Home కలం చెమట కవిత్వం అవుతుందా?

చెమట కవిత్వం అవుతుందా?

Poetry

“నేను రక్తంతో రాస్తాను. నేను రక్త కవిత్వం చిత్రీకరిస్తాను. నాదె రక్త ధార’ ఇలాంటి మాటలు కవుల నుంచి చాలా సార్లు వింటుంటాం. రక్తం ఎందుకు ప్రతీక? హింసకు ప్రతీక. కసికి ప్రతీక. ద్వేషానికి ప్రతీక. రక్తం. రక్త కవిత్వం. రక్తాక్షరాలు. రక్త లిపి ఇవి తప్పని నేను అనలేదు. శత్రు దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇటువంటి మాటలు ఎన్నో వస్తాయి. నిరంతర యుద్ధంలో మునిగి ఉన్న కవికి… ! కవి నిరంతర యుద్ధంలో ఎలా మునిగి వుంటాడు? – ఇదో ప్రశ్న.. సహజంగా కవి సున్నితుడయి వుంటాడు. శాంతి మనస్కుడై వుంటాడు. అనుభూతి మయుడై వుంటాడు. కరుణామృత ధారలతో నిండి వుంటాడు. అటువంటి కవి యుద్ధంలో ఎలా వుంటాడు? వాస్తవానికి కవి యుద్ధంలో యుద్ధరంగంలోనే ఉన్నాడు. కవి మాత్రమే కాదు ప్రజలు యుద్ధ రంగంలోనే ఉన్నారు. వ్యక్తి పుట్టుక నుండి చావు వరకు నిరంతరం యుద్ధం చేస్తూనే వుంటాడు. శత్రువు ఇంటాబయట ఆలోచనలలో ఆచరణలలో, మనసులో, నడకలో కనిపించి కనిపించకుండా వుంటాడు. అయితే కొందరికి కొందరు శత్రువులుంటారు. శ్రామిక కార్మికులకు చెమట ధారపోసి సంపద సృష్టించే వారికి దోపిడీ వర్గం శత్రువులుంటారు. అందుకే మార్కిజం స్పష్టంగా వర్గ దృక్పథాన్ని స్పష్టీకరించింది. శ్రామిక వర్గం – పెట్టుబడిదారీ వర్గం, శ్రామిక వర్గం దోపిడీ వర్గం వీటిని మార్కిజం ఇంకా స్పష్టంగా చెప్పింది. వున్నోళ్లు – లేనివాళ్లు. లేనివాళ్లు శ్రమజీవులు, ఉన్నోళ్లు శ్రమ జీవులను దోచుకునే వారు. పెట్టుబడిదారి వర్గం, దోపిడీకి అంగరంగ వైభోగానికి శ్రమ జీవులు వారి ఉత్పత్తి. శ్రమ జీవుల ఉత్పత్తికి వారి చెమట కారణం. చెమట కార్చకుండా ఉత్పత్తి సాధ్యం కాదు. చెమటకు ఉత్పత్తికి దగ్గరి సంబంధాలున్నాయి. చెమట శ్రమకు ప్రతీక. శ్రమ- చెమట – ఉత్పత్తి- సంపద ఇవి ఒక వర్గానికి సంబంధించిన ప్రతీకలు. ఇవి ప్రపంచ పురోగమనానికి నిదర్శనం. ఇవి లేకపోతే ప్రపంచమే లేదు. నాగలి పట్టి భూమి దున్ని రాత్రింబవళ్లు కష్టపడి పంట పండిస్తేనే కడుపు నిండుతుంది. ఎంత రిలయన్స్ అంబానీకైనా, బిల్‌గేట్స్‌కయినా