Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఫెదరర్‌కు షాక్..

nadal

సెమీస్‌లో అండర్సన్, జొకొవిచ్

లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నుంచి స్విట్జర్లాండ్ దిగ్గజం, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ నిష్క్రమించాడు. బుధవారం హోరాహోరీగా సాగిన మారథాన్ క్వార్టర్ ఫైనల్ సమరంలో టాప్ సీడ్ ఫెదరర్ దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్సన్ చేతిలో కంగుతిన్నాడు. నరాలు తెగే ఉత్కంఠత మధ్య సాగిన పోరులో 8వ సీడ్ అండర్సన్ 26, 67, 75, 64, 1311 తేడాతో ఫెదరర్‌ను ఓడించాడు. తన ఖాతాలో మరో వింబుల్డన్ టైటిల్ జమ చేసుకోవాలని భావించిన దిగ్గజ ఆటగాడు ఫెదరర్‌కు క్వార్టర్ ఫైనల్లోనే షాక్ తగిలింది. అసాధారణ పోరాట పటిమను కనబరిచిన అండర్సన్ చారిత్రక విజయాన్ని అందుకున్నాడు. రెండు సెట్లను కోల్పోయినా అండర్సన్ ధైర్యాన్ని వీడలేదు. తర్వాత వరుసగా మూడు సెట్లను గెలిచి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రారంభంలో ఫెదరర్ జోరు కొనసాగించాడు. తొలి సెట్‌లో తన మార్క్ ఆటతో చెలరేగి పోయాడు. చూడచక్కని షాట్లతో చెలరేగిన ఫెదరర్ అలవోకగా తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో కూడా ఫెదరర్ పైచేయి సాధించాడు. అండర్సన్‌ను కట్టడి చేస్తూ టైబ్రేకర్‌లో సెట్‌ను దక్కించుకున్నాడు. దీంతో ఫెదరర్ సెమీస్‌కు చేరడం ఖాయమని అందరు భావించారు. అయితే ఈ సమయంలో అండర్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. తీవ్ర ఒత్తిడిని సైతం తట్టుకుంటూ ముందుకు సాగాడు. ఏమాత్రం ఆధైర్య పడకుండా ఆడిన అండర్సన్ టైబ్రేకర్‌లో మూడో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడాడు. ఫెదరర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అలవోకగా సెట్‌ను సాధించాడు. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ సమరం కొనసాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు.
దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. చివరి వరకు ఫలితం చేతులు మారుతూ వచ్చింది. అయితే కీలక సమయంలో ఒత్తిడిని సైతం తట్టుకుని ముందుకు సాగిన అండర్సన్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
ఎదురులేని జొకొవిచ్…
మరో పోటీలో మాజీ చాంపియన్, 12వ సీడ్ నొవాక్ జొకొవిచ్ సునాయాస విజయం సాధించాడు. జపాన్ ఆటగాడు, 24వ సీడ్ నిషికోరితో జరిగిన క్వార్టర్ ఫైనల్ సమరంలో జొకొవిచ్ 63, 36, 62, 62తో జయకేతనం ఎగుర వేశాడు. ప్రారంభం నుంచే జొకొవిచ్ ఆధిపత్యం చెలాయించాడు. ఏమాత్రం ఒత్తిడిని ఎదుర్కొకుండానే తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో నిషికోరి విజయం సాధించాడు. అయితే తర్వాతి రెండు సెట్లలో జొకొవిచ్ పైచేయి సాధించాడు. ఈ రెండు సెట్లను గెలిచిన జొకొవిచ్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. కిందటిసారి క్వార్టర్ ఫైనల్లోనే ఓడిన జొకొవిచ్ ఈసారి టైటిల్‌పై కన్నేశాడు. ఈ దశగా మరో అడుగు ముందుకు వేశాడు.

Comments

comments