Home ఎడిటోరియల్ నష్ట నివారణకు ముందస్తు?

నష్ట నివారణకు ముందస్తు?

bjp

లోక్‌సభ ఎన్నికలు వందరోజుల ముందుగా ఎందుకు జరగవచ్చో 12 కారణాలు వివరిస్తూ ఇటీవల రాజేశ్ జైన్ అనే మేధావి రాసిన వ్యాసం రాజకీయ పండితులు, నాయకుల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. జైన్ 2014 నాటి భారతీయ జనతా పార్టీ (బిజెపి)మిషన్272 ఎన్నికల ప్రచార ఉద్యమ రూపశిల్పి. ఇటీవల జరిగిన పరిణామాల నుంచి 2019 లోక్‌సభ ఎన్నికలు ముందుస్తుగా జరగడానికి కారణాలను జైన్ పేర్కొన్నారు. 2014 నుంచి బిజెపి ఎన్నికల్లో పెద్దగా రాణించకపోవడం మొట్టమొదటి కారణం. అందుచేత నష్టం తగ్గించుకోవడానికి ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది అని చెప్పవచ్చు. వివిధ రాష్ట్రాల ఎన్నికల సమాచారాన్ని విశ్లేషిస్తే ఏ విధంగా బిజెపి హవా తగ్గిపోతోందో స్పష్టమవుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత నాలుగేళ్ల లో 15రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 2014లో మొత్తం 543 లోక్‌సభ సీట్లకు 282 గెలుచుకున్న బిజెపి ఆ తర్వాత 15 రాష్ట్రాల్లో ఎన్నికలను ఎదుర్కొంది. 2014 ఎన్నికలలో ఈ 15 రాష్ట్రాల్లో 191 సీట్లు గెలిచిన బిజెపి తర్వాత 45లోక్‌సభ సీట్లలో బలాన్ని కోల్పోయింది.
ఈ 15 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బిజెపికి బలం లోక్‌సభ స్థానాల లెక్కలో 237అయింది. ఇది 2014 సంఖ్యాబలం కంటే(282)45 సీట్లు తక్కువ. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఈ రాష్ట్రాల ఎన్నికలు సంకేతం అయితే బిజెపి బలం తగ్గిపోతోందన్నది తిరుగులేని సత్యం. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓట్ల వాటా తగ్గుతూ ఉండడం స్పష్టంగా గోచరిస్తోంది. 2014లో ఆ 15 రాష్ట్రాల్లో బిజెపి 1,171 అసెంబ్లీ విభాగాలలో గెలుపొందింది. అయితే తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో అది కేవలం 854 అసెంబ్లీ సీట్లు గెలిచింది. 2014 నుంచి దాని అసెంబ్లీ సీట్ల సంఖ్యలో మూడిం ట ఒకవంతు నష్టపోయింది. ఓట్ల వాటా గురించి చెప్పాలంటే ఈ 15 రాష్ట్రాల్లో 2014 ఎ న్నికల్లో బిజెపి 39 శాతం ఓట్ల వాటా సాధించింది. అప్పుడది 29 శాతానికి పడిపోయింది.
కరిగిపోతున్న మద్దతు
ఈ నియోజకవర్గాల్లో 2014లో ప్రతి 100 మంది ఓటర్లకు 39 మంది బిజెపిని ఎంచుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతి 100మంది ఓటర్ల కు 29 మందే బిజెపికి ఓటు వేశారు. 2014లో అత్యున్నత స్థాయిలో ఉన్న బిజెపి మద్దతు ఆ తర్వాత క్షీణించడం జరుగుతున్నట్లు రాజేష్ జైన్ వ్యాసం నిరూపించింది. నాలుగు పెద్ద రాష్ట్రాలయిన కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాబోయే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్నది. ఈ నాలుగు రాష్ట్రాల నుంచి బిజెపికి 2014 ఎన్నికల్లో 79 పార్లమెంటరీ సీట్లు దక్కాయి. ప్రస్తుత స్థాయిలో ఆ పార్టీకి మద్దతు క్షీణించడం కొనసాగితే మరి 20 సీట్లు బిజెపికి తగ్గుతాయి.
