదం లాగే ఒక ప్రత్యేక వాదంగా స్థిరపడి తమ ప్రత్యేక జీవనాన్ని, సంస్కృతిని, సమస్యలను, డిమాండ్లను రికార్డు చేయాల్సి ఉండింది. కాని అది జరగలేదు. జూలూరు గౌరీశంకర్ ’వెంటాడే కలాలు’ వెనుకబడ్డ కులాలు’ పేర ఒక బిసి కులాల కవితా సంకలనం వెలువరించడంతో అస్తిత్వవాదుల మంతా సంతోషపడ్డాం. బిసి (కులాల) వాదం ఒక వాదంగా ఏర్పడడానికి మొదలు పడిందనుకున్నాం. అయితే ఆ పుస్తకంపై చర్చ పక్కదారి పట్టింది. పక్కదారి పట్టిందా? లేక పట్టించారా? అర్ధం కాలేదు. మొత్తానికి ఆ ఒక్క పుస్తకంతోనే బిసి (కులాల) వాదం ఆగిపోయింది. ముందుకు కొనసాగలేదు.నిజానికి మన సాహిత్యంలోబిసి లు లెక్కకు మించి ఉన్నారు. బలమైన కవులు, రచయితలున్నారు. ’వెంటాడే కలాలు’లో ఉన్న కవితలు ఆయా బిసి కవుల బలమైన గొంతుకలు. కానీ వారందరినీ ఐక్యపరిచి ముందుకు నడిపించే నాయకుడు కరువయ్యాడు. ఆ కాలంలోనే జి.లక్ష్మీనరసయ్య లాంటి ఉద్యమకారులు తెర వెనక్కి వెళ్లిపోవడం, జూలూరు గౌరీశంకర్ వెంటాడే కలాలను రాష్ట్రమంతా తిప్పకపోవడం, మిగతా బిసిలు ఎవరూ ఆ కోణంలో స్పందించకపోవడంతో ఆ వాదం ఆగిపోయింది.ఎందుకలా జరిగింది అని మరికొంత లోతుగా తరచి చూసుకుంటే- చాలామంది బిసి కవులకు, రచయితలకు బిసిలుగా ఐడెంటిఫై కావడం ఇష్టం లేదు. అస్తిత్వ స్పృహ లేదు.
తమ జాతుల పట్ల ప్రేమ లేదు. విశ్వమానవులుగా గుర్తింపు పొందాలనే తపన మాత్రం ఉంది. విశ్వమానవులనే ముద్ర ఒక తిట్టు, ఒక బూతు అని వారికి తెలియదనుకోవాలా? విశ్వమానవులనే గుర్తింపు కన్నా, చిన్న సమూహాలకు ప్రతినిధులైన రచయితలైనా నిర్దిష్టత రీత్యా అతి ముఖ్యమైన వారు అన్న స్పృహ వారికి లేకుండా పోయింది. తద్వారా అలాంటి కవులు, రచయితలు ’నా ఘర్ కా నా ఘాకా’ చందంగా మిగిలిపోయే పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఫలానా కవి ఏ సమూహానికి, ఏ అస్తిత్వవాదానికి చెందుతాడంటే మొహం వేలాడేసే పరిస్థితి దాపురించింది. ఈ మధ్యకాలంలో కొన్ని చిన్నా చితక ప్రయత్నాలు జరిగాయి. కాని అవి కూడా బలమైన ముద్ర వేయలేకపోయాయి. అందుకు ’రుంజ’ విశ్వకర్మ రచయితల వేదిక ఒక ఉదాహరణ.బిసి (కులాల) వాదం బలపడకపోడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. బిసిల్లో ఐక్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. అంతకన్నా ముఖ్యమైంది, బిసిలకు ఒక సాహితీ సామాజిక నామం ఏర్పడకపోవడం. బిసిల్లో తలలు పండిన మేధావులు, విమర్శకులు- ఉసా, కంచ ఐలయ్య, బిఎస్ రాములు, జి.లక్ష్మీనరసయ్య, కాలువ మల్లయ్య, బండి నారాయణస్వామి, జూలూరు గౌరీశంకర్, జూకంటి జగన్నాధం, సంగిశెట్టి శ్రీనివాస్, నలిమెల భాస్కర్… -ఇలా ఎంతోమంది ఉన్నప్పటికీ బిసిలకు ఒక పేరు సాహిత్యంలో ప్రతిపాదించడం గానీ, ఖాయం చేయడంగానీ చేయలేకపోయారు. దాంతో బిసిలు ఏకం కాడానికి ఒక గొడుగు లేకుండా పోయింది.‘బిసి’ అనే పదం వాడుకుంటానికి చాలా అభ్యంతరాలున్నాయి. ఎందుకంటే బిసిల్లో దూదేకుల ముస్లింలు, దళిత క్రిస్టియన్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ముస్లింలలోని మరింతమంది వెనుకబడ్డవారిని కూడా చేర్చారు. ఇక్కడ బిసి అంటే బ్యాక్‌వర్డ్ క్యాస్టు కాదు, బ్యాక్‌వర్డ్ క్లాస్ అని తెలుసుకుంటే బిసివాదం అనడానికి ఇబ్బంది వస్తున్నది. భవిష్యత్తులోనూ బిసిల్లో మరికొన్ని వెనుకబడిన సమూహాలను చేర్చే అవకాశముంది. కాబట్టి బిసి కులాలకు సంబంధించినంత వరకు ఒక సామాజిక నామం అవసరమే. దాని కొరకు చింత చేయడం అవసరమే.
