Home అంతర్జాతీయ వార్తలు 11న పిఎంగా ప్రమాణం చేస్తా : ఇమ్రాన్

11న పిఎంగా ప్రమాణం చేస్తా : ఇమ్రాన్

imran

పెషావర్ : పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఆగస్టు 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పాకిస్థాన్ తెహ్రీక్ ఎఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ సోమవారం ప్రకటించారు. ఈనెల 25న జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఖాన్ నేతృత్వంలోని పిటిఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యా బలం లేకపోవడంతో ఖాన్ స్వతంత్రుల, ఇతరపార్టీల అభ్యర్థుల మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తతంగాన్ని ముగించుకొని వచ్చే నెల 11వ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తానని పిటిఐ అధినేత వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్ రేడియో వెల్లడించింది. ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని పిటిఐ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇమ్రాన్‌ఖాన్ ఈ మేరకు వివరాలు వెల్లడించినట్లు పేర్కొంది. ఖైబర్ ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై కూడా నిర్ణయం తీసుకున్నానని, వచ్చే 48 గంటల్లో అభ్యర్థిని ప్రకటిస్తానని ఇమ్రాన్ చెప్పారు. సింధు ప్రాంతంలో నెలకొన్న పేదరికాన్ని పారద్రోలడం తమ ప్రభుత్వ అత్యంత ప్రధాన్యాత అంశాల్లో ఒకటని ఆయన చెప్పుకొచ్చారు.