దాంతో దాని మొత్తం క్షీణ బలం 217 లోక్‌సభ సీట్లకు తగ్గిపోతుంది. నోట్ల రద్దు, జిఎస్‌టి (సరకులు, సేవల పన్ను)అమలుపై ఎంత మేకపోతు గాంభీర్యా న్ని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై వాటి చెడు ప్రభావం జిడిపి, తదితర గణాంకాల్లో స్పష్టమవుతుండడంతో ఓటమి భయం ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఎంతగా పట్టుకుందో స్పష్టమవుతూనే ఉంది. నష్టాన్ని తగ్గించడానికి ముందస్తు ఎన్నికల మంత్రా న్ని మోడీ పఠిస్తున్నారు. అసలు ఆయన మనసులో జమిలి ఎన్నికలు మెదులుతున్నాయి.అయితే అన్నిఅసెంబ్లీలు, లోక్‌సభకు ఒకే సారి ఎన్నికలు వినడానికి బాగున్నా ఆచరణలో అసాధ్యమయినవి. అందుకు రాజ్యాంగ సవరణ అవసరపడుతుందని, 2024 వరకు జమిలి ఎన్నికల ఊసు ఎత్తకూడదని ఇసి పూర్వపు కమిషనర్లు హెచ్చరించారు. రాష్ట్రాలలో రాజకీయ కల్లోలం తలెత్తినా, గవర్నర్ సిఫార్సు చేసినా రద్దు అయ్యే అసెంబ్లీకి 6 నెలల్లోగా ఎ న్నికలు జరపాలని రాజ్యాంగం సూచిస్తోంది. కాని జమిలి ఎన్నికల ప్రతిపాదన వల్ల తదుపరి ఎన్నికల తేదీ దాకా వేచివుండాలి. అంతదాకా గవర్నర్ పాలన పొడిగించడం కుదరదు.అయితే లోక్‌సభకు, అయిదేళ్లు నిండిన అసెంబ్లీలతోబాటు ముందుస్తు ఎన్నిక లు జరపడం సాధ్యమే. గతంలో వాజపేయి ప్రభుత్వం గడువుకు ముందే 2004లో ఎన్నికలు జరిపింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు ఎన్నికలు జరిపించారు.
తొందరపడి ముందే కూసిన వాజపేయి, బాబు
అవి వారిద్దరికీ ఎదురుతన్నాయిఅది వేరే విషయం. రెండు రోజుల క్రితం కేంద్రం ప్రకటించిన బడ్జెట్ తీరు చూస్తే ఎన్నికల హామీలు ఇబ్బడిముబ్బడిగా గుప్పించలేని దీనస్థితి కనపడుతోంది. సాహసించి ప్రకటించిన ఆరోగ్య రక్షణ వంటి ఆ కొద్ది భారీ పథకాలకు నిధుల కల్పన బాధ్యతను ప్రభుత్వం తీసుకోకుండా ప్రైవేటు బీమా సంసలకు అప్పగించింది. ఈ పరిస్థితిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లక మోడీ సర్కారుకు గత్యంతరం లేదని పలువురు రాజకీయ నిపుణులు కూడా రాజేశ్ జైన్ వలెనే ఊహిస్తున్నారు. ఈ విశ్లేషణను ఎదుర్కోవడానికి కొందరు రాజకీయ పండితులు ఓటర్ల ఓటింగ్ స్వభావాన్ని ఉటంకించవచ్చు. వారు రాష్ట్ర ఎన్నికలకు ఒకలా, జాతీయ ఎన్నికలకు మరోలా ఓటు చేస్తారన్నది వారి వాదన. ఇది యధార్థమని తేల్చే ఆధారాలు లేవు. ఓటర్ల ప్రవర్తనను అంచనా వేయడానికి ఈ వాదన చక్కటి ప్రాతిపదిక అందిస్తోంది. ఓటర్ నాడి పట్టుకున్నాం అని చాటే కొన్ని సర్వేలలో కంటే ఈ వాదనలో కొంత వాస్తవం లేకపోలేదు. అంతేకాకుండా నేను ఇంతకు ముందు చేసిన పరిశోధన ప్రకారం, రాష్ట్రాలకు, లోక్‌సభకు జమిలిగా ఎన్నికలు జరిపిన సందర్భాల్లో (1967కు ముందు ఆ పద్ధతిలోనే ఎన్నికలు జరిగేవి) 77 శాతం మంది ఓటర్లు రెండింటికీ ఒకే పార్టీని ఎంచుకున్నారని వెల్లడయింది. ఇతర రాష్ట్రాలకు 2018లో జరగనున్న ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా ముందుకు జరిపి నిర్వహిస్తే ఓటరు ప్రవర్తన బలంగా ప్రభావితం అయ్యే పరిస్థితి వస్తుంది. ఎన్నికల లెక్కలు ముందస్తు లోక్‌సభ ఎన్నికలకు అనుకూలంగా జైన్ చెప్పిన జోస్యాన్ని బలపరుస్తున్నాయి. ప్రస్తుత ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీల ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో కర్నాటక, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పెద్దవి. అందు లో చివరి మూడు రాష్ట్రాల్లో బిజెపియే అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో ఆ పార్టీ ఎదురుగాలి ఎదుర్కొంటోందని ఇటీవల ఉప ఎన్నికల్లో నిరూపితమయింది. అక్కడ రెండు లోక్‌సభ సీట్లు, ఒక అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యం గా కాంగ్రెస్ గెలిచింది. అలాగే బెంగాల్‌లో తృణమూల్ గెలిచింది. అవన్నీ బిజెపి కోల్పోయిన సీట్లు. ఈ పరిస్థితిలో ఆయా రాష్ట్రాల ఎన్నికలతోపాటు లోక్‌సభకు ఎన్నికల జరపడం ద్వారా ఓటమి తీవ్రత ను తప్పించుకోవాలని బిజెపి వ్యూహం పన్నుతోంది.

* ప్రవీణ్ చక్రవర్తి