సాహిత్యంలో మొదట దళితవాదం అంటే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలుగా నిర్వచించుకోడం జరిగింది. తర్వాత దళిత పదం ఎస్‌సిలకే పరిమితమవుతుందనే చర్చ రావడంతో దళిత బహుజన అని వాడడం జరిగింది. కానీ తరువాత బహుజన అంటేనే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు అనే స్పష్టత వచ్చింది. కాబట్టి ఎస్‌సిలకు దళిత, పై అన్ని సమూహాలకు బహుజన పదాలు చెండుతుండడంతో బిసి కులాలకు ఒక పదమంటూ లేనితనం స్పష్టంగా బయటపడింది. అందుకు తగిన కృషి మాత్రం జరగలేదు. శూద్ర, సూదర పదాలు ఓన్ చేసుకునేలా లేకపోవడం గమనార్హమే.
ఇలాంటి కారణాల వల్ల బిసి (కులాల) వాదం బలపడలేదు. మొత్తంగా వెనుకబడ్డ కులాల సాహిత్యం సాహిత్యోద్యమంగా స్థిరపడలేదు. అందుకు బిసి కులాల పెద్ద తలకాయలందరూ బాధ్యులే! గత సంవత్సరం కరీంనగర్ బహుజన రచయితల సంఘం సభలో మాట్లాడుతూ నేను, ’కరీంనగర్ లో చాలామంది బిసి కవులున్నారు. కానీ బిసి వాదంలో కోట్ చేయడానికి వారి ఒక్క వాక్యమూ లేకపోవడం విచారకరం! ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యమంలో వారు ప్రముఖ పాత్ర పోషించారు.. ఇకనైనా బిసి ఉద్యమానికి తమ గొంతులను జత చేయాలి..’ అంటూ కోరడం జరిగింది.
బిసి కులాల కవులు ఎంతోమంది ఉన్నప్పటికీ వారు తమ కులాలకు ప్రాతినిధ్యం వహించకపోవడం విచారకరమే!నిజానికి బిసి వాదం సాహిత్యంలో బలపడి ఉంటే దాని ప్రభావం సాహిత్యం మీదే కాకుండా సామజిక, రాజకీయ రంగాలపై కూడా ఉండేది. బిసి కులాల వారు రకరకాల డిమాండ్లు చేసే అవకాశం, ప్రజాస్వామిక ఉద్యమాలకు ఊతమిచ్చే అవకాశం ఉండింది. అది చివరకు రాజకీయ రిజర్వేషన్లు డిమాండ్ చేసే స్థాయికి చేరే అవకాశం ఉండింది. ఆ అవకాశాన్ని బిసిలు జారవిడిచారు.అయితే సంవత్సరం క్రితం బిసి యువకవులను పోగేసి చింతం ప్రవీణ్ వెలువరించిన ’సమూహం’ కవితా సంకలనం ద్వారా బిసి వాదానికి మరోసారి మొదలేసినట్లైంది. చింతం ప్రవీణ్ జిల్లాలు తిరుగుతూ ’సమూహం’ సభలు జరపడం, అక్కడ బిసి సాహిత్య చర్చ జరగడం సంతోషకరమైన విషయం. బిసిల చైతన్యమే బహుజన రాజ్యాధికారానికి బాట అని నా నమ్మకం! బిసిల చైతన్యం బలపడితేనే మిగతా అస్తిత్వ వాదాలకు బలం. బిసి చైతన్యం వెల్లివిరిస్తేనే హిందూత్వకు చెక్. తద్వారా మైనారిటీలకు, దళితులకు రక్షణ! బహుజనవాదం మరింత బలోపేతం కాడానికి మార్గం.