ఆకలి ఉంటుంది. కడుపు నింపు కోవటం ముఖ్యం. చెమట రాల్చకుండా విత్తనం రాలేదు. కంప్యూటర్లు విత్తనం రాల్చలేవు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం కడుపు ఆకలి తీర్చలేదు. ఏ విజ్ఞానమైనా, రైతు ముందు వట్టిదే. రైతు చెమట రాల్చనిదే పంట రాదు. కడుపు నిండదు. కాలం పరుగులు తీయదు. ఈ వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరముంది. బాంబులు తిండి పెట్టవు. అంతరిక్ష నౌకలు అన్నం పెట్టవు. అంతా రైతు మీదే ఆధారం. రైతు చెమట రాల్చనిదే మిగతా ఏ రంగానికి కళ లేదు. జీవం లేదు. ప్రాణం లేదు. ఈ వాస్తవాన్ని మొట్టమొదట రచయిత గమనించాలి. ఎందుకూ – రచయిత వర్తమాన సమాజాన్ని చిత్రించేవాడు. భవిష్యత్తు రూపు రేఖలను ఆవిష్కరించే వాడు. ఆ రెండూ చేయాలంటే రచయిత శ్రమను సృష్టించాలి. చెమట జీవుల సృష్టించాలి. శ్రామిక జనంను తన వస్తువు చేసుకోవాలి ఇది తప్పదు. శ్రమ ప్రపంచానికి జీవం… అయితే ఏ శ్రమ ప్రపంచానికి జీవం! ఉత్పత్తిని సృష్టించే శ్రమ మాత్రమే జీవం. ఈ శ్రమ రచయితకు వస్తువు కావాలి…
శ్రమ- చెమట- ఉత్పత్తి- సంపద ఒక వర్గంగా, ఒక సమూహంగా, ఒక చైతన్యంగా, ఒక వెలుగుగా ఎలా భావిస్తామో, మరో గీత గీసి ప్రతి వర్గాన్ని వ్యాఖ్యానించవచ్చు. కొనుగోలుదారు – అమ్మకందారు – వ్యాపారి- దళారీ- ఏజెంట్ – పాలక పక్షం- దీన్ని ఒక వర్గంగా, సమూహంగా, ఒక దోపిడీ శక్తిగా – ఒక చీకటిగా భావించవచ్చు పాలక పక్షాన్ని ఈ వర్గంలో ఎందుకు చేర్చాలి? దోపిడీ శక్తుల కొమ్ముగాస్తున్నారు కనుక – నిజానికి చెప్పాలంటే ఇది కూడా కరెక్ట్ కాదు. వాస్తవం చెప్పటానికి వెనుకా ముందు అవుతున్నాం. ప్రజాస్వామ్య భావజాలం నిజాలు చెప్పనీయదు. కానీ అదో సెంటిమెంట్. ఇక్కడ పాలక పక్షం దోపిడీ శక్తులు రెండూ ఒకటే!
ఈ విషయంలో రచయిత సామాజిక వాస్తవికతను, ప్రపంచ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ప్రపంచ స్వరూపాన్ని శ్రమ – పెట్టుబడి- సంపద- దోపిడీ రచయిత అర్థం చేసుకోవాలి. ప్రపంచ స్వరూపంలో రెండు వైరుధ్యాలు – వైరుధ్యాల మధ్య ఘర్షణలు రచయిత అర్థం చేసుకొని చెమటకు – శ్రమకు మద్దతుగా నిల్వాలి. అక్కడే రచయిత నిజాయితి ఉంది.
