Home తాజా వార్తలు కాలుష్యాన్ని తరిమేద్దాం

కాలుష్యాన్ని తరిమేద్దాం

ktr1

హైదరాబాద్‌ను ప్రపంచంలోనే ఉత్తమ నగరం చేద్దాం 

కాలుష్య కారక ఫ్యాక్టరీలు ఒఆర్‌ఆర్ బయటికే
నాలాలు, చెరువుల కబ్జాలను ఉపేక్షించం
ఔటర్ లోపలి 40 చెరువులను ఆధునికీకరిస్తాం
శేరిలింగంపల్లిలోని బొటానికల్ గార్డెన్ ప్రారంభోత్సవంలో మంత్రి కెటి రామారావు

మన తెలంగాణ/ శేరిలింగంపల్లి : వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో పర్యావరణానికి ముప్పు వాటిల్లబోతోందని రాష్ట్ర ఐటి, పురపాలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బుధవారం శేరిలింగంపల్లిలోని రూ.5 కోట్లతో ఆధునికీ కరించిన బొటానికల్ గార్డెన్‌ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపిలు విశ్వేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, రాగం సుజాత యాదవ్, ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ, ఎంఎల్‌సి భాను ప్రకాశ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. దేశంలో ప్రజలు నివసించదగ్గ ప్రదేశంగా హైదరాబాద్‌కు మొదటి స్థానం ఉందని, దీంతో సంతృప్తి పడితే చాలదని ఇదే సంస్థ ప్రపంచ స్థాయిలో నిర్వహించిన సర్వేలో మన పట్టణం 142 స్థానంలో ఉందన్నారు. కాలుష్యాన్ని పారదోలి మంచి వాతావరణాన్ని సొంతం చేసుకొని ప్రతి ఒక్కరూ మన పట్టణం బెస్ట్ సిటీగా రూపుద్దిద్దుకునేందుకు సహకరించాలని కోరారు. అందులో భాగాంగానే ఔటర్‌రింగ్‌రోడ్‌లో ఉన్న 1122 కాలుష్యాన్ని కారణమవుతున్న పరిశ్రమల ను దశల వారీగా ఒఆర్‌ఆర్ బయటకు పంపనున్న ట్లు తెలిపారు. గత 5 వేల ఏళ్లుగా జరుగుతున్న పట్టణీకరణ కన్నా ఎక్కువగా రానున్న 50 సంవత్సరాలలో జరగనున్నట్లు పలు అధ్యయన సంస్థ లు హెచ్చరిస్తున్నాయన్నారు. వాయు, జల, శబ్ధ కాలుష్యాలు పెరిగిపోయి మానవాళికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ప్రజల భాగస్వామ్యంతోనే వీటిని అధిగమించవచ్చన్నారు. వందల ఎకారాలలో ఉన్న బొటానికల్ గార్డెన్‌లో ఒకే రోజు 25వేల మొక్కలు నాటాలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ కార్యక్రమం చేపట్టాలని అటవీ శాఖ మంత్రికి సూచించారు. కేవలం మొక్కలు నాటడంతోనే పర్యావరణ పరిరక్షణ జరగదని ప్రజా రవాణ వ్యవస్థను కూడా సద్వినియోగం చేసుకోవాలని, హైదరాబాద్ చుట్టు పైచికులు ఉన్న అర్భన్ అటవీ ప్రాంతాన్ని అందమైన పార్కులుగా తీర్చిదిద్దుతామన్నారు. చెరువులు, కుంటలను సుందరీకరించనున్నట్లు దానిని దుర్గం చెరువు నుంచే ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ చుట్టు 150కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయని వాటిలో ఔటర్ రింగ్ రోడ్డు లోపుల ఉన్న 20 చెరువులు హెచ్‌ఎండీఏ, 20 చెరువులు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఆధునీకరించనున్నట్లు తెలిపారు. దీనిని దుర్గం చెరువు నుంచే ప్రారంభిస్తామన్నారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకొని ఎంతటి వారైన ఊపేక్షించబోమన్నారు. నగరంలో 4లక్షల ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎల్‌ఈడీ లైట్లతోనే 55 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, ఒక