Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మద్యం షాపులకు ముహూర్తం కుదిరింది..!

wine-shops

మెదక్: రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ఖరారు చేయడంతో జిల్లాలో వైన్ షాపుల వేలానికి రంగం సిద్దమైంది. ఫలితంగా జిల్లాలోని మద్యం వ్యాపారుల్లో కదలిక మొదలైంది. సమయం కూడా చాలా తక్కువగా ఉండడంతో వ్యాపారులు, వారి అనుంగు సహచరులు, కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకునే వారు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఇక గతంలో వ్యాపారంలో ఉండి షాపులు మిస్సయిన వారు కసితో ఉన్నారు. చాలా ప్రాంతాల్లో మద్యం వ్యాపారంతో ముడిపడి రాజకీయాలు కొనసాగుతుండడంతో ఈ షాపులకు డిమాండ్ ఏర్పడింది. కొత్త పాలసీకి సంబంధించి అనేక ఊహాగానాలు, ప్రచారాలు జరిగిన నేపథ్యంలో తిరిగి పాత పాలసీనే ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త పాలసీ ఖరారు కావడంతో తిరిగి ఈ షాపులకు వేలం వేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త షాపులు వస్తాయి. గతంలో పటాన్‌చెరు పరిధిలోని 16 షాపులకు టెండర్లు దాఖలు కానే కాలేదు. అనేక సార్లు టెండర్లు పిలిచినా ఒక్కరంటే ఒక్కరు కూడా టెండర్లు వేయలేదు. ఈ సారి కొత్త పాలసీలో కూడా ఈ షాపులకు టెండర్లు దాఖలు కావడం కష్టమే. ఎందుకంటే ఈ సారి లైసెన్సు ఫీజులను మరో 20 శాతం పెంచారు. అంటే పటాన్‌చెరు, ఆర్‌సిపురం పరిధిలోని షాపులకు ఒక కోటి ఎనిమిది లక్షలకు ఫీజు పెరిగింది. 90 లక్షలు ఉన్నప్పుడే ఒక్కరు కూడా టెండర్ వేయకపోవడంతో… దానికి మించి పెంచితే ఇక ఎవరు వస్తారని ఒక ఎక్సైజ్ అధికారి వ్యాఖ్యానించారు.

10 వేల జనాభా ఉన్న ప్రాంతానికి కొత్త పాలసీలో 78 లక్షలు, 10నుంచి 50 వేల జనాభా ఉంటే 81.06 లక్షలు, 50 నుంచి 3 లక్షల జనాభా ఉన్న ప్రాంతానికి కోటి 80 వేలు లైసెన్సు ఫీజుగా ఉంది. ఇక ప్రభుత్వ పాలసీ ప్రకారం సోమవారం జిల్లాలో మద్యం షాపులకు నోటిఫికేషన్ జారి అవుతుంది. జిల్లాలోని మెదక్, సంగారెడ్డి ఇఎస్‌ల పరిధిలోని షాపులన్నింటికి కూడా సంగారెడ్డిలోని ఇఎస్ కార్యాలయంలోనే దరఖాస్తులు అంటే టెండర్లు స్వీకరిస్తారు. ఈ నెల 21 వరకు టెండర్ల స్వీకరణ ఉంటుంది. 22న టెండర్ల పరిశీలన జరుగుతుంది. ఆ మరుసటి రోజే లాటరీ నిర్వహించి టెండర్లను ఖరారు చేస్తారు. 23న వైన్ షాపులు దక్కిన వారికి తాత్కాలిక పద్దతిలో లైసెన్సులు జారీ చేస్తారని, ఆ తర్వాత ఈనెల 28న అధికారిక లైసెన్సులు ఇస్తారని తెలుస్తోంది. ప్రతి మండలంలో షాపులు ఉంటున్న కారణంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మద్యం లైసెన్సుల హడావిడి మొదలైంది.

Comments

comments