Search
Thursday 15 November 2018
  • :
  • :

సంపాదకీయం : భారత్-రష్యా మైత్రి బలపడేనా?

Sampadakeeyam-Logo

భారత్-సోవియట్ యూనియన్ దౌత్య సంబంధాల వ్యవస్థాపక (ఏప్రిల్ 13,1947)70వ వార్షికోత్సవం ఈ ఏడాది పాటించబడు తోంది. ఈ వారంలో భారత ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటన ఇరుదేశాల సంబంధాలకు కొత్త ఊపు ఇస్తుందని భావించబడుతున్నది. ఈ చారిత్రక కాలగమనంలో ఇరుదేశాల సంబంధాలు ఎత్తుపల్లాలను చూశాయి. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన దరిమిలా దాని వారసత్వ రాజ్యంగా రష్యన్ ఫెడరేషన్‌తో భారత్ సంబంధాలు, కొత్త పరిస్థితిలో పూర్వవైభవాన్ని కోల్పోయాయి. మారిన అంతర్జాతీయ పరిస్థితులు, ఏ రెండు దేశాల మధ్య సంబంధాలు మూడో దేశానికి వ్యతిరేకం కాదన్న సిద్ధాంతంతో పలు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు వృద్ధి చేసుకుంటున్న కాలం ఇది. అంతేగాక అంతర్జాతీయ వేదికలపై సంపన్న-పేద లేదా అభివృద్ధి చెందిన – వర్థమాన ప్రపంచం మధ్య ఘర్షణ కనుమరుగైంది. రాజకీయ కోణాన్ని వాణిజ్యం ఆక్రమించింది. స్థూలంగా చూస్తే ఇరుదేశాల సంబంధాల్లో అనుబంధాలు-ఆగ్రహాలు రెండూ కనిపిస్తాయి. భారత్ అలీనోద్యమ దృక్కోణం నుంచి వైదొలిగి అమెరికా వైపు ఎక్కువగా మొగ్గిందని రష్యా భావిస్తుంటే, రష్యా భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా చైనా, పాకిస్థాన్‌లతో చెలిమిచేస్తోందని భారత ప్రభుత్వం భావిస్తోంది.
నవ స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థకు పునాదులు నిర్మించటంలో నాటి సోవియట్ యూనియన్ చేయూత చిరస్మరణీయం. యుఎస్‌ఎస్‌ఆర్ సాంకేతిక, ఆర్థిక సహాయంతోనే భారత పారిశ్రామికీకరణ పుంజుకుంది. భిలాయ్, విశాఖపట్నం, బొకారో ఉక్కుకర్మాగార సముదాయాలు, దుర్గాపూర్‌లో గనుల త్రవ్వకయంత్రాల కర్మాగారం, నైవేలీ థర్మల్ విద్యుత్కేంద్రం, కోర్బాలో ఎలక్ట్రో మెకానికల్ కర్మాగారం, రిషికేష్‌లో యాంటీబయోటిక్స్, హైదరాబాద్‌లో ఫార్మా స్యూటికల్ ఫ్లాంట్-సోవియట్ యూనియన్ సహాయంతో ఏర్పాటైన వందకుపైగా ప్రాజెక్టుల్లో మౌలికమైనవి. విద్య, పరిశోధన రంగాలతోపాటు రోదసీ కార్యక్రమంలో యుఎస్‌ఎస్‌ఆర్ సహకారం మరువలేనిది. 1975లో భారత తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను ప్రయోగించిందీ, 1984లో భారత వ్యోమగామి రాకేష్‌శర్మను సోయుజ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి పంపిందీ యుఎస్‌ఎస్‌ఆరే. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం నేపథ్యంలో 1971లో శాంతి, స్నేహం, సహకారం ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయటం భారత్‌కు కొండంత అండ అయింది. 2000సం॥లో భారత్-రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం జరిగింది. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ, జి-20 వంటి వేదికలపై కలిసి పనిచేస్తున్నాయి. రక్షణ, రోదసీ, అణువిద్యుత్ రంగాల్లో రష్యా సహకారం ఎనలేనిది. రష్యా కుడంకుళంలో నిర్మించిన తొలి అణువిద్యుత్ యూనిట్ 201౩లో ఉత్పత్తి ప్రారంభించింది. 2016లో రెండవ యూనిట్ భారత్‌కు అప్పగించబడింది. మూడు, నాలుగు యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సిలీ ‘బ్రహ్మోస్’ ఇరుదేశాల సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి.
అయితే ద్విపక్ష వాణిజ్యం గత కొద్ది సంవత్సరాల్లో మందకొడిగా 7-8 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. 2025నాటికి 30బిలియన్ డాలర్లకు పెంచాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. భారత విదేశాంగ విధానంలో అమెరికావైపు వచ్చిన మొగ్గు, అదే సమయంలో, పాకిస్థాన్‌తో చైనా బంధం పెంపొందటం, పాకిస్థాన్‌కు ఆయుధ విక్రయంపై నిషేధాన్ని 2014లో రష్యా ఎత్తివేయటం, చైనా సిల్క్‌రోడ్ పథకాన్ని రష్యా బలపరచటం, భారత్ దూరంగా ఉండటం వంటివి భారత్-రష్యా సంబంధాల వృద్ధి లో చికాకు అంశాలు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకమైన ఆర్థిక వేదిక సమావేశానికి అతిథిగా సైంట్ పీటర్స్ బర్గ్ వెళుతున్నారు. అధ్యక్షుడు ఫుతిన్‌తో మోడీ అక్కడ, తిరిగి 8-9 తేదీల్లో అస్టానాలో షాంఘై సహకార సంస్థ వార్షిక సమావేశం సందర్భంగా చర్చలు జరుపుతారు. నేటి ప్రపంచంలో ఎవరి ప్రయోజనాలు వారివి. అన్ని విషయాల్లో రష్యా మనల్ని బలపరచాలని ఆశించలేము. సాంప్రదాయక సంబం ధాలు వృద్ధిచేసుకుంటూ, సాధ్యమైనంత ఏకీభావంతో కలిసి పనిచేయటమే మార్గం.

Comments

comments