హైదరాబాద్, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 100 కోట్ల రూపాయాల విద్యుత్ ఆదా అయిందన్నారు. పర్యావరణానికి ముంపు వాటిల్లితే ఎంతో ప్రమాదమని మన దేశ రాజధాని ఢిల్లీలో స్మోక్ ఫాగ్‌లతో కూడిన కాలుష్యంతో విమానాలు ఎగరకపోగా, క్రికెటర్ల సైతం మాస్కులతో క్రికెట్ ఆడిన సందర్బంగా మరిచిపోవద్దన్నారు. ఢిల్లీ నగరంలో 17వేల చెట్లను వివిధ కారణాలతో నరకడం కోసం ప్రయత్నం చేయగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఢిల్లీ లాంటి పట్టణాలలో ఒకే సారి ఇన్ని చెట్లను నరకవద్దని ఆదేశాలు జారీ చేసిందంటే ఢిల్లీ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్నారు. దినదిన గండంగా పెరిడి పోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం మెట్రో లాంటి సదుపాయాలు తెస్తున్న ప్రజలు ప్రజారవాణా వ్యవస్థకు మొగ్గుచూపాలన్నారు. నగర శివారు ప్రాంతాలైన కండ్లకోయ, శంషాబాద్, నారేపల్లి తదితర ప్రాంతాలలో లక్షా55వేల ఎకారల అటవీ భూములు ఉన్నాయని వాటిలో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్నామన్నారు. బొటానికల్ గార్డెన్‌లో విద్యుత్ సరఫరా కోసం సోలార్‌ను ఏర్పాటు చేసుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ఇక్కడ ఒక ఎస్టీపీ మంజూరు చేశారు. పాశమైలారంలో 1700 కోట్లతో శుద్ది ప్లాంట్‌కు ఇటీవలే శంకుస్థాపన విషయాన్ని గుర్తు చేశారు. బొటానికల్ గార్డెన్ ఎదురుగా పాలపిట్ట సైక్లింగ్‌కు మంచి ఆధరణ లభిస్తుందన్నారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడే సీఎం ను ఇంత వరకు చూడలేదన్నారు. తెలంగాణ వ్తాపంగా 100 కోట్ల మొక్కలు నాటా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్ల ముఖ్యమంత్రి వాటి తేదీలను ప్రకటిస్తారన్నారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో చాలా మంది మన నగరంలో ఉండడానికి ఇష్టపడుతున్నారన్నారు. పార్కులను కోట్లాది రూపాయాలతో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దానిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, చైర్మన్ నరేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ సంవత్సరం కింద బోసిపోయినట్లుగా ఉన్న బొటానికల్ గార్డెన్ నేడు నూతన హంగులను సంతరించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఐటీ ఉద్యోగులతోపాటుగా సమీప కాలనీల ప్రజలు రోజు వారి సందర్శకులు, చిన్నారులకు మరింత అందుబాటులోకి వచ్చిందన్నారు. టీఎస్‌ఎఫ్‌డీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చందన్ మిత్రా మాట్లాడుతూ బొటానికల్ గార్డెన్‌లో కొలువుదీరిన కాటేజీలతో మొదలుకొని బాంబు హట్స్, స్కేటింగ్ రింగ్, అంటర్ జిమ్ తదితర వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్, ఎమ్మెల్సీ భానుప్రకాష్, జోనల్ కమిషనర్ హరిచందన, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, మేక రమేష్, జగదీశ్వర్ గౌడ్, పూజిత గౌడ్, జానకిరామరాజు, దోడ్ల వెంకటేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మొవ్వ సత్యనారాయణ, మిరియాల రాఘవరావు, చాంద్‌పాషా, వాలా హరిష్‌రావు, తిరుమలేష్, రవీందర్, మల్లారెడ్డి, మమత, అటవీ శాఖ అధికారులు రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.