ఒక దిక్కు సంపదను సృష్టించి దేశంలో సంపదను పెంచే శ్రమ – చెమట ఇందుకు సంబంధించిన లెక్కలు ఎనుబది శాతంపైగా ఉన్నాయి. వీళ్లే దేశానికి పునాది. వీళ్లే దేశ పురోగమనానికి చక్రాలు. వీరులేకపోతే ప్రపంచం లేదు. అయితే వీరు ఎలా వున్నారు? అప్పులలో, ఆకలిలో, అనారోగ్యంలో, సమస్యలలో, చీకట్లలో రాళ్ల మధ్య ముళ్ల మధ్య బ్రతుకుతున్నారు. వీళ్లది అమావాస్య బ్రతుకులు. వీళ్లు దేశంలో ఒక శాతం రెండు శాతం కాదు వుంది, ఎనుబది శాతమున్నారు. ఈ ఎనుబది శాతమే ఈ ప్రజాస్వామ్యానికి జీవం. ఈ ఎనుబది శాతం ఎన్నుకున్న వారే అధికారంలోకి వస్తున్నారు. చట్టాలు చేస్తున్నారు. పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇక్కడే పెద్ద కుట్ర వుంది. ఇక్కడే పెద్ద విషాదం వుంది. ఎనుబది శాతం శ్రమ జీవులు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఓట్లు వేసిన ప్రజలను గాలికి వదిలి కార్పొరేట్ సామ్రాజ్యానికి కావలి కుక్కలుగా మారిపోతున్నారు. ఓట్లు వేసిన ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో బిచ్చగాళ్లను చేశారు. ఎంత దుర్మార్గం! ఎంత విషాదం! చట్టబద్ధ దోపిడీ ఇది. వీరు చెమట జీవులు. వర్తమాన రచయిత వీరి గూర్చే రాయాలి. ఈ చెమట గూర్చే వ్రాయాలి. చెమట సృష్టించే సంపద గూర్చి రాయాలి. ఆ సంపద ఎవరి పాలవుతుందో, ఎక్కడ దోపిడీకి గురి అవుతుందో అది చట్టబద్ధ దోపిడీగా ఎలా మారుతుందో రచయిత రాయాలి. ఇక్కడే రచయిత నిజాయితీ ఉంది. అంకిత భావముంది. చెమట అంటే ఏమిటి? రక్తం చెమటగా మార్చుకొని పండించిన పంట నక్కల పాలయినట్టు అంటారు. శ్రమ జీవి రక్తమే చెమట.
మన దేశంలో శ్రమ జీవులెవరు. తమ చెమటతో సంపద సృష్టించే వారెవరో ఇది అందరికీ తెల్సిన రహస్యం. సామాన్యంగా ఇందుకు ఒక సూత్రముంది. మనిషి మనుగడకు తప్పని సరి అవసరమైన వస్తువులు సృష్టించే వారు శ్రమ జీవి… ఏ వస్తువు అయితే సంపదగా మారుతుందో ఆ సంపదను సృష్టించేవాడు శ్రమ జీవి? రచయితకు ఈ శ్రమ జీవియే లక్షం… అంటే శ్రమ జీవి గూర్చి రాసే వాడు నిజమైన రచయిత.
ఈ వ్యవస్థలో ఎవడు శ్రమజీవి. కడుపు నింపేవాడు శ్రమజీవి… ఆకలి తీర్చేవాడు శ్రమజీవి. శరీరం తడువకుండా బట్టలు ఇచ్చే వాడు శ్రమజీవి, చెప్పులిచ్చే వాడు శ్రమ జీవి. ఏవి లేకుండా మనిషి బ్రతకడం అసాధ్యమో అవి సృష్టించే వాడు శ్రమ జీవి.
ఇదంతా ఇపుడు ఎందుకు రాయాల్సివస్తుంది? అసలు సంపదకు మూలమైన మట్టిని, గొడ్డలిని, మగ్గాన్ని కనీస అవసరాలను తీర్చే శ్రమను కాదని సెల్‌ఫోనులు, ఇంటర్నెట్‌లు, కంప్యూటర్లు లాంటి ఆధునిక పరికరాలను సంపద సృష్టించేవిగా భావించటం మూలంగా ఇదంతా వ్రాయవల్సి వస్తుంది. ఆధునికత మనిషి శక్తిని ధ్వంసం చేసింది. సామాజిక అంతరాల పెంపుకు దోహదం చేసింది. ప్రపంచీకరణ సంపదకున్న సామాజిక అర్థాన్ని ధ్వంసం చేసి మట్టి బతుకుల కడుపు కొట్టింది. ఈ మట్టి బతుకుల గూర్చి రాద్దాం.