న్యూఢిల్లీ: 30వేల అడుగుల ఎత్తున విమానంలో ప్రయాణించే ప్రయాణికులు సెల్‌ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం త్వరలో నెరవేరబోతోంది. ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటిని అక్టోబర్ నాటికి అందుబాటులోకి తేవడానికి టెలికం డిపార్టుమెంట్ ప్రయత్నిస్తోంది. ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటి లైసెన్స్ ప్రమాణాలను రూపొందించే తుది దశలో ఉన్నామని, సర్వీస్ అవకాశం టెలికమ్ కంపెనీలకు, ఇతరులకు రెండు నెలల్లో కల్పిస్తామని టెలికమ్యూనికేషన్స్, డిపార్టుమెంట్ అధికారి ఒకరు తెలిపారు. టెలికామ్ ఆపరేటర్లు, ఎయిర్‌లైన్స్ ఈ సర్వీస్‌లపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ, భారతీయ విమాన సర్వీసుల్లో 3వేల మీటర్ల (9850 అడుగులు) ఎత్తున వాయిస్, డేటా సర్వీస్‌లు అనుమతించాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫారసు చేసింది. అలాగే ఇన్‌ఫ్లయిట్ సర్వీస్ కనెక్టివిటీ లైసెన్స్‌లను ఏటా 1 రూపాయికే కల్పించాలని కూడా కోరింది. దీనికి టెలికమ్ కమిషన్ అంగీకరించింది.
అయితే విదేశీ శాటిలైట్లను, ఇతర మార్గాలు అనుమతించడానికి అంగీకరించలేదు. భారతదేశ సంస్థలు ఈ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాయి. విమాన సర్వీసుల్లో ఇంటర్నెట్లు ప్రవేశపెడితే తమకు అనుబంధ ఆదాయం వస్తుందని అంతర్జాతీయ సర్వీస్‌లతో పోటీ పడవచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఈ సర్వీస్‌లకు ధర చెల్లింపులో ఇంకా స్పష్టత రాలేదు. నేలపై మొబైల్ సర్వీస్ చార్జీల కన్నా ఎక్కువగానే ఉండవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే ఎయిర్‌లైన్స్ ప్రారంభ పెట్టుబడులు భరించవలసి ఉంది. విమానాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి చాలాకాలం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి విమాన సంస్థకు 1 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. టెక్నాలజీ విమానాల్లో అమర్చడానికి మరో పది రోజులు పడుతుంది. ప్రస్తుత పరిస్థితల్లో ఎయిర్‌లైన్స్ ప్రత్యేకంగా పెట్టుబడి వెచ్చించడం సులువు కాదని అంటున్నారు.