Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మూడో రౌండ్‌లో ప్లిస్కోవా

sprts

ఫెదరర్, మాడిసన్ కీస్, మిలొస్ రౌనిక్ ముందుకు

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిలు కరొలినా ప్లిస్కోవా (చెక్), మాడిసన్ కీస్ (అమెరికా) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో 13వ సీడ్ మిలొస్ రౌనిక్ (కెనడా), డెనిస్ నొవాక్ (ఆస్ట్రియా) రెండో రౌండ్‌లో విజయం సాధించారు. మరోవైపు రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), టాప్ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మరోవైపు 17వ సీడ్ లుకాస్ (ఫ్రాన్స్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.
అలవోకగా…
మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ ప్లిస్కోవా రెండో రౌండ్‌లో సునాయాస విజయం సాధించింది. మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)తో జరిగిన రెండో రౌండ్‌లో 63, 63తో జయకేతనం ఎగుర వేసింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ప్లిస్కోవా ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. చూడచక్కని షాట్లతో అజరెంకాను హడలెత్తించింది. ప్లిస్కోవా ధాటికి అజరెంకా ఎదురు నిలువలేక పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన ప్లిస్కోవా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది.
కీస్ ముందంజ..
మరోవైపు పదో సీడ్ మాడిసన్ కీస్ కూడా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. థాయిలాండ్ క్రీడాకారిణి కుంకుంతో జరిగిన పోరులో మాడిసన్ కీస్ 64, 63 తేడాతో విజయం సాధించింది. ప్రారంభం నుంచే కీస్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. చూడచక్కని షాట్లతో అలరించిన కీస్ ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. ప్రారంభ సెట్‌లో కుంకుం కాస్త ప్రతిఘటన ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగిన కీస్ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా కీస్ చెలరేగి ఆడింది. చివరి వరకు దూకుడును ప్రదర్శిస్తూ 63తో సెట్‌ను సొంతం చేసుకుని ముందంజ వేసింది. మరో పోటీలో యనినా వికిమేయర్ (బెల్జియం) విజయం సాధించింది. జర్మనీ క్రీడాకారిణి ఆండ్రియా పెట్కోవిక్‌తో జరిగిన రెండో రౌండ్‌లో వికిమేయర్ 64, 63 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్‌లో కాస్తా పోటీ ఇచ్చిన పెట్కోవిక్ తర్వాత ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న వికిమేయర్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు డొనా వెకిక్ (క్రొయేసియా) కూడా మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో వెకిక్ 75, 64 తేడాతో రెబెకా పీటర్సన్ (స్వీడన్)ను ఓడించింది. హోరాహోరీగా సాగిన పోరులో వెకిక్ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
రౌనిక్ ముందుకు…
పురుషుల సింగిల్స్‌లో 13వ సీడ్ మిలొస్ రౌనిక్ (కెనడా) మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మూడు సెట్ల హోరాహోరీ సమరంలో రౌనిక్ 76, 76, 76 తేడాతో ఆస్ట్రేలియా ఆటగాడు జాన్ మిల్‌మాన్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. ఇద్దరు సర్వం ఒడ్డడంతో అన్ని సెట్లు కూడా టైబ్రేకర్ వరకు వెళ్లాయి. అయితే కీలక సమయంలో జాన్ ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న రౌనిక్ మూడు సెట్లను గెలిచి ముందంజ వేశాడు. మరో పోటీలో డెనిస్ నొవాక్ (ఆస్ట్రియా) విజయం సాధించాడు. 17వ సీడ్ లుకాస్‌తో జరిగిన పోరులో నొవాక్ సంచలన విజయాన్ని అందుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోరులో డెనిస్ 64, 62, 67, 62తో విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ జయభేరి మోగించాడు. ఇజ్రాయిల్ ఆటగాడు దుది సెలాతో జరిగిన పోరులో 63, 63, 62 తేడాతో విజయం సాధించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన నాదల్ ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో టాప్ సీడ్ హలెప్ కూడా రెండో రౌండ్‌కు చేరింది. ఏకపక్ష పోరులో హలెప్ 62, 64తో కరుమి నారా (జపాన్)ను ఓడించింది. మరో పోటీలో 12వ ఈడ్ జెలెనా ఒస్టాపెంకా (లాత్వియా) జయభేరి మోగించింది.

ఎదురులేని ఫెదరర్

fedarer

టాప్ సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) తన జోరును కొనసాగిస్తున్నాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్ పోరులో ఫెదరర్ సునాయాస విజయం సాధించాడు. స్లోవేకియా ఆటగాడు లుకాస్ లాక్‌తో జరిగిన పోటీలో 64, 64, 61తో జయకేతనం ఎగుర వేశాడు. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన ఫెదరర్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా మూడు సెట్లు గెలిచిన డిఫెండింగ్ చాంపియన్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ విజేత, అమెరికా వెటరన్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో తొమ్మితో సీడ్ వీనస్ 46, 60, 61తో అలెగ్జాండ్రా దుల్గెరు (రుమేనియా)ను ఓడించింది.

Comments

comments