Home వరంగల్ రూరల్ వడదెబ్బపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం

వడదెబ్బపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం

sit5

*ఉపాధి కూలీలు ఎండలో పనులు చేయవద్దు
*అంగన్‌వాడీ, జిపిలలో ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు
*వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: జిల్లాలో వడదెబ్బపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిత తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హీట్‌వేవ్ యాక్షన్‌ప్లాన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎండ తీవ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తయారు చేసిన ఫ్లెక్సీలను మండల, డివిజన్, గ్రామస్థాయిల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద గ్రామ పంచాయతీ, ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి విస్తృత అవగాహనప పరచాలన్నారు. ఉపాధి కూలీలు ఎండలో పనిచేయకుండా ఫీల్డ్ అసిస్టెంట్లకు ముందస్తు సూచనలు చేయాలని పనిచేసే చోట నీడ, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను కూలీలకు అందించాలన్నారు. అదేవిధంగా ప్రతి అంగన్‌వాడీ, జిపిలలో ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులోఉంచాలని మండలాల వారిగా ఎన్ని ఒఆర్‌ఎస్ ప్యాకెట్ల ఆవశ్యకత ఉందో నివేదిక అందించాలని ఎంపిడిఒలకు తెలిపారు. పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్లలో నీరు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. జిల్లాలో లక్షా 91 వేల గొర్రెలు పంపిణీ చేశాం. ఈ జీవాలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరకాల మినహా నర్సంపేట, పర్వతగిరి, రాయపర్తిలోని కొన్నిప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని, మండల స్థాయిలో సమస్యలు తలెత్తకుండా నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు వడదెబ్బ వల్ల మరణాల నివేదిక ఇవ్వాలని డిఎంహెచ్‌ఒకు తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిని మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొక్కలకు నీరందించి వాటిని బతికించుకోవాలని తెలిపారు. దాతల సహకారంతో చలివేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తలపై కరపత్రాలు, బ్యానర్లు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిసింగ్, డిఎంహెచ్‌ఒ వెంకటరమణ, డిపిఒ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పి డిప్యూటి సీఈఒ అనిల్‌కుమార్, ఆర్‌డిఒ మహేందర్‌జీ, సిపిఒ శామ్యూల్, అటవీ అధికారి పురుషోత్తం, హార్టికల్చర్ అధికారి సునీత, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఒలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.